అమరావతి: విభిన్న ఎక్సైజ్ అంశాలపై సోమవారం మంగళగిరి ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఖనిజ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షత వహించారు. ఆహార, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. ఎంఎస్ఎంఈ, ఎస్ఈఆర్పీ, ఎన్ఆర్ఐ వ్యవహారాల మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
సమావేశంలో బార్ ఏ ఆర్ ఈ టీ సమస్యపై చర్చ జరిగింది. మైక్రో బ్రూవరీ విధానం, డిజిటల్ పేమెంట్ల ప్రోత్సాహం, ప్రీమియం స్టోర్స్ ఏర్పాటు అంశాలు కూడా పరిశీలించారు. ప్రభుత్వం ఎక్సైజ్ రంగంలో పారదర్శకత, ఆధునికత, బాధ్యతాయుత వినియోగం కోసం ముందడుగు వేస్తోందని ఈ చర్చలు సూచించాయి. నియంత్రణతో పాటు వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త విధానాలు రూపొందించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి (ఎక్సైజ్, మైన్స్, సాధారణ పరిపాలన శాఖ –పాలిటికల్) ముఖేష్ కుమార్ మీనా, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్ చామకూరి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ పాల్గొన్నారు. అధికారులు సంబంధిత నివేదికలు సమర్పించి, అమలు విధానాలపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో వివరించారు.