– రూ.2,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కోరమండల్ సంసిద్ధత
– అన్నా క్యాంటీన్లకు బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ రూ.1 కోటి విరాళం
– ముఖ్యమంత్రి చంద్రబాబుతో వివిధ సంస్థల ప్రతినిధుల భేటీలు
విశాఖపట్నం : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని పెట్టుబడులకున్న అవకాశాలను వివరించడంతోపాటు.. పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతిపాదనలతో వచ్చిన వారితో ఈడీబీతో ఎంఓయూలు కుదుర్చుకోవాల్సిందిగా సూచిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రముఖ ఎరువులు, అగ్రి-ఇన్పుట్ సంస్థ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు.
రాష్ట్రంలో ఎరువుల తయారీ విస్తరణ, గ్రీన్ అమోనియా, అగ్రిటెక్ ప్రాజెక్టులపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. మురుగప్ప గ్రూప్‌కు చెందిన కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థకు ఇప్పటికే విశాఖపట్నం, కాకినాడలో ఎరువుల ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. దీనికి కొనసాగింపుగా మరో రూ.2,000 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రంలో ఎరువుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పేందుకు ఆ సంస్థ ముందుకు వచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
గ్రీన్ అమోనియా – గ్రీన్ హైడ్రోజన్ తయారీ, ఎరువుల ఉత్పత్తి యూనిట్ విస్తరణ సహా ఇంకొన్ని ప్రాజెక్టులపై కోరమండల్ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. మరోవైపు ప్రముఖ ఫర్నిచర్ సంస్థ బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ ఛైర్మన్ ఎన్కే అగర్వాల్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. కలప ఆధారిత ఇంజినీర్డ్ ప్యానెల్ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చించారు. అనంతరం రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న అన్నా క్యాంటిన్ల నిర్వహణకు ఎన్కే అగర్వాల్ రూ.1 కోటి విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.