గన్నవరం : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి బుధవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో భారత ఉపరాష్ట్రపతి దంపతులు సీపీ రాధాకృష్ణన్, ఆర్.సుమతి చేరుకున్నారు. వీరికి రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వారి సతీమణి నారా భువనేశ్వరి ఘన స్వాగతం పలికారు.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ దర్శనం, విజయవాడ ఉత్సవ్ – 2025 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే నిమిత్తం ఉపరాష్ట్రపతి గన్నవరం చేరుకున్నారు. రాష్ట్ర మానవ వనరులు, ఐటీ, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి నారా లోకేష్, కృష్ణా జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర కార్మిక, కర్మాగారాలు, బాయిలర్లు, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్, రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ముఖేష్ కుమార్ మీనా, ప్రభుత్వ విప్ గన్నవరం నియోజకవర్గం శాసన సభ్యుడు యార్లగడ్డ వెంకట్రావు, రాజ్యసభ సభ్యుడు సాన సతీష్, బాపట్ల పార్లమెంట్ సభ్యుడు కృష్ణ ప్రసాద్ తెన్నేటి, పెనమలూరు, గుడివాడ, పామర్రు, పెడన, కైకలూరు నియోజకవర్గాల శాసన సభ్యుడు బోడె ప్రసాద్, వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజా, కాగిత కృష్ణ ప్రసాద్, డాక్టర్ కామినేని శ్రీనివాసరావు, కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడులూ భారత ఉపరాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలికారు.
విమానాశ్రయంలో పోలీసు గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ఉపరాష్ట్రపతి భద్రత బలగాల నడుమ ప్రత్యేక వాహనంలో రోడ్డు మార్గాన్న విజయవాడకు బయలుదేరి వెళ్లారు.