– సిజిహెచ్ఎస్ సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విద్య
మానవ శరీరంలో ముఖ్యమైన దంతాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సిజిహెచ్ఎస్ ( కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పధకం ) సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి. విద్య సూచించారు. స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం లో భాగంగా గురువారం నగరంపాలెం లోని సిజిహెచ్ఎస్ వెల్ నెస్ కేంద్రంలో అమరావతి డెంటల్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత దంత పరీక్షలు, దంత సమస్యలపై అవగాహనా సదస్సు జరిగింది.
సదస్సులో డాక్టర్ విద్య మాట్లాడుతూ..దంత సమస్యల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, అది ఇతర వ్యాధులకు దారితీయవచ్చునని తెలిపారు. నొప్పిలేని దంత సమస్యలను అశ్రద్ధ చేయరాదన్నారు. దంతాలకు హాని చేసే వాటిని దూరంగా ఉంచాలన్నారు. నిత్యం నీళ్లతో దంతాలను పుక్కిలిస్తే అవి ఆరోగ్యంగా ఉంటాయన్నారు.
దంత సంరక్షణ అనేది తరచూ వైద్యుల సమక్షంలో జరిగితే, భవిష్యత్తులో జరిగే అనర్ధాలను నివారించవచ్చునన్నారు. విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరూ దంత సంరక్షణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం, సామాజిక సేవా సంస్థలు ఉచిత దంత వైద్య శిబిరాలను తరుచూ నిర్వహిస్తూ, ప్రజల్లో అవగాహనా కల్పించాలని కోరారు.
అమరావతి డెంటల్ హాస్పిటల్ డాక్టర్లు సౌమ్య, కీర్తి మాట్లాడుతూ..దంత సమస్యలకు పలు ఆధునిక చికిత్స విధానాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. దంతాల పరిరక్షణ విధానాలను వారు వివరించారు. దంత వ్యాధులను ఆలస్యం చేస్తే ఎటువంటి దుష్ప్రభావాలు ఉంటాయో తెలిపారు.
అనంతరం డాక్టర్లు 79 మంది దంతాలను ఉచితంగా పరీక్షించి, సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సిజిహెచ్ఎస్ లోకల్ అడ్వైజరీ కమిటీ మెంబర్ గుమ్మడి సీతారామయ్య చౌదరి, సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ బి. హేమా సుందరి, జాన్ బీ, ఫార్మాసిస్టులు అయోషా, సునీల్, మురళీ కృష్ణ, రామారావు, మోహన్, మక్బుల్, రత్నరాజు,వెంకటేశ్వర్లు, నందమణి పాల్గొన్నారు.