కలెక్టర్ నాగరాణి నేతృత్వంలో అభివృద్ధి, పరిశుభ్రత కార్యక్రమాలు
భీమవరం, సెప్టెంబర్ 25: భీమవరం నగరాన్ని మరింత అందంగా మార్చే దిశగా అద్భుతమైన ముందడుగు పడింది. ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద పెద్ద ఎత్తున శుభ్రతా కార్యక్రమం నిర్వహించడంతో పాటు, మరోవైపు పార్క్ అభివృద్ధి పనులు మరింత ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చడలవాడ నాగరాణి ఆధ్వర్యంలో గురువారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ “రోటరీ సభ్యుల ఉదారత, అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయం. ప్రజలు భాగస్వామ్యం చేస్తే భీమవరం మరింత శుభ్రంగా, పచ్చగా, స్మార్ట్ సిటీకే ఆదర్శంగా నిలుస్తుంది” అని హర్షం వ్యక్తం చేశారు. పరిశుభ్రత, పచ్చదనం, ప్రజల సహకారం కలిసిన చోట అభివృద్ధి నిలువెత్తు సత్యం అవుతుందని ఈ కార్యక్రమం మరొకసారి రుజువు చేసింది.
రోటరీ క్లబ్ భీమవరం అధ్యక్షుడు కిషోర్, సభ్యులు సుబ్బారావు, జుపుడి సంజయ్ ముందుండి సహకరించారు. ఈ కృషి వల్ల ఎడ్వర్డ్ ట్యాంక్ భీమవరం ప్రజలకు వినోదం, విశ్రాంతి, పచ్చదనానికి ప్రతీకగా మారుతోంది. మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. మేప్మా ఆర్పీలు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సోమశేఖర్, వార్డు శానిటరీ సెక్రటరీలు, జిల్లా కార్మిక శాఖ అధికారులు, జీఎస్డబ్ల్యూడీ సెక్రటరీలు, శానిటేషన్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని, తమ శ్రమతో ట్యాంక్ పరిసరాలను మెరిసేలా తీర్చిదిద్దారు.