– ఏపీ, దేశ అభివృద్ధిలో యువత భాగస్వామ్యం అవసరం
– యువత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలి
– ఆంధ్రప్రదేశ్ ను కాలిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతాం
– యువత భాగస్వామ్యంతోనే భారత్ నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది
– ఐటీ కంపెనీలకు భూమి పూజ అనంతరం ఉద్యోగులతో మంత్రి నారా లోకేష్
విశాఖపట్నం : ప్రపంచం మొత్తం ఏపీ వైపు చూస్తోందని.. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం ఐటీ హిల్స్ లో పలు ఐటీ కంపెనీలకు భూమి పూజ అనంతరం అక్కడి ఐటీ ఉద్యోగులతో లోకేష్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి లోకేష్ ప్రసంగిస్తూ.. అందరూ విశాఖ వైపు చూస్తున్నారు. వచ్చిన అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి.
ఏపీ, ఇండియా గర్వపడే విధంగా చేయాలి. ఏపీని కాల్నిఫోర్నియా ఆఫ్ ఈస్ట్ గా తీర్చిదిద్దుతాం. ఈ ప్రయాణంలో మీరందరూ భాగస్వామ్యం కావాలి. హైదరాబాద్ ఈ స్థాయికి రావడానికి 35 ఏళ్ల సమయం పడితే విశాఖ అభివృద్ధికి పదేళ్లు చాలు. మేం అందరం చాలా కష్టపడుతున్నాం. చాలా మంది రాజకీయ నాయకులకు ఒక్క అవకాశమే వస్తుంది. మాకు విశాఖ, అమరావతిని అభివృద్ధి చేసేందుకు రెండు అవకాశాలు లభించాయి. మున్ముందు విశాఖకు అనేక కంపెనీలు తరలివస్తాయన్నారు.
యువత భాగస్వామ్యంతోనే భారత్ నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది
యువత రాష్ట్రంతో పాటు దేశం గర్వపడే విధంగా చేయాలి. ప్రపంచం వికసిత్ భారత్ కోసం పీఎం నరేంద్ర మోదీ విశేషంగా కృషిచేస్తున్నారు. మోదీ నేతృత్వంలో ప్రపంచంలో ఇండియా నెం.1 ఎకానమీగా రూపుదిద్దుకుంటుంది. దానికి కారణం మీ లాంటి యువతే. విశాఖను ఐటీ కేంద్రగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోంది. వచ్చే పదిహేనేళ్లు మనవే. మన లక్ష్యాన్ని సాధించాలంటే, మనం నమ్ముతున్న అభివృద్ధిని నిజం చేయాలంటే, భారతదేశం నెం.1 ఎకానమీగా ఎదగాలంటే మనలో ప్రతి ఒక్కరికీ ఆ కసి ఉండాలి. ప్రతి ఒక్కరం ఎంతో కష్టపడి పనిచేయాలి.
ఆంధ్రప్రదేశ్ కు, భారతదేశానికి గర్వకారణంగా నిలవాలి. అందరూ విశాఖపట్నం బ్రాండ్ అంబాసిడర్లుగా నిలవాలి. మీలో ప్రతి ఒక్కరూ మీ అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించాలి. ఇక్కడికి వచ్చే తెలుగు ప్రజలు, భారతీయులు…. ఈ అద్భుతమైన కొత్త కంపెనీల్లో పనిచేయబోతున్న వారందరినీ ఆత్మీయంగా స్వాగతించాలి. విశాఖపట్నం పరిశుభ్రంగా, పచ్చగా ఉండాలి. మన నగరం దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలవాలి. దానికోసం మన వంతు కృషి చేయాలన్నారు.