– ఇన్ని కోట్ల అప్పులు తెచ్చి పీకింది ఏమీ లేదు
– కాగ్ డేటా రేవంత్ రెడ్డి పాలన బట్టలు విప్పేసింది
– విచారణలో ఏం గూడుపుఠాణీ నడుస్తుంది?
– సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ విచారణల్లో కూడా మొబైల్ ఫోన్లు అనుమతిస్తారు ఫిరాయింపుల విచారణలో స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్ రాజ్యాంగ విరుద్ధం – మీడియా, సందర్శకులు, మాజీ ప్రజాప్రతినిధులపై అసెంబ్లీ ప్రవేశ నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం
– బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్
హైదరాబాద్ : స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన తాజా బులెటిన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రంగా స్పందించారు. “లెజిస్లేటివ్ ట్రిబ్యునల్‌లో ఫిరాయింపుల కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంలో, స్పీకర్ కార్యాలయం విడుదల చేసిన బులెటిన్ ద్వారా మీడియా, సందర్శకులు, మాజీ ప్రజాప్రతినిధులపై అసెంబ్లీ ప్రవేశ నిషేధం విధించడం రాజ్యాంగ విరుద్ధం. అంతేకాదు, ఈ కేసులో వాదిస్తున్న అడ్వకేట్లు కూడా సెల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించడం హాస్యాస్పదం. సుప్రీం కోర్టు ఫుల్ బెంచ్ విచారణల్లో కూడా మొబైల్ ఫోన్లు అనుమతిస్తారు.
మరి ఈ విచారణలో ఎం గూడుపుఠాణీ నడుస్తుంది?” అని ప్రశ్నించారు. “ఇది స్పీకర్ వ్యక్తిగత నిర్ణయం కాదు, రేవంత్ రెడ్డి ప్రణాళికబద్ధంగా చేసిన చర్య. దొంగలు ఊర్లు పంచుకున్నట్టు వ్యవహారం సాగుతోంది. బులెటిన్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని స్పీకర్‌కి లేఖ రాశాను” అని తెలిపారు.
ఫిరాయింపుల విచారణను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించాలి. తమ నియోజకవర్గ ప్రజలకు వారి ఎమ్మెల్యేల ఫిరాయింపులపై వాదనలు తెలుసుకునే హక్కు ఉంది,” అని డాక్టర్ శ్రవణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. “రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అధోగతికి చేరింది. రాష్ట్ర బడ్జెట్లో 2.30 లక్షల కోట్లు ప్రతిపాదించినా, సెప్టెంబర్ నాటికి కేవలం 76 వేల కోట్లు మాత్రమే రియలైజ్ అయ్యాయి — అంటే 33 శాతం మాత్రమే. రెవెన్యూ వసూళ్లలో 40 శాతం, GST వసూళ్లలో 42 శాతం, స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్‌లో 32 శాతం మాత్రమే సాధించారు. రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన్నది. ఎక్సైజ్ ఆదాయం కూడా 35 శాతం లోపే ఉంది.
అయితే అప్పులు మాత్రం 83 శాతానికి చేరాయి. ప్రస్తుతం రూ.4.87 లక్షల కోట్ల అప్పు చేశారు. వీటికి తోడు మరో లక్ష కోట్లు బడ్జెట్‌కు సంబంధం లేని అప్పులు తెచ్చారు. ఇన్ని కోట్ల అప్పులు తెచ్చి పీకింది ఏమీ లేదు. ఇది రేవంత్ ఆర్థిక అత్యాచారం తప్ప మరేమీ కాదు,” అని వ్యాఖ్యానించారు. “కాగ్ డేటా రేవంత్ రెడ్డి పాలన బట్టలు విప్పేసింది. అనుభవం లేని సీఎం ఉంటే రాష్ట్రం ఇంత దిగజారడం సహజమే. హైడ్రా పేరిట, ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట ప్రజలపై దోపిడీ జరుగుతోంది. ఇలాంటి పాలనతో రేవంత్ ఓట్లు అడగడం సిగ్గుచేటు,” అని అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై మాట్లాడుతూ , “బోగస్ ఓటింగ్‌ను ప్రత్యక్షంగా చూశాము. పోలీసులు బోగస్ ఓటింగ్‌కు సహకరించారు. కాంగ్రెస్‌తో పాటు ఎంఐఎం కూడా అక్రమాలకు పాల్పడింది. ఎంత అక్రమాలు చేసినా ధర్మమే గెలుస్తుంది,” అని డాక్టర్ దాసోజు శ్రవణ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రెస్ మీట్లో బీఆర్ఎస్ నేతలు సతీష్ రెడ్డి, హరి రమాదేవి, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.