– పరిశ్రమలు కాలుష్యం వెదజల్లకుండా తీసుకోవలసిన నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదా?
– ఫార్మా పరిశ్రమల కాలుష్యంతో లంకెలపాలెం నాశనం అవుతుంది
– సొసైటీ ఫర్ బెటర్ పరవాడ గౌరవ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు
విశాఖ: పరిశ్రమల స్థాపన పేరుతో ప్రకృతిని విధ్వంసం చేసి కాలుష్యాన్ని వెదజల్లుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోకపోతే లంకెలపాలెం పరిసర ప్రాంతాల్లోని ప్రజలు బ్రతికే పరిస్థితి లేదని సొసైటీ ఫర్ బెటర్ పరవాడ గౌరవ అధ్యక్షుడు మడక రమేష్ నాయుడు అన్నారు .
ఉద్యోగాలు, రాబడులు, ఆర్థిక వ్యవస్థల సంగతి పక్కన పెడితే ప్రజలు బతికుండడం కూడా కష్టంగా మారే పరిస్థితి నెలకొంటుందని ఆయన వాపోయారు. రెండు రోజుల క్రితం అసెంబ్లీలో రామ్ కి ఫార్మా పై విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బొండా ఉమా చేసిన విమర్శలపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతుండడం అందరికీ తెలిసిందే. అయితే రాజకీయ పార్టీలకు ఈ విషయం ఏరకంగా కలిసొస్తుందో తెలీదు గానీ, రామ్కీ ఫార్మా నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థ జలాలను సముద్రంలో కలపడం మరియు వ్యర్ధాలను ఎక్కడపడితే అక్కడ వెదజల్లడం అనేది 100% నిజం అని మడక రమేష్ నాయుడు అన్నారు. ఫార్మాసిటీ నిర్మాణం ద్వారా తమ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి అని ఆశపడిన తల్లిదండ్రుల ఆశలు అడియాసలు చేసి, కాలుష్యాన్ని గ్రామాల మీదకు తెచ్చి, కనీసం బోర్లు వేసుకొని ఇళ్లల్లో మంచినీరు త్రాగడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి లంకెలపాలెం పరిసర ప్రాంతాల ప్రజలకు వచ్చిందన్నారు.
అదేవిధంగా ఈ ఫార్మా పరిశ్రమలకు ప్రతిరోజు ప్రయాణం చేసే ఉద్యోగులు మరియు ఫార్మా బస్సుల ట్రాఫిక్ తో లంకెలపాలెం జంక్షన్ నిరంతరం రద్దీగా తయారై, ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. స్లో పాయిజన్ల ప్రజల శరీరాల్లోకి ప్రవేశిస్తున్న ఈ కాలుష్యంతో ప్రజలు అంతుపట్టని వ్యాధులు బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫార్మా కాలుష్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు.
ప్లాస్టిక్ వాడటం వలన కాలుష్యం వెదజల్లుతుంది అని చెబుతున్న పర్యావరణవేత్తలు ఈ ఫార్మా కాలుష్యంపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ఆయన ప్రశ్నించారు. ఎంతో ప్రశాంతంగా జీవించే తమ బ్రతుకులను కాలుష్యం పాలు చేసి, కనీసం స్థానికులకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వకుండా వారి పబ్బం గడుపుకుంటున్న ఫార్మా యాజమాన్యాల తీరు ఎంతో బాధాకరమని ఆయన అన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫార్మా కాలుష్యంపై దృష్టి పెట్టి ఇక్కడ ప్రజలను కాపాడాలని కోరారు.