– సిజిహెచ్ఎస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సిహెచ్.కోటేశ్వరరావు
గుంటూరు: ఒకప్పుడు అరుదుగా ఎక్కడో.. ఎవరికో వచ్చే క్యాన్సర్ వ్యాధి, ఇప్పుడు విపరీతంగా విజ్రంభిస్తుందని, కారణాలేవైనా గానీ, ప్రతి ఒక్కరూ తమ జీవన విధానాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిజిహెచ్ఎస్ (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం) చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి.సిహెచ్. కోటేశ్వరరావు అన్నారు.
స్వస్ట్ నారీ సశక్ట్ పరివార్ అభియాన్ కార్యక్రమాల్లో భాగంగా గుంటూరు నగరంపాలెం లోని సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ లో ‘ ఆర్క ‘ క్యాన్సర్ హాస్పిటల్ సౌజన్యంతో మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ పరీక్ష శిబిరాన్ని శనివారం డాక్టర్ కోటేశ్వరరావు ప్రారంభించి, మాట్లాడారు. దీనికి సిజిహెచ్ఎస్ సీనియర్ మెడికల్ డాక్టర్ వి.విద్య అధ్యక్షత వహించారు.
కోటేశ్వరరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ..అదుపు తప్పిన జీవన శైలి కారణంగా వయసు తక్కువ వారికి కూడా క్యాన్సర్లు కాటేస్తున్నాయన్నారు. ఎక్కువ మంది బయట తిండికి అలవాటుపడుతున్నారని, రంగు, రుచి కోసం వాటిలో వాడే ప్రమాదరకర పదార్ధాలతో పాటు, పాడైనా ఆహారాన్ని అంటగట్టే అనైతిక వ్యాపార దొరణుల వల్ల కాన్సర్లు పంజా విసురుతున్నాయన్నారు. ప్రతి యేటా కాన్సర్ మరణాల సంఖ్య క్రమేపి పెరుగుతుందని, వచ్చే 20-40 ఏళ్ళలో బాదితుల సంఖ్య, మరణాల సంఖ్య వంద శాతం పెరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
సిజిహెచ్ఎస్ సీనియర్ డాక్టర్ వి. విద్య మాట్లాడుతూ.. అనారోగ్యకర ఆహార అలవాట్లను అందరూ వదిలించుకోవాలన్నారు. క్యాన్సర్ పట్ల భయాలు వీడాలన్నారు. మొదటి, రెండు దశలోనే గుర్తించి, వైద్యమందిస్తే క్యాన్సర్ ను జయించవచ్చునన్నారు. క్యాన్సర్ ను ముందుగా నివారించడమే మేలైన వ్యూహమన్నారు. క్యాన్సర్ కు చికిత్స సాధ్యం కాదన్నది ఒకనాటి మాట అని, సాధ్యమని చెప్పడమే ఈనాటి నినాదమన్నారు.
ఆర్క హాస్పిటల్ రెడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎం. హిమని మాట్లాడుతూ..క్యాన్సర్ కంటే, దాని చికిత్స ప్రక్రియ చాలా బాధగా ఉంటుందనేది కేవలం వదంతి, అపోహ మాత్రమేనన్నారు. ఎంత త్వరగా క్యాన్సర్ ను గుర్తిస్తే, తగ్గే అవకాశాలు అంతగా పెరుగుతాయన్నారు. ఈ వ్యాధి పట్ల తగినంత అవగాహన లేక, చికిత్సను ఆలస్యం చేసుకొని, ముప్పును ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పుడున్న ఆధునిక వైద్య చికిత్సతో క్యాన్సర్ ను తప్పక నయం చేయవచ్చునన్నారు.
అనంతరం అరవై మూడు మంది మహిళలకు బ్రెస్ట్ ఎగ్జామినేషన్, పాప్ స్మియర్ పరీక్షలు నిర్వహించి, తగు జాగ్రత్తలతో పాటు, మందులు పంపిణి చేసారు. క్యాన్సర్ శిబిరాన్ని ఏర్పాటు చేసిన అర్క హాస్పిటల్ ఆంకాలజీ డాక్టర్లు మాకినేని హేమంత్, పవన్ రాఘవరెడ్డి, రాజు నాయుడు, హిమని లకు సిజిహెచ్ఎస్ డాక్టర్లు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి. హేమా సుందరి, ఫార్మాసిస్టులు అయేషా బేగం సయ్యద్, సునీల్ సిబ్బంది మురళి కృష్ణ, రామారావు, మోహన్, మక్బుల్, వెంకటేశ్వర్లు, రత్నరాజు, నందమణి ఆర్క ఆసుపత్రి ప్రతినిధులు ఆదిరెడ్డి, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.