– జీఎస్టీ తగ్గింపు చారిత్రక నిర్ణయం
– స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి
– బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
కరీంనగర్: పార్లమెంటరీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో, జిల్లా అధ్యక్షుడు కృష్ణా రెడ్డి ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు & జడ్పీటీసీ ప్రభారీలతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పాల్గొని నాయకులకు దిశానిర్దేశనం చేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు — సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థాయిల్లో పార్టీ బలాన్ని మరింత పెంచేలా కట్టుదిట్టమైన వ్యూహంతో ముందుకు సాగాలి. ప్రతి గ్రామం నుండి వార్డు మెంబర్ వరకు, జడ్పీటీసీ స్థాయి వరకు అన్ని స్థానాలలో భారతీయ జనతా పార్టీ గెలవాలని మనం కృషి చేయాలి. ప్రస్తుతం ప్రజలలో బిజెపి కి అనుకూలమైన వాతావరణం ఉంది.
రాష్ట్రంలో కాంగ్రెస్ & బీఆర్ఎస్ ఒక్కటే. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పులను, కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా కొనసాగిస్తోంది. గ్రామ పంచాయతీకి వచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నా, ఆ పేరును మాత్రం మార్చుకుని తమ కీర్తిగా చూపిస్తున్నారు. ఈ వాస్తవాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది.
ప్రజలు ఇప్పుడు బిజెపి వైపు చూస్తున్నారు. ఇది మనకు గొప్ప అవకాశం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జీఎస్టీ తగ్గింపు చారిత్రక నిర్ణయం అని వ్యాఖ్యానిస్తూ, ఈ నిర్ణయంతో ప్రజలకు కలిగే ప్రయోజనాలను ప్రతి ఇంటికీ చేరేలా వివరించాలని పార్టీ రథసారధి రాంచందర్ రావు సూచించారు.