– రాష్ట్ర ప్రాజెక్టుల్లో భాగస్వాములుకండి
– బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను కోరిన సీఎం చంద్రబాబు
అమరావతి : అమరావతిలో రీజనల్ ఆఫీసు ప్రారంభించాలని, అలాగే రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివిధ బ్యాంకుల చైర్మన్లు, ఎండీలను కోరారు. లోక్సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడ వచ్చిన పలు బ్యాంకుల చైర్మన్లు, ఎండీలకు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం హైటీ విందు ఇచ్చారు. రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులు గురించి వారికి వివరించారు.
అమరావతిని అంతర్జాతీయ స్థాయి నగరంగా నిర్మిస్తున్నందున విస్తృత అవకాశాలు అందిపుచ్చుకోవాలని అన్నారు. ఇప్పటికే వివిధ బ్యాంకులకు రాజధానిలో స్థలాలు కేటాయించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. 15 నెలల కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, కేంద్ర సహకారంతో చేపట్టిన ప్రాజెక్టుల గురించి వారికి తెలిపిన ముఖ్యమంత్రి… పోర్టులు, ఎయిర్ పోర్టులు, హార్బర్లు, జాతీయ రహదారులు, క్వాంటం వ్యాలీ తదితర పనుల పురోగతిని వివరించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పాలసీలు, ప్రణాళికల గురించి చెప్పారు. విద్యుత్, వ్యవసాయం, ఇరిగేషన్, విద్య, వైద్య రంగాల్లో, పౌర సేవల్లో టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నామని అన్నారు.
ఈ సమావేశానికి మంత్రులు పయ్యావుల కేశవ్, పి నారాయణ, ఎంపీ బాలశౌరి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ శ్రీనివాసులు శెట్టి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ రామ సుబ్రమణ్యన్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ దేవదత్త చంద్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ అశోక్ చంద్ర, ఇండియన్ బ్యాంక్ ఎండీ బినోద్ కుమార్, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎండీ రజనీష్ కర్నాటక్, కెనరా బ్యాంక్ ఎండీ సత్యనారాయణ రాజు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ పరమేందర్ చోప్రా, ఐఆర్డీఏఐ చైర్ పర్సన్ అజయ్ సేత్, నేషనల్ ఇన్సూరెన్స్ చైర్మన్ రాజేశ్వరీ సింగ్ ముని, ఎల్ఐసీ ఎండీ సత్పాల్ భాను, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సీఎండీ భూపేష్ సుశీల్ రాహుల్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ సీఎండీ సంజయ్ జోషీ, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా ఈడీ సంజయ్ లాల్లా తదితరులు హై టీలో పాల్గొన్నారు.