తెలంగాణా స్థానికసంస్థల ఎన్నికలు సెప్టెంబర్ ముప్పై లోపు పూర్తి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు జరగటం కష్టం అని అర్ధమవుతున్నది. రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వెళ్లి కొంత గడువు తీసుకోవటం కష్టం కాదు కానీ బీసీ రిజర్వేషన్ సమస్య తేలేవరకు ఎన్నికలు జరపలేము అంటే కోర్టు ఒప్పుకబంతి కేంద్రం కోర్టులో ఉన్నది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శాసనసభ ఎన్నికల ప్రధాన వాగ్దానమే బీసీ రిజర్వేషన్. అందుకనుగుణంగానే ప్రభుత్వం ఏర్పడగానే ఎస్ఈఈఈసి సర్వేని నిర్వహించింది. సామాజిక సర్వేతో పాటు విద్యా ఉపాధి, ఆర్థిక, రాజకీయ రంగాలలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల స్థితిగతులను అంచనా వేయటానికి నిర్వహించిన ఈసర్వేలో బీసీ జనాభా 56 శాతంగా ఉన్నదనే విషయం వెలుగులోకి వచ్చింది.
సర్వేలోని అనేక అంశాలను పరిశీలించిన తెలంగాణ ప్రభుత్వం, బీసీ లకు విద్యా ఉపాధి రంగాలలో 42 శాతం రిజర్వేషన్ కలిపించాలని ఒక బిల్లును, స్థానికసంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ ను అమలు చెయ్యాలని మరొక బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టటం జరిగింది. అవి ఆమోదం పొందాయి. రెండుబిల్లులను అప్రూవల్ కోసం గవర్నర్ కు పంపించారు.
గవర్నర్లకు సంవత్సరాల తరబడి పెండింగులో పెట్టి వుంచుకునే అధికారం లేదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో తన బాధ్యతను రాష్ట్రపతికి అప్పగించి రాష్ట్ర గవర్నర్ చేతులు దులుపుకున్నారు. గతంలో గవర్నర్లకు, రాష్ట్రపతికి బిల్లులు క్లియర్ చేయటానికి కాలవ్యవధిని నిర్ధారిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్లారిఫికేషన్ కోరుతూ రాష్ట్రపతి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
అది పెండింగులో ఉన్న సమయంలో తెలంగాణ గవర్నర్ పంపించిన బీసీ రిజర్వేషన్ బిల్లులను రాష్ట్రపతి పెండింగులో పెట్టారు. ఆ కేసు సుప్రీమ్ కోర్టులో పెండింగులో ఉన్నంత కాలం రాష్ట్రపతిని తప్పుపట్టే అవకాశం రాష్ట్రప్రభుత్వాలకు లేదు. రాజ్యాంగం రాష్ట్రపతికి కాలవ్యవధి నిర్ధారించలేదు కాబట్టి, తెలంగాణా ప్రభుత్వం పంపించిన బిల్లులకు ఎప్పడు మోక్షం వస్తుందనేది కేంద్రప్రభుత్వానికి మాత్రమే తెలుస్తుంది.
బీజేపీ పాలిత రాష్ట్రప్రభుత్వాలకు ఈ సమస్య వుండదు. ఇది గమనించిన తెలంగాణా ముఖ్యమంత్రి, తాము తీర్మానించి పంపిన బిల్లులను కేంద్రం, రాష్ట్రపతి పెండింగులో పెట్టటం అప్రజాస్వామికం అంటూ ఢిల్లీ జంతర్ మంతర్ లో ధర్నా చేశారు. ఇప్పుడు తెలంగాణా శాసనసభ ఆమోదించిన బిల్లుల చుట్టూ తెలంగాణా రాజకీయం నడుస్తున్నది. ఒకవైపు స్థానికసంస్థల ఎన్నికలు జరపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచుతున్నాయి.
42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లులు పెండింగులో ఉన్నాయి. ముఖ్యమంత్రి ఢిల్లీలో ధర్నా చేయటం వెనుక కూడా అవసరం కంటే రాజకీయ వ్యూహం ఉన్నది అనేవారూ లేకపోలేదు. ఇప్పుడు రిజర్వేషన్ బిల్లులు కేంద్రం చేతుల్లో ఉన్నాయనేది వాస్తవం. మనదేశంలో రాష్ట్రపతులు, గవర్నర్లు కేంద్రప్రభుత్వ నామినేటెడ్ పోస్టులు అనేది అందరికీ తెలిసిన ఒప్పుకోలేని నిజం.
రిజర్వేషన్ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం పొందాలంటే కేంద్రం పచ్చజెండా ఊపాలి. అలా గ్రీన్ సిగ్నల్ ఇస్తే, బీసీ రిజర్వేషన్ లను చిత్తశుద్ధితో అమలుచేసిన రాష్ట్రంగా తెలంగాణాకు ఖ్యాతి రావటమే కాక, బీసీ రిజర్వేషన్స్ అమలు చేసిన ప్రభుత్వంగా రాష్ట్ర కాంగ్రెస్ కు బలం చేకూరే అవకాశం వుంటుంది. దాని ప్రభావంతో స్థానికసంస్థల ఎన్నికలలో విజయం సాధించే అవకాశం తెలంగాణా కాంగ్రెసుకు వుంటుంది.
ఒకవేళ బిల్లులను పెండింగులోనే వుంచితే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వటం భారతీయ జనతా పార్టీకి ఇష్టంలేదు అని తెలంగాణా సమాజం భావించే అవకాశం ఉంటుంది. భారత రాష్ట్ర సమితి పార్టీకి ఎవరిని సపోర్టు చేయాలో తెలియని పరిస్థితి. బీసీ రిజర్వేషన్ అనేది చాలా సున్నితమైన సమస్య. బిల్లులు పెండింగులో పెట్టిన కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తే అన్యాపదేశంగా నైనా కాంగ్రెసును బలపరిచినట్లు అవటమే కాక, పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేని బీసీ రిజర్వేషన్స్ కాంగ్రెస్ చేసింది అని తానే ఒప్పుకున్నట్లు అవుతుంది.
బీజేపీ ని ఖండించే పరిస్థితి బీఆర్ఎస్ కు లేదనేది వాస్తవం. రాష్ట్రంలో బీజేపీకి కూడా ఇది గడ్డుసమస్యే. ఏదో సాధారణ ప్రకటనలు చేయటం మినహా విధానపరమైన విషయం గురించి కూలంకుషంగా చర్చించే అవకాశం కూడా లేదు. బీజేపీని రాజకీయంగా దెబ్బతీయటానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేశారు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
రేవంత్ రెడ్డికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినా లాభమే, పెండింగులో ఉంచినా లాభమే. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం అని ఢిల్లీలో ధర్నాచేయటం ద్వారా భారతీయ సమాజానికి రేవంత్ రెడ్డి తెలిపినట్లు అయింది. చివరికి బీసీ రిజర్వేషన్ బిల్లు రాజకీయ క్రీడలో ఒక భాగం అయ్యింది.
రాష్ట్రపతి ఆమోదం తెలపగానే బీసీ రిజర్వేషన్ అమలుకు రాజబాట వేసినట్లు కాదు. రిజర్వేషన్స్ 50 శాతం దాటకూడదనే సుప్రీంకోర్టు ఆదేశాలు ఈ బిల్లును తాకకుండే వుండాలంటే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలు లోకి చేర్చాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏ రాష్ట్రంలోనైనా రిజర్వేషన్ యాభై శాతం సీలింగును దాటాలి అంటే ట్రిపుల్ టెస్టు నిబంధనను తూచ తప్పకుండా పాటించాలి.
ఖచ్చితమైన కులగణను చేయాలి, ఆయాకులాలవారి సామాజిక వెనుకబాటు తనాన్ని అధ్యయనం చేసి నిరూపించాలి. వారి వెనుకబాటుతనం ఆధారంగా నిర్ధారించే రిజర్వేషన్ అమలుకు అడ్డంకులు రాకుండా చూడాలి. నిబంధనలకు అనుగుణంగానే సర్వే నిర్వహించామని రాష్ట్రప్రభుత్వం చెబుతున్నది.
సర్వే చేసిన విధానాన్ని ప్రతిపక్షాలు మూస ధోరణిలో విమర్శిస్తున్నాయే కానీ చేసిన విధానంలో ప్రత్యేకంగా ఏ అంశంలో నిబంధనలను పాటించలేదో చెప్పలేక పోతున్నారు. అంటే విధానపరమైన తప్పులు జరగలేదని బీఆర్ఎస్, బీజేపీ ఒప్పుకున్నట్లుగానే భావించాలి.
బిల్లులకు శాసనసభలో ఆమోదం తెలిపినా కానీ, తాము బీసీ రిజర్వేషన్సుకు వ్యతిరేకం అని కాంగ్రెస్ తమపై అసత్యారోపణలు చేస్తున్నది అని రాష్ట్ర బీజేపీ నాయకులు ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. అయితే రాష్ట బీజేపీకి రిజర్వేషన్ ఇష్టం వున్నప్పుడు, కేంద్రంలో ఉన్న బీజేపీకి ఇష్టంలేక బిల్లులను ఆమోదించటం లేదా అంటూ కాంగ్రెస్ వెలిబుచ్చే సందేహానికి రాష్ట్ర బీజేపీ నాయకులు సమాధానం చెప్పలేకపోతున్నారు.
కేంద్రప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. కానీ ఈలోపుగానే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాత్రం తెలంగాణా రాష్ట్రప్రభుత్వం ఆమోదించి పంపిన బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూలులో పొందుపరచటం సాధ్యం కాదని ప్రకటించేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని వర్ణవ్యవస్థ వలన వచ్చిన సామాజిక వెనుకబాటు తనానికి చరమగీతం పాడవలసిన ప్రభుత్వాలు, తమ రాజకీయ లబ్ధికి వారి వెనుకబాటు తనాన్ని ఉపయోగించుకోవటం మాత్రం శోచనీయం.
సామాజిక వెనుకబాటుతనాన్ని రూపుమాపవలసిన రాజకీయ పక్షాలు సామాజిక వర్గాలను ఓటుబ్యాంకుగా మార్చుకోవటం కాకుండా, వారి వెనుకబాటుతనం పోయే మార్గాలు అన్వేషిస్తూ, రాజకీయ వైరుధ్యాలను పక్కన బెట్టి సమిష్టి కృషి చేస్తారని ఆశిస్తూ.!
– ఇంద్రాణి