– భూమన హయాంలో గిల్టునగలు పెట్టారని భక్తుల అనుమానం
– అసలు స్వామి వారి నగలపై లెక్కలున్నాయా?
– పరకామణిలో హుండీ డబ్బు దోచుకున్న పాపాత్ములు మీరు
– శ్రీవారి నగలు మాయం చేయలేదన్న గ్యారంటీ ఏమిటి?
– టీటీడీని భ్రష్టుపట్టిస్తున్న భూమన కరుణార్రెడ్డి
– తిరుమలపైకి తొలిసారి విచారణ సంస్థలు
– ఈ పాపం కరుణాకర్రెడ్డిదే
– శ్రీవారి నగలపై టీడీడీ బోర్డు విచారణ జరిపించాలి
– భూమనపై బలిజనాడు కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ నేత ఓవి రమణ ఆరోపణల వర్షం
తిరుపతి: తిరుమల వెంకన్న నగలు అసలా? నకిలీనా అన్న విషయంపై టీటీడీ బోర్డు విచారణ జరిపించి భక్తుల సందేహాలు తీర్చాలని బలిజనాడు కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, టీడీపీ నాయకుడయిన డాక్టర్ ఓ.వి.రమణ డిమాండ్ చేశారు. టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హయాంలో స్వామి నగలు మార్చారన్న అనుమానం భక్తుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
హుండీ డబ్బులే దొంగతనం చేసిన మీరు శ్రీవారి నగలు మాయం చేయరన్న గ్యారంటీ ఏమిటన్నది భక్తుల అనుమానం. అందుకే శ్రీవారి నగలు గిల్టువా? గోల్డా అన్నది తేల్చాలని భక్తుల తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. ఇప్పటివరకూ ఏ ఒక్క టీటీడీ చైర్మన్ కూడా ఆలయ ప్రతిష్ఠను అప్రతిష్టపాలు చేయలేదని, ఏ ఒక్క చైర్మన్ కూడా టీటీడీపై ఆరోపణలు చేయలేదని, ఆ చెత్త చరిత్ర భూమనకే దక్కుతుందని రమణ విరుచుకుపడ్డారు. ఒక పథకం ప్రకారమే భూమన టీటీడీ బోర్డు- స్వామివారి ప్రతిష్ఠను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని డాక్టర్ రమణ ఆరోపించారు. బీఆర్నాయుడు చైర్మన్‌గా ఉన్న బోర్డు ఈ ఏడాది కాలంలో చేసిన ఒక్క అవినీతిని నిరూపించాలని ఆయన భూమనకు సవాల్ విసిరారు.
ఓవి రమణ ఇంకా ఏమన్నారంటే… టీటీడీ కొత్త పాలకమండలిపై ఒక్క అవినీతి ఆరోపణ ఏమైనా వచ్చిందా నిరూపించండి. చిల్లరమల్లర ఆరోపణలు కాకుండా నిర్దిష్టమైన ఒక్క ఆరోపణ నిరూపించండి. కొద్దినెలల క్రితం తిరుపతిలో జరిగిన తొక్కిసలాట కూడా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరిగిందే.
నాకు తెలిసి టీటీడీ చరిత్రలో ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు గానీ అవినీతిపరులున్నది లేదు. అలాంటిది కల్తీ నెయ్యి కుంభకోణం, పరకామణిలో హుండీ దొంగతనం మీ నిర్వాకం వల్ల కాదా? నేడో రేపో బియ్యం అవినీతి కూడా బయటకు రాబోతోంది. కాంట్రాక్టుల్లో కమిషన్లు తీసుకుంది మీ హయాంలో కాదా? మీ అసమర్థపాలన-అవినీతి పాలన ఎంత ఘనంగా ఉందో సీఐడి, సీబీఐ విచారణలనే చెబుతున్నాయి కదా? టిటిడిపై ఇన్ని ఏజెన్సీలు విచారణ చేసిన చరిత్ర ఎప్పుడైనా ఉందా? 41ఏ నోటీసు ఇస్తేనే జైలుకు పంపిస్తారా? నోటీసు ఇస్తేనే అంత ఉలికిపాటు, హంగామా ఎందుకు?
కొన్ని కోట్లమంది భక్తులకు సంబంధించిన మనోభావాలు దెబ్బతీస్తారా? రోజూ పనిగట్టుకుని టీటీడీని విమర్శించడం ద్వారా స్వామి వారి ప్రతిష్ఠను దెబ్బతీసే కుట్రకు పాల్పడతారా? మీ కుట్ర వల్ల టీటీడీ ప్రతిష్ఠ బయట రాష్ట్రాల్లో దెబ్బతింటోంది. హుండీలో వేసిన కానుకలు సద్వినియోగం కావడం లేదన్న భావన మీ ఆరోపణలకు అవకాశం కల్పిస్తున్నాయి. మీకు చేతనయతితే సలహాలివ్వండి. లేకపోతే మౌనంగా ఉండండి. అంతేగాని స్వామివారిని అప్రతిష్ఠపాలు చేయకండి.
అధికారుల వ్యవస్థలో లోపాలున్నాయి. సరైన అధికారులు లేరు. అధికారులకు ఉద్యోగులకు గ్యాప్ అని లేనిపోని అనుమానాలు సృష్టించటం మంచిదికాదు. అసలు స్వామివారి నగలు ఎన్ని ఉన్నాయి? దానికి లెక్క ఉందా? హుండీలో దొంగతనాలు జరుగుతున్నాయి. గతంలో మీ హయాంలో స్వామివారి కల్యాణం బయట రాష్ట్రాల్లో జరిపించారు. ఆ గిల్టు నగలను అసలు నగల స్థానంలో ఉంచి, అసలు నగలను మాయం చేశారేమోనన్న అనుమానం వస్తుంది. హుండీలో డబ్బులే దొంగతనం చేసినవాళ్లు నగలు మాయం చేయరన్న గ్యారంటీ ఏమిటి? అసలు స్వామి నగలపై టీటీడీ బోర్డు ఆరా తీయాలి. ఇది చేస్తేనే భక్తుల అనుమానాలు తీర్చినవారవుతారు.
ఎందుకంటే శ్రీవారి నగలు భద్రంగా ఉన్నాయో లేవోనని భక్తులు అనుమానిస్తున్నారు. వారి అనుమానం నివృతి చేసే బాధ్యత టీటీడీ, అధికారులదే. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీలో భారీ అవినీతి అక్రమాలు జరిగాయి. ఒక దొంగల ముఠా నాడు టీటీడీ ని పాలించింది. ఇప్పుడు అదే ముఠా అవినీతి-అసమర్థపాలన అంటూ నిస్సిగ్గుగా చిలకపలుకులు పలుకుతోంది. భూమన ఆరోపణలకు విలువ లేదని భక్తులు కూడా గ్రహిస్తున్నారు.