– సుప్రీంకోర్టు మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కేంద్రంగా ఇటీవలి కాలంలో చర్చ
– ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో సాయం చేయలేదని టీడీపీ కొన్ని వర్గాల అసంతృప్తి
-ఇటీవల తానూ జగన్ బాధితుడినే అని జస్టిస్ రమణ ఆవేదన
– తన కుటుంబాన్ని నాటి సర్కారు వేధించిందన్న జస్టిస్ ఎన్వీ రమణ
– దానితో సోషల్ మీడియాలో విమర్శనాత్మక కథనాలు
– జస్టిస్ రమణ గారిపై విమర్శలు సరికాదంటూ వాదిస్తున్న మరో వర్గం
– రఘురామకృష్ణంరాజు బతికి ఉండటానికి కారణం ఎవరు?
– నాడు జస్టిస్ రమణ గారు ప్రజాస్వామ్యాన్ని రక్షించారన్న రఘురామకృష్ణంరాజు
– టీవీ 5 బీఆర్ నాయుడు, ఏబీఎన్ రాధాకృష్ణకు న్యాయపరమైన రక్షణ కల్పించింది ఎవరంటూ ప్రశ్నలు
– అమరావతి రాజధానిని రక్షించింది రమణ కాదా అంటూ వాదన
– కొత్తగా తెరపైకి జస్టిస్ ఎన్వీ రమణ గారికి దన్నుగా సోషల్ మీడియాలో పోస్టింగులు
(సుబ్బు)
మాజీ సీఎం జగన్ ప్రభుత్వం తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధించిందంటూ.. సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలను, టీడీపీలోని ఒక వర్గం సోషల్ మీడియా కేంద్రంగా విమర్శలు కురిపిస్తూ వెల్లువెత్తిన కథనాలు చర్చనీయాంశమయింది.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు బెయిల్ కోసం జస్టిస్ ఎన్వీ రమణ గారు తన పలుకుబడి వినియోగించలేదన్నది, వారి అసంతృప్తికి ప్రధాన కారణం. నాటి సీఎం జగన్ పై పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించి, ఆయనను జైలుకు పంపించలేదన్నది మరో ప్రధాన అసంతృప్తి. జగన్ వేధించిన నాటి ఏడీజీ ఏబీ వెంకటేశ్వరరావుకు న్యాయం చేయలేకపోయారన్నది మరో విమర్శ.
అయితే సోషల్ మీడియా వేదికగా ఇప్పుడు అదే జస్టిస్ రమణకు మద్దతుగా టీడీపీలోని మరో వర్గం రంగంలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. జస్టిస్ రమణ గారి కుటుంబాన్ని ఆనాడు జగన్ ప్రభుత్వం ఏవిధంగా వేధించిందో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, ఏబీఎన్ వంటి మీడియా సంస్థల్లో వచ్చిన కథనాలను ఆ వర్గం గుర్తు చేస్తోంది. అదే విషయాన్ని ఆయన గుర్తు చేయడంలో తప్పేమిటని ప్రశ్నిస్తున్నారు.
అమరావతి ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన రైతులపై నాటి జగన్ ప్రభుత్వం కేసులు పెట్టినప్పుడు, వారికి దన్నుగా నిలిచింది ఎవరు? వారి పాదయాత్రలకు అనుమతి ఎవరి హయాంలో లభించింది? అంటూ జస్టిస్ ఎన్వీ రమణకు దన్నుగా నిలిచిన ఆ వర్గం, సోషల్ మీడియాలో ప్రశ్నలు సంధించింది.
అమరావతి ఉద్యమానికి దన్నుగా నిలవడంతోపాటు.. జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడిన టీవీ 5, ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ సంస్థల అధిపతులు, అందులో పనిచేసే ప్రముఖులపై కేసులు- అరెస్టు నుంచి న్యాయపరమైన రక్షణ కవచం ఎవరి హయాంలో లభించింది? అప్పుడు వారికి సుప్రీంకోర్టు రక్షణగా లేకపోతే వారిని అరెస్టు చేసేవారే కదా? అంతేకాదు. వారి తర్వాత లోకేష్‌ను కూడా అరెస్టు చేసేందుకు జగన్ సర్కారు సిద్ధపడినప్పుడు.. ఆయనకు న్యాయపరమైన రక్షణ కల్పించింది ఎవరంటూ గుర్తు చేస్తున్నారు. ఇక రఘురామకృష్ణంరాజు గారు వేసిన కేసులను.. జస్టిస్ రమణ గారు సీజేగా ఉన్న సుప్రీంకోర్టు బెంచి పట్టించుకోలేదన్న విమర్శలను, జస్టిస్ రమణ గారి మద్దతుదారులు కొట్టిపారేస్తున్నారు. రఘురామరాజును ఆ కారణంగా హైదరాబాద్ నుంచి గుంటూరుకు తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టి న సందర్భంలో, ఆయనకు రక్షణ కవచం కల్పించింది ఎవరు? ఆరోజు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఉండేవారా? అని ప్రశ్నిస్తున్నారు.
ఈ సందర్భంలో రాజకీయ విశ్లేషకుడు కందుల రమేష్ బాబు, తాజాగా రఘురామరాజును ఇదే అంశంపై వేసిన ప్రశ్నకు.. తాను ఇప్పుడు జీవించి ఉన్నానంటే దానికి కారణం, అప్పుడు రమణ గారు సీజేగా ఉన్న సుప్రీంకోర్టు పుణ్యమే. లేకపోతే నన్ను జగన్ అప్పుడే లెక్కల్లో రాసేవారు అని స్పష్టం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలో హక్కులను, అమరావతితోపాటు ప్రజాస్వామ్యాన్ని కాపాడింది రమణ గారు సీజేగా ఉన్న సుప్రీంకోర్టు మాత్రమేనని రఘురామరాజు స్పష్టం చేశారు.
” నిజానికి ఆయనకు ఆ పదవి రాకుండా జగన్ ముందు ఏఐఎస్ అధికారితో ప్రెస్ మీట్ పెట్టించారు. తర్వాత ఆయనే వెళ్లి రమణగారికి సీజే ఇవ్వవద్దని ఫిర్యాదు చేశారు. ఆయన కుటుంబంపై అమరావతి అవతల భూములు కొన్నా కేసులుపెట్టి వేధించారు. పెళ్లి అయిన కుమార్తెలు తమ గ్రామానికి దగ్గరగా భూములు కొన్నారు. సహజంగా ఎవరికయినా ఊరికి దగ్గరలో భూమి కొనుక్కోవాలని ఉంటుంది కదా? పైగా ఆయన అల్లుడు కుటుంబం బాగా స్థితిమంతులయిన వారే. అయినా జగన్ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టి వేధించడాన్ని నేను ఆనాడే ఖండించా. ఆయన బెంచిమీదకు రాకపోయినా కూడా ఆనాడు హైకోర్టు మూడు రాజధానులకు బ్రేకులు వేసిన మాట నిజం కాదా? వీటిలో ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేనప్పటికీ ,రమణ గారు సీజేగా ఉన్నప్పుడు వచ్చిన తీర్పులే కదా? అంటే ఆనాడు ఆయన నేతృత్వంలోని సుప్రీంకోర్టు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం, వాక్-పత్రికా స్వాతంత్ర్యాన్ని కాపాడినట్లే కదా “?
” ఎవరిదాకా ఎందుకు? నన్ను అన్యాయంగా అరెస్టు చేసి పదేళ్ల శిక్షలు పడే కేసులు పెట్టినప్పుడు వెకేషన్ కోర్టు ఏర్పాటుచేయాలని నేను శనివారం ఫైల్ చేస్తే, ఆదివారం బెంచి ఫామ్ అయి సోమవారానికి విచారణకు వచ్చింది. ఆ తర్వాతనే నాకు న్యాయం జరిగింది. సో.. నేను నమ్ముకున్న ఆ వెంకటేశ్వరస్వామి, ఆ పేరున్న వెంకటరమణతో నాకు ఆరకంగా సాయం చేశారనుకున్నా. ఆయన ఏర్పాటుచేసిన బెంచి వల్లే నేను బతికున్నా. అలాగే ఆ వెంకటేశ్వరస్వామి కూడా నాకు రమణగారి రూపంలో సాయం చేసినట్టే.. అమరావతి రైతులకు, రాజధానికి, రాష్ట్రానికీ సాయం చేశారని ఒక వెంకటేశ్వరస్వామి భక్తుడిగా నమ్ముతున్నా. ఒకప్పుడు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఆయన గురించి అడిగారు కాబట్టి, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేను ఇంతకుమించి చెప్పలేనేమో”
“న్యాయస్థానాల్లో ఎవరెంత ఉన్నతహోదాలో ఉన్నా ఎవరి పరిమితి వారికి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని చేయలేకపోవచ్చు. ఒక వ్యక్తిని శిక్షించాలంటే కోర్టుల్లో రకరకాల ప్రొవిజన్స్., అపీలు ప్రొవిజన్స్ ఉంటాయి. జగన్ కేసులను ఏడాదిలోగా తేల్చమని తీర్పు ఇచ్చారు. ఇప్పటికీ తేలలేదు. ఆయన ఇప్పటివరకూ కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు తీసుకున్నారు. కాబట్టి ఫలానా జడ్జి వల్ల ఫలానా వ్యక్తి జైలుకు పోలేదనుకోవడం, దానిని దృ ష్టిలో పెట్టుకుని వారిని నిందించడం సహేతుకం కాదు. రమణ గారిపై ఆరకమైన పోస్టులు వచ్చినప్పుడు బాధపడ్డా. ఓపెన్ గా మాట్లాడటం భావ్యం కాదని మాట్లాడలేకపోయా”
” ఒక జడ్జి ఎవరినైనా వేశాయలనుకుంటే కుదరదు. దానికి అనేక ప్రొసీజర్లు ఉంటాయి. వారికి ఉన్న పరిమితులు దాటి అపరిమితంగా వ్యవహరించే కొందరు వ్యక్తుల విషయంలో.. వీరు కూడా అపరిమితంగా పరిథులు దాటి వ్యవహరించాలని కోరుకోవడం అనేది ఏమాత్రం సమంజసం కాదనే విషయాన్ని సరిగ్గా అర్ధం చేసుకోగలిగిన ప్రజలకు అర్ధమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది. ఆనాడు జరిగిన వాస్తవాలు రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నాకు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇది ప్రజలకు రీచ్ కావాలి. అన్యాయంగా ఒక ఉన్నత స్థాయి పదవి నిర్వహించిన వ్యక్తి మీద.. ఎవరో ఒకరికి వారు గతంలో వారు సాయం చేశారని, ఆ పదవి పరిథి దాటి సాయం చేయకపోవడం మీద కామెంట్స్ చేయడం కరెక్టు కాదు”
ఇదే సమయంలో ఒక వ్యక్తి జడ్జి పదవిలో ఉంటే.. ఆయన ఇష్టం వచ్చినట్లు తీర్పులు ఇవ్వడం కుదరదని, జస్టిస్ రమణ కూడా అందుకు అతీతులు కాదని తాజాగా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. ఐపిసి సెక్షన్ల ప్రాతిపదికగానే వాదనలు, తీర్పులుంటాయన్న విషయాన్ని విస్మరించకూడదని గుర్తు చేస్తున్నారు.
జగన్ శిక్ష తప్పించుకునేందుకు.. దేశంలోని ప్రముఖ న్యాయవాదులకు కోట్లాది రూపాయల ఫీజులిచ్చి, న్యాయవ్యవస్థలో ఉన్న అన్ని అవకాశాలు ఎంచుకున్నందుకే, ఆయన కేసు ఆలస్యం అవుతుందన్న విషయం గ్రహించాలని జస్టిస్ రమణకు దన్నుగా నిలిచిన టీడీపీ వర్గాలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.