– కేటీఆర్, హరీష్‌ను కేంద్రం ఎందుకు వదిలేసింది?
– సీబీఐకి అప్పగిస్తే రెండురోజుల్లో తండ్రీకొడుకులను జైలుకు పంపుతామన్నారే?
– ఏమిటి మీ కుమ్మక్కు రాజకీయాలు?
– జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ-బీఆర్ఎస్ చీకటి ఒప్పందం
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా రహమత్ నగర్ డివిజన్ కార్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : బీఆరెస్ నాయకులు సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఆనాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. ఇక్కడి బస్తీవాసుల తాగునీటి కష్టాలు తీర్చాలని ఆనాడు ఖాళీ కుండలతో పీజేఆర్ ధర్నా చేశారు. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తీసుకొచ్చి, కృష్ణా జలాలు తెచ్చి మీ దాహార్తిని తీర్చారు.
లక్షలాది పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చిన పేదోళ్ల దేవుడు పీజేఆర్. 2007 లో పీజేఆర్ ఆకస్మికంగా మరణిస్తే టీడీపీ, బీజేపీ అభ్యర్థిని పెట్టకుండా ఆ కుటుంబాన్ని ఏకగీవ్రంగా నిలబెట్టేందుకు అండగా నిలబడ్డాయి. కానీ కేసీఆర్ పీజేఆర్ కుటుంబంపై అభ్యర్థిని నిలబెట్టి మంచి సంప్రదాయాన్ని తుంగలో తొక్కారు. పీజేఆర్ సతీమణి కేసీఆర్ ను కలిసేందుకు వెళితే ,మూడు గంటలు బయట నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్.
కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్
కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని బీజేపీ నేతలు పదే పదే చెప్పారు. కాళేశ్వరం కేసును సీబీఐ కి పంపిస్తే 48 గంటల్లో తండ్రీ కొడుకులను జైలుకు పంపిస్తామన్నారు. మీరు, వాళ్లు ఒక్కటి కాకపోతే.. బీఆరెస్, బీజేపీ ది ఫెవికాల్ బంధం కాకపోతే…. ఈ నెల 11 లోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్ఐఆర్ చేయాలి. కెసిఆర్, హరీష్, కేటీఆర్ ని అరెస్ట్ చేయాలి.
ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? ఇందులో మీ చీకటి ఒప్పందం ఏంటి? చీకటి ఒప్పందం చేసుకుని జూబ్లీహిల్స్ లో బీజేపీ బీఆరెస్ కు పరోక్ష మద్దతు ఇస్తోంది. ఎందుకంటే. రాబోయే రోజుల్లో బీఆరెస్ బీజేపీ లో విలీనం అవుతుంది. ఇది నేను అంటున్నది కాదు. వాళ్ల ఆడబిడ్డ చెబుతున్నదే.