విశాఖపట్నంలో జరిగిన ఈ భాగస్వామ్య సదస్సు 2025 లో ‘అర్బన్ గవర్నెన్స్, రియల్ టైమ్, డిజిటల్ గవర్నెన్స్ ట్రాన్స్ఫర్మేషన్, సుస్థిరాభివృద్ధి’ వంటి కీలక అంశాలపై సింగపూర్-ఆంధ్రప్రదేశ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర భవిష్యత్తుపై ఆయనకున్న పట్టుదల, ఆనందం, ఆవేదనను ప్రతిఫలించాయి.
ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈ ఒప్పందాలను ముందు తీసుకెళ్లడంలో సింగపూర్, ఆంధ్రా కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని, “మేము మిమ్మల్నే అడుగుతాం” అంటూ సింగపూర్ ప్రతినిధి బృందాన్ని నవ్వుల్లో ముంచెత్తారు. అయితే, గత విధ్వంసకర పాలనలో అమరావతి మాస్టర్ ప్లాన్ భాగస్వామ్యం నుండి సింగపూర్ వైదొలగడం జ్ఞాపకం వచ్చిందో ఏమో… ఆయన కొంత భావోద్వేగానికి లోనయ్యారు.
“చాలా ఆనందంగా ఉంది ఈ ఎంఓయూ చేస్తుంటే… అంతలోనే ప్రజల కోసం చేస్తున్నప్పుడు సెట్‌బ్యాక్ వస్తే బాధ కలుగుతుంది” అని పేర్కొంటూ, మళ్లీ ఈ సంబంధాలను ‘ట్రాక్ లో’ పెట్టానన్న తృప్తి అనిర్వచనీయం అంటూ కల్మషం లేకుండా తన మనసులోని మాటలను వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పక్కనే ఉన్న మంత్రి నారా లోకేష్ సైతం ఈ ఒప్పందంపై సంతోషం వ్యక్తం చేస్తూ కీలక వ్యాఖ్య చేశారు.
“రెండోసారి మా రాష్ట్రానికి అవకాశం ఇచ్చినందుకు సింగపూర్‌కు కృతజ్ఞతలు” అని లోకేశ్ అన్నప్పుడు, ఆ మాటలు ప్రజల తరపున వారు చెబుతున్నారు కదా అని అనిపించింది. వారిద్దరి కష్టాన్ని, రాష్ట్ర పురోగతిపై వారికున్న ఆవేదనను గమనించాక, తాజాగా వెలువడిన బీహార్ ఎన్నికల ఫలితాలను చూశాక, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా సహనంతో కనీసం మరో 13 ఏళ్లు అయినా స్థిరమైన పాలనకు అవకాశం ఇస్తే, రాష్ట్రం ఖచ్చితంగా బాగుపడుతుందని, వీరి కష్టాలకు ఫలితం దక్కుతుందని, తిరిగిచూడనవసరం లేని స్థాయికి వెళుతుందనే ఆశ చిగురించింది. మొత్తంగా, సింగపూర్ పర్యటన కేవలం పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలకే కాకుండా, గత పాలనలో కోల్పోయిన నమ్మకాన్ని, బంధాన్ని పునరుద్ధరించడానికి జరిగిన ఒక ముఖ్యమైన భావోద్వేగ ప్రయత్నంగానూ చరిత్రలో నిలిచిపోనుంది.
