– విలేఖర్ల సమావేశంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు
హైదరాబాద్: బీజేపీ బలోపేతానికి పక్కా ప్రణాళిక వేసినట్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విలేఖర్లతో మాట్లాడారు. రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామ్ చందర్ రావు అధ్యక్షతన నూతనంగా నియమించబడిన రాష్ట్ర పదాధికారులతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణపై రామ్ చంద్రర్ రావు కీలక సూచనలు చేశారు. పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ గారు, జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు గారు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారని తెలిపారు. ఇంకా ఆయన ఏమన్నారంటే…
ఈ నెల 17నుంచి అక్టోబర్ 17 వరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే సేవా కార్యక్రమాలపై సమీక్ష, ప్రణాళిక రూపొందించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా పేదలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఎంఎస్ఎంఇ… ఇలా అనేక వర్గాలకు లబ్ధి కలిగేలా జీఎస్టీని తగ్గిస్తూ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన జీఎస్టీ కూడా అమలులోకి వచ్చింది. దీనిపై అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించేందుకు జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో వినియోగదారులను కలిసి వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అదేవిధంగా స్వదేశీ ఉద్యమంలో భాగంగా అన్ని జిల్లాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కూడా తీర్మానించారు. ముఖ్యంగా సెప్టెంబరు 30వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ జీవన ప్రయాణంపై ప్రత్యేకంగా ‘మేరా దేశ్ పహలే’ కల్చరల్ కార్యక్రమం హైటెక్ సిటీలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.
ఈ నెల 30వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ హైటెక్ సిటీలో “మేరా దేశ్ పహలే” కల్చరల్ కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 10 వేల మంది పాల్గొనే విధంగా కార్యక్రమం రూపొందించారు. అదేవిధంగా రాబోయే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
రాష్ట్రంలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు,… ప్రజాసమస్యల పరిష్కారంలో, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రాష్ట్ర ప్రభుత్వ నిరక్ష్య వైఖరిని ఎండగట్టేలా చేపట్టాల్సిన పోరాట కార్యాచరణపై విస్తృతంగా చర్చ జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజలకు చేసిన మోసాలను వివరించి ప్రజల్లో చైతన్యం కల్పించేలా అవగాహన కార్యక్రమాలను జిల్లాలు, అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు.
నేటి నుండి అసెంబ్లీ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాలను బీజేపీ విస్తృతంగా చేపట్టనుంది.
ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్ పాల్గొన్నారు