– నా వెనక ఏ జాతీయ పార్టీ లేదు
– 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డ
– కొందరిలో స్వార్థం ప్రవేశించింది.. వారివల్ల కోట్లాది మంది బాధ పడొద్దన్నదే నా తపన
– చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న
– తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
లండన్ : తన వెనక ఏ జాతీయ పార్టీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.. తాను 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డానని తెలిపారు. దురదృష్టకర పరిస్థితుల్లో నిరుడు బతుకమ్మ సంబురాలకు దూరంగా ఉన్న తాను ఈ ఏడాది చింతమడక నుంచి లండన్ వరకు బతుకమ్మ వేడుకల్లో పాలు పంచుకున్నానని అన్నారు.
తెలంగాణ జాగృతి యూకే శాఖ ఆధ్వర్యంలో లండన్ లో నిర్వహించిన బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న అనంతరం అక్కడి తెలంగాణ బిడ్డలతో కవిత ముఖాముఖి ముచ్చటించారు. బతుకమ్మ సంబురాల కోసం తాను ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్పందన వచ్చిందని తెలిపారు. లండన్ లో పెద్ద ఎత్తున తెలంగాణ ఆడబిడ్డలు తరలిరావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.
ఈ ఏడాది తన స్వగ్రామం చింతమడకలో ఎంగిలిపూల బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న తాను ఆ తర్వాత కోల్ బెల్ట్ ప్రాంతమైన శ్రీరాంపూర్ లో వేడుకల్లో పాల్గొన్నానని తెలిపారు. ఆ తర్వాత హైదరాబాద్ లోని జాగృతి ఆఫీస్ లో బతుకమ్మ సంబురాలు నిర్వహించి, ఖతార్, మాల్టా, లండన్ లో బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్నానని చెప్పారు.
ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ లో చీలికలు రావొద్దనే ఎంత ఇబ్బంది అయినా తట్టుకొని నిలబడ్డానని.. పార్టీ బాగుండాలి.. బీఆర్ఎస్ వల్ల తెలంగాణ బాగుండాలని ఎంతో తగ్గి ఉన్నానని చెప్పారు.. తనకు పార్టీలో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఓటమి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి వరకు ఎన్నో కుట్రలు జరిగాయన్నారు.. ఆడబిడ్డగా కుటుంబం బాగుండాలి.. పార్టీ బాగుండాలనే ఉద్దేశంతో తాను ఎంతగా సఫర్ అయినా ఏ ఒక్క విషయం కూడా బయటకు చెప్పలేదన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాను మాట్లాడాల్సి వచ్చిందన్నారు.. విషయాలు ప్రజల్లోకి వచ్చిన తర్వాత వాటిపై స్పందించకపోతే, మాట్లాడకపోతే అది తన తప్పు అవుతుందని.. అందుకే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందే తప్ప తాను ముందే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్నారు.. ఆ విషయం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.
తాను విదేశాల్లో ఉన్నప్పుడు అనవసరంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పించారని.. ఇలాంటి విషయాలన్ని తాను ప్రజల ముందు ఉంచానని చెప్పారు.
తనను పార్టీ నుంచి బయటికి పంపడంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని చెప్పారు.. తెలంగాణవాళ్లకు రేషం ఎక్కువ ఉంటుందని.. తాను కూడా తెలంగాణ బిడ్డనేనని చెప్పారు.. తనను పార్టీ వద్దు అనుకున్నది కాబట్టి తాను పార్టీ ఇచ్చిన పదవిని వద్దు అనుకున్నానని చెప్పారు..
స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా చేశానని.. చైర్మన్ గారు ఎందుకు ఆమోదించడం లేదో తనకు తెలియదన్నారు.. కాంగ్రెస్ పాలిటిక్స్ లో అది ఒక భాగం కావొచ్చని అన్నారు.. త్వరలోనే చైర్మన్ పై ఒత్తిడి తెచ్చి రాజీనామా ఆమోదింపజేసుకుంటానని చెప్పారు.
తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం తన 20 ఏళ్ల జీవితాన్ని దారబోశానని.. వాటిని పరిగణలోకి తీసుకోకుండా నిర్ణయం తీసుకున్నారని అన్నారు.. తన విషయంలో జరగరాని పరిణామం జరిగిందని.. ధైర్యంగా ముందుకెళ్తానని చెప్పారు.
తెలంగాణ సాధన కోసం నిఖార్సుగా, ప్రాణం పోయినా పర్వాలేదు అని చేసిన వారిలో కొందరిలో రానురాను స్వార్థం ప్రవేశించిందని.. వాళ్లు మొత్తం వ్యవస్థను భ్రష్టు పట్టించేలా పని చేశారని చెప్పారు.. ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ పోవాలి.. కానీ అది జరగలేదు అన్నది తన ఆవేదన అన్నారు.
కొందరు వ్యక్తుల ప్రయోజనాల కోసం కోట్లాది మంది ప్రజలు సఫర్ కావడం మంచిది కాదని.. వాటిని ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ సరి చేసుకుంటే బాగుంటుందని అన్నారు. పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తెలంగాణ జాగృతిని దేశానికే రోల్ మోడల్ గా నిలపాలన్నదే తన సంకల్పమన్నారు.. సామాజిక తెలంగాణ కోసం జాగృతి పని చేస్తుందన్నారు.. అవసరం, సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కోరుకుంటే పార్టీ పెడుతాం.
తొవ్వ ఎంత కఠినమైనా పోవాలనుకున్నప్పుడే పోవుడేనని స్పష్టం చేశారు.. నేను ఈ పరిస్థితికి రావడానికి అవతలి వాళ్లే కారణమని.. ఇలాంటి పరిస్థితులు కల్పించినప్పుడు తాను మామూలు బిడ్డను కాదు.. తెలంగాణ బిడ్డను, కేసీఆర్ బిడ్డను అని తేల్చిచెప్పారు.. కష్టమైతది నాకు తెలుసు.. అయినా ధైర్యంగా తన పంథాను ఎంచుకుంటానని స్పష్టం చేశారు.. జాగృతిని మరింత బలోపేతం చేస్తానని..జాగృతి తరపున మరిన్ని కార్యక్రమాలు చేపడుతానని తేల్చిచెప్పారు.
జైలు జీవితం తనలో అనేక మార్పులు తీసుకువచ్చిందని.. తాను చిన్నప్పటి నుంచి ప్రజల మధ్యనే ఉన్నానని చెప్పారు.. కష్టాలను చూడటం వేరు.. కష్టాలు అనుభవించడం వేరు.. నేను జైలుకు వెళ్లినప్పుడు సామాన్యుడు, ఒక స్త్రీ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అన్నది తాను ప్రత్యక్షంగా అనుభవించానని చెప్పారు.
జైలు జీవితం తనను సమూలంగా మార్చేసిందన్నారు.. ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే స్పష్టమైన ఆలోచనకు తనకు ఉందని.. తప్పనిసరిగా తనకు అవకాశం వస్తుందని అన్నారు.
తన వెనుక ఏ జాతీయ పార్టీ కూడా లేదని.. అలాంటిది ఏదైనా ఉన్నా తాను దాచుకునే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.. జాతీయ పార్టీల్లో చేరే ఉద్దేశం కూడా తనకు లేదన్నారు.. కాంగ్రెస్ మునిగిపోయే పడవ అని.. తెలంగాణాను ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్ పార్టీనే గతంలో 369 మంది బిడ్డలను బలితీసుకున్నది.. మొన్నటికి మొన్న 1200 మంది బలిదానాలకు ఆ పార్టీనే కారణం అన్నారు.. అభివృద్ధి పథంలో సాగుతోన్న తెలంగాణాను భ్రష్టు పట్టిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు.. బీజేపీ డీఎన్ఏ తనకు సరిపడదని తేల్చిచెప్పారు.
మహిళా రిజర్వేషన్ల కోసం ముందుండి కొట్లాడి సాధించుకున్నామని.. బీసీ రిజర్వేషన్ల కోసం తానే ముందుండి కొట్లాడుతున్నానని చెప్పారు. ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల సమయం ఉంది.. అప్పటి వరకు ఎలాంటి మార్పులు వస్తాయో చూడాల్సి ఉంది. ప్రజలకు ఏది మంచి చేస్తుందో ఆ దిశగా తన అడుగులు ఉంటాయని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల కల్పనపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని.. వాళ్లే కోర్టుకు వెళ్లి అడ్డుకుంటారని చెప్పారు.. రియల్ సోషల్ చేంజ్ కేసీఆర్ ద్వారా.. తెలంగాణ ఉద్యమం ద్వారానే జరిగింది.. ఇప్పుడు మళ్లీ రియల్ చేంజ్ కోసం తెలంగాణ ఉద్యమకారులు ఒక్కటై పని చేయాలి.