– డీకేకు మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్
– కంపెనీలు తేవడమే కాదు కౌంటర్లు ఇవ్వడం కూడా తెలుసు
అమరావతి: భారీ వర్షాలు, నిర్వహణ లోపాలతో గుంతలమయమైన బెంగళూరు రహదారులు జాతీయస్థాయి చర్చకు తెరతీశాయి. రోడ్లన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయంటూ ‘బ్లాక్‌బక్’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్ యాబాజీ చేసిన పోస్ట్‌పై కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేసిన వేళ.. ఏపీ మంత్రి నారా లోకేశ్ దీనిపై మరోసారి స్పందించారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఇటీవల సీఈఓ రాజేశ్ యాబాజీ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ పెట్టారు. ‘‘గతంలో ఇంటినుంచి కార్యాలయానికి వెళ్లి రావడం తేలికగా ఉండేది. ఇప్పుడు అది కఠినంగా మారిపోయింది. ఆఫీసుకు రావాలంటే మా ఉద్యోగులకు గంటన్నర పడుతుంది. రహదారులన్నీ గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి. గత ఐదేళ్లలో ఈ పరిస్థితుల్లో మార్పేమీ రాలేదు. మేము ఇక్కడినుంచి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నాం’’ అంటూ రాసుకొచ్చారు.
అది లోకేశ్ దృష్టికి చేరడంతో..‘‘హాయ్ రాజేశ్, మీ కంపెనీని విశాఖకు మార్చుకునేందుకు నేను ఆసక్తి చూపిస్తున్నా. భారత్‌లోని అత్యుత్తమ ఐదు పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి. భారత్‌లోని అత్యుత్తమ ఐదు పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ ఒకటి. అక్కడ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. మహిళలకు అత్యంత సురక్షిత నగరంగా గుర్తింపు ఉంది. దయచేసి నాకు నేరుగా సందేశం పంపండి’’ అంటూ ఆహ్వానించారు.
ఈ విషయంపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ఇలాంటి బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ను ప్రభుత్వం కనీసం పట్టించుకోదంటూ సీఈఓ పోస్ట్‌కు ఘాటుగా బదులిచ్చారు. బెంగళూరు నగరం ప్రపంచసంస్థలకు ఆకర్షణీయ ప్రాంతంగా ఉందని పేర్కొన్నారు. రోడ్డు మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.1,100 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. గుంతలు సరిచేయడానికి కాంట్రాక్టర్లకు నవంబర్ వరకు డెడ్‌లైన్ ఇచ్చామని చెప్పారు.
శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా నారా లోకేశ్ స్పందించారు. ఆయన వాడిన ‘బ్లాక్మెయిల్’ పదానికి పరోక్షంగా బదులిచ్చారు. ‘‘ఇతర రాష్ట్రాలకు, ఏపీకి ఉన్న తేడా ఇదే. మా ప్రజల ఫిర్యాదులను మేం బ్లాక్మెయిల్ అంటూ తోసిపుచ్చబోం. మేం వాటిని మర్యాదపూర్వకంగా స్వీకరించి, పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం’’ అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.