– విద్యుత్ కుంభకోణం లిక్కర్ స్కాం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ
– ఇది షిరిడీ సాయి కంపెనీకి ప్రజాధనం దోచిపెట్టే కుట్ర కాదా ?
– ట్రాన్స్ఫార్మర్లు ఛత్తీస్‌గఢ్ రూ.75,496 కి కొంటే మీరు షిరిడి సాయి నుండి రూ.1,19,899 కి కొన్నారు
– మీరిప్పుడు చేసేది క్విడ్- ప్రో-క్వో కాదా?
– టెండర్ డాక్యుమెంట్ లు, పర్చేస్ ఆర్డర్ లను ఆన్లైన్ లో ఎందుకు పెట్టడం లేదు?
– ఆర్టీఐ రిక్వెస్ట్ లకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు?
– ఏ తప్పూ చేయనప్పుడు ప్రజాధనంతో కొనుగోలు చేసిన పరికరాల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?
– 5-స్టార్ ట్రాన్స్ఫార్మర్లు దేశంలో ఎక్కడా లేని ధరలకు కొని వ్యవసాయానికి ఎందుకు వాడుతున్నారు?
– విద్యుత్ శాఖ మంత్రికి సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధి ఏ.బీ. వెంకటేశ్వర రావు ప్రశ్నల వర్షం
విజయవాడ: సెంటర్ ఫర్ లిబర్టీ ఆంధ్ర ప్రదేశ్ లో భారీ ఎత్తున జరుగుతున్న విద్యుత్ కుంభకోణం ఆధారాల ను మీడియా ప్రతినిధుల ముందు ఉంచింది. విద్యుత్ శాఖలో అన్ని కొనుగోళ్లను జగన్ హయాంలో చక్రం తిప్పిన షిర్డిసాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకే మళ్లీ ఎలా కట్టబెడుతున్నారు? టెండరు వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారంటూ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌పై ప్రశ్నల వర్షం కురిపించింది.
సెంటర్ ఫర్ లిబర్టీ ప్రతినిధి, మాజీ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు మీడియా ముందుకొచ్చి.. షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌కు ఇస్తున్న కాంట్రాక్టుల వివరాలు, ఆ కంపెనీ అడ్డుగోలు దోపిడీతో నష్టపోతున్న ఖజానా వివరాలను బట్టబబయలు చేశారు.
విద్యుత్ కుంభకోణం లిక్కర్ స్కాం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువని, ఇది నలభై వేల కోట్ల రూపాయల స్కాం అని ఆధారాలు చూపింది. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే ఒక్క కంపెనీ దగ్గరే ప్రభుత్వం తొంభై శాతం ట్రాన్స్ఫార్మర్లు కొని, ఆ కంపెనీకి మార్కెట్ కన్నా నాలుగైదు రెట్ల లాభం సంపాదించి పెడుతున్న ఆధారాల ప్రతులను మీడియా ప్రతినిధులకు ఇచ్చింది.
వైసీపీ పాలనలో 92 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు పొందిన ఈ కంపెనీ, తెలుగు దేశం కూటమి పాలనలో కూడా అదే స్థాయిలో వ్యాపారం చేస్తోంది. ప్రభుత్వం ఈ కంపెనీ నుండి ఇతర రాష్ట్రాల కన్నా నలభై శాతం అధిక ధరలకు కొంటోంది.
ఈ అంశం మీద మంత్రి గొట్టిపాటి రవికుమార్ సెప్టెంబర్ 25, 2025న అసెంబ్లీలో స్పందించారు. పరికరాలను ఈ ప్రొక్యూర్మెంట్, కాంపిటేటివ్ బిడ్డింగ్ ద్వారా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
కొందరు శాసనసభ్యుల ప్రశ్నలకు 5 కోట్లు దాటిన కొనుగోళ్ళకు ఏపీఈఆర్సీ పర్మిషన్ తీసుకుంటున్నాము అని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక ప్రజావసరాలకు 5 స్టార్ రేటింగ్ ట్రాన్స్ఫార్మర్లను వినియోగిస్తున్నామని తెలిపారు
మంత్రి గారూ.. ఈ ప్రశ్నలకు బదులేదీ?
1) మీరు పారదర్శకంగా కొనుగోళ్లు చేస్తున్నప్పుడు, అన్ని టెండర్ డాక్యుమెంట్ లు, పర్చేస్ ఆర్డర్ లను ఆన్లైన్ లో ఎందుకు పెట్టడం లేదు? మేము పంపిన ఆర్టీఐ రిక్వెస్ట్ లకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు? ఏ తప్పూ చేయనప్పుడు ప్రజాధనంతో కొనుగోలు చేసిన పరికరాల వివరాలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నారు?
2) మీరు 5-స్టార్ ట్రాన్స్ఫార్మర్లు దేశంలో ఎక్కడా లేని ధరలకు కొని వ్యవసాయానికి ఎందుకు వాడుతున్నారు? వ్యవసాయానికి రోజుకి 9 గంటలకు మించి విద్యుత్తు ఇవ్వనప్పుడు, ఈ ట్రాన్స్ఫార్మర్ల వాడకం ఆర్థిక నష్టానికి దారితీస్తుందని మీకు తెలియంది కాదు. ఇది షిరిడీ సాయి కంపెనీకి ప్రజాధనం దోచిపెట్టే కుట్ర కాదా ? 2014-19 టీడీపీ పాలనలో వ్యవసాయానికి 5- స్టార్ ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు కొనలేదు, ఇప్పుడు ఎందుకు కొంటున్నారు?
3) ఈ ప్రెస్ నోట్-కి జత చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్ (page 5), పర్చెస్ ఆర్డర్ల (page 6) ఆధారాల ప్రకారం మీరు EEL-V టెండర్లను పిలిచి (page 4), దాని ఆధారంగా షిరిడి సాయికి ఆర్డర్ ఇచ్చి, EEL-III పరికరాలు తీసుకుంటున్నారు. ఇది నేరం కాదా?
4) Two star ట్రాన్స్ఫార్మర్లను తెలంగాణా (రూ.87,791), ఛత్తీస్‌గఢ్ (రూ.75,496), ఉత్తర్ ప్రదేశ్ (రూ. 73,101) కొంటే, ఆంధ్ర ప్రదేశ్ కూటమి ప్రభుత్వం రూ.119,899 కొన్నది. అదే 5-star ట్రాన్స్ఫార్మర్లను రూ.1,36,499 అరాచకపు ధరలకు కొన్నది. మీరు competitive bidding ద్వారా కొంటుంటే, ఈ నింగినంటే ధరలకు ఎందుకు కొంటున్నారు? షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్-కి పోటీగా ఎవరూ బిడ్డింగ్-లో పాల్గొనకుండా చేసి, ఈ దోపిడీ ధరలకు పరికరాలు కొంటున్న విషయం వాస్తవం కాదా?
5) 2017 టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏడు కంపెనీలు ట్రాన్స్ఫార్మర్లు సరఫరా చేయడానికి అర్హత సాధించాయి: తోషిబా, షిరిడీ సాయి, హై పవర్, విజయ్, SVR, కన్యకా పరమేశ్వరి, ట్రాన్స్‌కాన్. మరి ఇప్పుడు కేవలం షిరిడీ సాయి, తోషిబా కంపెనీలే ఎలా అర్హత సాధించాయి? అందులోనూ కేవలం షిరిడీ సాయికే 90% కాంట్రాక్టులు ఎట్లా వస్తున్నాయి?
6) మీ ప్రభుత్వం 40 కోట్ల రూపాయల ఎలెక్టోరల్ బాండ్స్ షిరిడీ సాయి దగ్గర గత ఎన్నికలకు ముందు తీసుకుందన్న విషయం వాస్తవం కాదా ? మీరిప్పుడు చేసేది క్విడ్- ప్రో-క్వో కాదా?
7) స్టార్ రేటింగ్ లో తేడావల్ల ధరల్లో కొంత తేడా ఉందని అసెంబ్లీలో చెప్పారు, కానీ ఒకే రేటింగ్ (2స్టార్) ట్రాన్స్ఫార్మర్లు ఛత్తీస్‌గఢ్ రూ.75,496 కి కొంటే మీరు షిరిడి సాయి నుండి రూ.1,19,899 కి కొన్నారు. దీనికి సమాధానం చెప్పగలరా?
8) ఇన్ని అవకతవకలకు ఆమోదముద్ర వేస్తున్న APERC వల్ల ఉపయోగం ఏమన్నా ఉందా?