తెలంగాణ అస్తిత్వానికీ, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ తర తరాల ప్రతీకగా నిలిచిందని, పూలను దేవతగా కొలిచే బతుకమ్మ పండుగ, ప్రపంచ సంస్కృతీ సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రత్యేకతను చాటుతున్నదనీ,. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
ఆదివారం నుండి ప్రారంభమవుతున్న ఎంగిలి పూల బతుకమ్మ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఎంగిలి పూలతో ప్రారంభమై సద్దులతో ముగిసే తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ, పల్లెలు పట్టణాలో.. మహిళలు పిల్లా పాపలతో ప్రత్యేక సాంస్కృతిక సందడి నెలకొంటుందని కేసీఆర్ తెలిపారు.
సబ్బండ వర్గాల భాగస్వామ్యంతో, నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో, తెలంగాణ అస్తిత్వ ఆకాంక్షలకు బతుకమ్మ ప్రధాన సాంస్కృతిక వేదికగా నిలిచిందని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ’ను రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, తెలంగాణ మహిళల ప్రత్యేక పండుగగా గుర్తించి కానుకగా బతుకమ్మ చీరలు అందజేసామన్నారు. కష్టాలనుంచి రక్షించి రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రకృతి మాత బతుకమ్మ ను కేసీఆర్ ప్రార్థించారు.