– రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్
అమరావతి : కొబ్బరి ద్వారా విలువ ఆధారిత పరిశ్రమలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు పారిశ్రామిక క్లస్టర్లను ప్రతిపాదించిందని, యంఎస్ఈ-సిడిపి పథకం కింద రాజోలు నియోజకవర్గం పెదపట్నం లంకలో రూ. 9.96 కోట్ల వ్యయంతో రెండు ఎకరాలలో కామన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
శాసనసభలో శుక్రవారం ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా మంత్రి మాట్లాడారు. కొబ్బరి విలువ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు రాజోలు నియోజకవర్గం లోని తూర్పు పాలెం, అమలాపురం నియోజకవర్గం మామిడికుదురు మండలం పెదపట్నం లంక ఉప్పలగుప్తంలో ఈ పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని మంత్రి సమాధానమిచ్చారు.
రాజోలు నియోజకవర్గంలో కొబ్బరి సాగు విస్తీర్ణం 25 వేల ఎకరాలలో ఉందని, వార్షిక ఉత్పత్తి 30 నుంచి 40 కోట్ల కొబ్బరికాయలు ఉంటుందని అన్నారు. ప్రస్తుతం రైతులు కొబ్బరికాయల తొక్కలు తీసి, ఎండు కొబ్బరికాయలను తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల మార్కెట్లకు పంపుతున్నారని, అక్కడే ప్రాసెసింగ్ చేసి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేస్తున్నారని చెప్పారు. దీనికి కారణం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సమగ్ర కొబ్బరి ప్రాసెసింగ్ పరిశ్రమలు లేకపోవడమేనని, దీనిపై అధ్యయనం చేసి జిల్లా స్థాయిలో చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
జిల్లా యంత్రాంగం మూడు పారిశ్రామిక క్లస్టర్లు ప్రతిపాదించిందని వీటిలో కొబ్బరి సంపూర్ణంగా భాగాలను వినియోగిస్తూ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడానికి ప్రతిపాదించడం జరిగిందన్నారు. కొబ్బరి డొక్కు ద్వారా కాయిర్ ఉత్పత్తులు, కాయిర్ పిత్ బ్లాకులు, జియో టెక్స్టైల్స్, కాయిర్ హస్తకళలు, కోకో లాన్, సోడియం లిగనో సల్ఫోనేట్, కొబ్బరి టెంకెతో హస్తకళలు, బొగ్గు, యాక్టివేటెడ్ కార్సన్, కొబ్బరి నీరుతో ప్యాకేజ్ వాటర్, నాటా-డే-కోకో, కొబ్బరి నీటి పొడి, ఎండు కొబ్బరి కాయతో వర్జిన్ ఆయిల్, లారిక్ యాసిడ్, ఎమ్.సి.టి. పొడి, చిప్స్, కొబ్బరి పాలు, పాల పొడి, డిసికేటెడ్ పొడి వంటి ఉత్పత్తుల తయారీకి ప్రతిపాదించామని చెప్పారు.
ప్రస్తుతం నియోజకవర్గంలో 4 కొబ్బరి పీచు తయారీ యూనిట్లు, 18 కొబ్బరి చాప తాయారీ యూనిట్లు, 30 తాళ్ల తయారీ యూనిట్లు, 120 కొబ్బరి తయారీ యూనిట్లు వంటి అనేక చిన్న, మధ్య తరహా కొబ్బరి ఆధారిత పరిశ్రమలు ఉన్నాయని అన్నారు. జిల్లాలో పెద్ద ఎత్తున ప్రాసెసింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల కాయలను స్థానికంగా పీచు తీసి తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి పొరుగు రాష్ట్రాలకు తదుపరి ప్రాసెసింగ్ కోసం పంపుతున్నారని, యంఎస్ఈ-సిడిపి పథకం కింద రాజోల్ నియోజకవర్గంలోని మామిడికుదురు మండలం పెదపట్నం లంకలో కామన్ పెసిలిటీ సెంటర్ ఏర్పాటు కోసం వివరణాత్మక ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశామని అన్నారు.
ప్రతిపాదిత ప్రాజెక్ట్ రెండు ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్దం చేశామని, కొబ్బరి పొడి, నూనె, పాలు వంటి కొబ్బరి ఆధారిత విలువ ఆధారిత ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంతో పాటుగా, నిల్వ సౌకర్యాలు, పరీక్షా కేంద్రంపై కావలిసిన సౌకార్యాలపై దృష్టి సారిస్తామని మంత్రి తెలిపారు. మంత్రి ప్రసంగంపై జోక్యం చేసుకున్న రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కడియం మండలంలో కొబ్బరి పరిశ్రమ ఏర్పాటుకు, కొబ్బరి పరిశోధనా కేంద్రానికి 10 ఎకరాల భూమి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నామని చెప్పారు.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలుపగా ఈ విషయాన్ని ఖచ్చితంగా పరిశీలించి, అధికారులతో చర్చించి ముందుకు వెళ్తామని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వరప్రసాద్ చేసిన సూచనపై పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమిని గుర్తించి నివేదిక ఇవ్వాలని కలెక్టరును కోరతామని, తద్వారా ఈ పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు చేసి కొబ్బరి ద్వారా విలువ ఆధారిత ఉత్తత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమనం చేస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శాసనసభలో హమీ ఇచ్చారు.