– అసెంబ్లీలో మంత్రి సవిత స్పష్టీకరణ
అమరావతి : శాసనసభ సమావేశాల్లో ఆరో రోజు గురువారం ఎమ్మెల్యే బత్తుల బాలరామకృష్ణ అడిగిన ప్రశ్నకు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత సమాాధానమిచ్చారు. మంత్రి మాటల్లోనే… మహిళా పక్షపాతి సీఎం చంద్రబాబు. ప్రతి ఇంటి నుంచి మహిళను పారిశ్రామిక వేత్తను తయారు చేయాలన్నది సీఎం చంద్రబాబు లక్ష్యం. అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో మహిళల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారు. 2019-24 మధ్య మహిళల సంక్షేమాన్ని గాలికొదిలేశారు. మళ్లీ సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు.
మహిళలకు టైలరింగ్ శిక్షణతో పాటు కుట్టు మిషన్ కూడా ఉచితంగా అందజేస్తున్నాం. రాష్ట్రంలో మహిళల కుట్టు శిక్షణ విజయంతంగా నిర్వహిస్తున్నాం. శిక్షణ పట్ల మహిళల్లో సంతోషం వ్యక్తమవుతోంది. శిక్షణకు హాజరయ్యే మహిళలను ఫేషీయల్ రికగ్నేషన్ సిస్టమ్ (ఎఫ్ఆర్ఎస్) హాజరు తీసుకుంటున్నాం. 90 రోజుల పాటు టైలరింగ్ శిక్షణ అందజేస్తున్నాం. శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్ ఉచితంగా ఇవ్వడమే కాకుండా సర్టిఫికెట్ కూడా ఇస్తున్నాం. గార్మెంట్ పరిశ్రమల్లో టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉపాధి లభించేలా ఆయా పరిశ్రమల యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుంటున్నాం.