– మా ప్రాణం మీరే.. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పని చేస్తాం
– పరిటాల కుటుంబం కలలో కూడా తప్పు చేయదు.. చేస్తే కాలర్ పట్టుకుని నిలదీయండి
– పార్టీ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పరిటాల సునీత ఉద్వేగ భరిత ప్రసంగం
– 1350 మంది సభ్యులతో అట్టహాసంగా ప్రమాణ స్వీకారోత్సవం
– భారీగా హాజరైన పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు
రాప్తాడు: మా ప్రాణం మీరే… మీరే మమ్మల్ని ముందుండి నడిపించారు.. ఊపిరి ఉన్నంతవరకు మీ కోసమే పని చేస్తామని.. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఉద్వేగ భరిత వ్యాఖ్యలు చేశారు. రాప్తాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యుల ప్రమాణస్వీకారం అట్టహాసంగా సాగింది. నగరంలోని బైపాస్ రోడ్ లో ఉన్న ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన ఈ సమావేశంలో వందలాదిగా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా తెలుగుదేశం పార్టీ పసుపు జెండాకు వందనం చేశారు.
ఎమ్మెల్యే పరిటాల సునీతతో పాటు ఇతర నాయకులు దివంగత ఎన్టీఆర్, పరిటాల రవీంద్ర చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గంలో మరణించిన తెలుగుదేశం పార్టీ సభ్యులకు నివాళి అర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఎంపికైన 1350 మంది బూత్, గ్రామ, యూనిట్, క్లస్టర్, మండల కమిటీల సభ్యుల చేత ఉమ్మడిగా ప్రమాణ స్వీకారం చేయించి వారందరికీ శాలువాలు, పూలతో సన్మానం చేశారు.
కన్వీనర్లు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, మనోహర్ నాయుడు, ఆదోని కృష్ణమ్మ, తెలుగుదేశం పార్టీ హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు అంజనప్ప ఇతర ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ పార్టీలో ఎంతోమంది కష్టపడి నాయకులు పనిచేశారని వారందరికీ తగిన గుర్తింపునిచ్చే బాధ్యత తమది అన్నారు. ఇప్పటివరకు చాలామంది నాయకులకు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా పదవులు వచ్చాయని వారు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ఇంకా కొన్ని పదవులు పెండింగ్ లో ఉన్నాయని వాటిని త్వరలోనే ఎంపిక చేస్తామన్నారు. పార్టీలో చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయని వాటన్నింటినీ మనసులో పెట్టుకుని ఇంట్లో అలిగి కూర్చోవద్దని ఎమ్మెల్యే సునీత సూచించారు.
మీకు ఏ సమస్య ఉన్న పరిటాల కుటుంబం 24×7 అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇంకా మీ గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. పింఛన్లు రానివారు, ఇళ్ల స్థలాలు వంటి సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యలన్నింటినీ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని త్వరలోనే అవన్నీ పరిష్కారం అవుతాయన్నారు.
మనల్ని నమ్మి ఓటు వేసిన ప్రజలకు, అలాగే కష్ట కాలంలో మన కోసం పనిచేసిన కార్యకర్తలను ఎప్పటికీ మరువబోమన్నారు. వారికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేరుస్తామని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయని ప్రకాష్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. దీనిని తిప్పి కొట్టాల్సిన బాధ్యత నాయకుల మీద ఉందన్నారు.
నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను అంటే అదంతా మీరు పడ్డ కష్టం వల్లనేనన్నారు. అందుకే ఊపిరి ఉన్నంతవరకు మిమ్మల్ని మర్చిపోయే ప్రసక్తి లేదన్నారు. ప్రకాష్ రెడ్డి ఒక మహిళపై మూడుసార్లు ఓడిపోయిన అసమర్థుడన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి, ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి నియోజకవర్గంలో ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్నారు. అందుకే 25 వేల ఓట్ల తేడాతో ప్రకాష్ రెడ్డిని ఓడించారన్నారు. నా గెలుపు కోసం పనిచేసిన ఏ ఒక్కరిని నేను మర్చిపోనన్నారు. మనం చేస్తున్న మంచి పనులు చూసి నియోజకవర్గంలో తనకు మనుగడ ఉండదన్న ఉద్దేశంతో ప్రకాష్ రెడ్డి పరిటాల కుటుంబం గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.
నాతో పాటు పరిటాల రవి కుమారులైన పరిటాల శ్రీరామ్ సిద్ధార్థ మీద కూడా నిందలు వేస్తున్నారన్నారు. తాము పరిటాల రవి పేరును మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లేందుకే ప్రయత్నం చేస్తున్నామని… ఆయన పేరు తగ్గించే ప్రయత్నం ఎక్కడా చేయబోమన్నారు. అలా చేస్తే కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు ప్రతి కార్యకర్తకు ఉంటుందన్నారు. నిత్యం పరిటాల కుటుంబాన్ని ఏదో ఒకటి అంటేనే వారికి మనుగడ ఉంటుందని.. అందుకే ప్రకాష్ రెడ్డి ఇలా అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.
పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఏమైనా సమస్యలు ఉంటే మీలో మీరే చర్చించుకోకుండా మా వరకు సమస్య తీసుకొని వస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తామన్నారు. ఎవరో చెప్పే గాలి మాటలు విని మీరు ఇంకోలా ఆలోచించవద్దన్నారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి నాయకుడికి, కార్యకర్తకు తాము అండగా ఉంటామని… ఊపిరి ఉన్నంతవరకు నాతోపాటు శ్రీరామ్ కూడా మీకోసమే పని చేస్తారని ఎమ్మెల్యే సునీత స్పష్టం చేశారు