– జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కుదేలయింది
– మా తప్పులు సమీక్షించుకుంటాం
– గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు
– ఎలక్షన్ కమిషన్, పోలీస్ పనితీరుపైనా చర్చ జరగాలి
– జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ భవన్లో పార్టీ సీనియర్ నేతలతో కలిసి మాట్లాడిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. వారికి తోడుగా ప్రతి బూత్‌లో స్థానిక జూబ్లీహిల్స్ పార్టీ శ్రేణులు, నాయకులు కూడా కష్టపడ్డారు. వారందరికీ ధన్యవాదాలు. వారు కూడా మా అభ్యర్థికి రాజకీయ అనుభవం లేకపోయినా, చాలా కష్టపడి ఎన్నికల్లో గెలుపు కోసం పోరాటం చేశారు. మాగంటి సునీత కి కూడా అభినందనలు చెప్తున్నాం. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్క ఓటరుకు, ప్రజలకి పేరుపేరునా ధన్యవాదాలు. ఎన్నికల్లో పార్టీకి గణనీయమైన ఓటు శాతం నమోదు అయింది.
ప్రతి ఎన్నికల్లో గెలవాలని పోటీ చేస్తాము. గత రెండు సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ఎత్తిచూపడంలో… ఎన్నికల్లో మా పార్టీ నిజాయితీగా, చిత్తశుద్ధిగా పోరాడింది. ఎన్నికలు ఎలా జరిగాయో ప్రతి ఒక్కరూ చూశారు. ప్రతి సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని అన్ని సర్వే ఏజెన్సీలు చెప్పాయి. ఈ ఎన్నిక కొత్త ఉత్సాహాన్ని, కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ ఎన్నిక ద్వారా స్పష్టమైన ప్రత్యామ్నాయం భారత రాష్ట్ర సమితి అని ప్రజలు తీర్పునిచ్చారు. ఈ అంశాన్ని సానుకూల అంశంగా పార్టీ పరిగణిస్తున్నది. 2014 నుంచి 2023 వరకు 7 ఉప ఎన్నికలు జరిగాయి. అన్ని ఉప ఎన్నికల్లో అప్పటి ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఒక్క ఉప ఎన్నికల్లోనూ గెలవలేదు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఒకటి, రెండు సీట్లకే పరిమితమైంది. ఒక్క ఉప ఎన్నికల్లో గెలవకపోయినా, డిపాజిట్లు కోల్పోయినా అప్పటి ప్రతిపక్ష పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలను, ఆరు గ్యారెంటీల అమలును, ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోయాము. కులము, మతము పేరుతో రాజకీయం చేయలేదు. ప్రజలకు అవసరమైన అంశాలను మాత్రమే ప్రచారంలో చర్చకు పెట్టాం.
ప్రభుత్వంలో ఉన్నవాళ్లు బూతులు మాట్లాడినా, ప్రచారం సందర్భంగా మేము హుందాగా ఉన్నాం. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన పార్టీగా మేము చేసిన అభివృద్ధిని చూపించాము. 5300 కోట్ల అభివృద్ధిని నియోజకవర్గానికి చేశామని ప్రజల ముందుకు పెట్టాము. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిన ప్రతి ఒక్క అంశాన్ని ‘బాకీ కార్డు’ రూపంలో ప్రజల ముందుకు తీసుకుపోయాం. హైడ్రా నుంచి మొదలుకొని, ఆటో అన్నల సమస్యల వరకు అనేక అంశాలను ప్రచారం సందర్భంగా ప్రజలకు తెలియజేసేలా ప్రచారం చేశాం. ఈ విధంగా మా ప్రభుత్వం మాట్లాడక తప్పని పరిస్థితి తీసుకు వచ్చాం. మా ఒత్తిడి కారణంగానే గ్యారెంటీల అమలుపైన ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సమీక్ష చేసే స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చాం.
మంత్రివర్గంలో మైనారిటీలకు స్థానం లేదని, ఆటోలకు జరుగుతున్న అన్యాయం పైన మా పార్టీ గళమెత్తితే, ప్రభుత్వం ఒత్తిడికి లోనై వారికి స్థానం కల్పించాల్సి వచ్చింది. గెలవాల్సింది పార్టీలు కాదు, గెలవాల్సింది ప్రజలు అని నమ్మే పార్టీ మాది. ఈ ఎన్నిక ఏ విధంగా జరిగిందో ప్రజల్లో, మీడియాలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఎన్ని రకాలుగా అక్రమాలకు కాంగ్రెస్ పార్టీ పాల్పడిందో నెల రోజుల ముందు చెప్పాం. స్వయంగా అభ్యర్థి తమ్ముడికి దొంగ ఓట్లు ఉండడం, దొంగ ఓటరు కార్డుల పంపిణీ, షెడ్యూల్ మొదలు పోలింగ్ రోజు వరకు జరిగిన అక్రమాల గురించి ఎన్నికల కమిషన్‌కు అనేక ఫిర్యాదులు చేశాం. కానీ ఎప్పటికప్పుడు ఫిర్యాదు చేశాం. ఎలక్షన్ కమిషన్ మరియు పోలీస్ పనితీరుపైనా చర్చ జరగాలి. ఈ విధంగా ఎన్నికలు జరిగిన తీరుపైన ప్రజాక్షేత్రంలో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. ఏదేమైనా ప్రజా తీర్పుని మేము గౌరవిస్తాం. ఈ ఎన్నిక ఫలితం పైన కూడా ఆత్మ విమర్శ చేసుకుంటాం. ఈ ఎన్నికల్లో మరింత ఓటింగ్ జరిగి ఉండాల్సింది. మాకు ఈ ఎన్నికల్లో మంచి ఓటింగ్ వచ్చింది.
సింగిల్ డిజిట్లో ఉండి డిపాజిట్ బీజేపీ కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బిజెపి కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయం ఫలించినట్టుగానే కనిపిస్తున్నది. ఆర్ఎస్ బ్రదర్స్ సమీకరణం బానే వర్కౌట్ అయినట్టు కనిపించింది. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయం అని ప్రజలు నిరూపించారు. ఎన్నికల ఫలితం వలన నిరాశ చెందము. మా పనిని ప్రధాన ప్రతిపక్షంగా చేసుకుంటూ పోతూనే ఉంటాం. ప్రజలతోనే ఉంటాం.
ప్రజల కోసమే ఉంటాము. ప్రజల్లోనే ఉంటాం. తిరిగి కెసిఆర్ ని ముఖ్యమంత్రి చేసుకునేదాకా పోరాటం చేస్తూనే ఉంటాం. గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ చేసిన లగచర్ల నుంచి మొదలుకొని అనేక అరాచకాలను, అక్రమాలను, అవినీతిని ఎండగడుతూనే ఉన్నాము. ఇదే విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పనిచేసుకొని ముందుకు వెళ్దాం. సోషల్ మీడియా ద్వారా ఎక్కడికక్కడ రాష్ట్ర ప్రభుత్వ అరాచకాలను, అవినీతిని ఎండబెడుతున్న ప్రతి ఒక్క సోషల్ మీడియా వారియర్‌కు, ప్రతి ఒక్క పార్టీ కార్యకర్తకు, పార్టీ నేతలు అందరికీ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ ఎన్నికతో నిరాశ చెందవలసిన అవసరం లేదు. కాంగ్రెస్ జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీ బీహార్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితిలో ప్రజలు తీర్పునిచ్చారు.
ఎన్నిక తర్వాత కూడా ప్రతి ఒక్కరూ ప్రభుత్వాన్ని ఎండగట్టే పనిలో నిమగ్నమై ముందుకు పోదాం. పశ్చిమ బెంగాల్లో జరిగిన మాదిరి ఇక్కడ కూడా పార్టీ మారిన నేతలను డిస్క్వాలిఫై చేసి ఉప ఎన్నికలు వస్తాయి అని ఆశిస్తున్నాము. ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకే ఇన్ని అపసోపాలు పడిన కాంగ్రెస్ పార్టీ, 10 ఉప ఎన్నికలు వస్తే ఎలా ఎదుర్కొంటుందో చూస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే బలంగా కొట్లాడతాం ఈ ఎన్నిక సందర్భంగా మా పార్టీ సీనియర్ నేత హరీష్ రావు తండ్రి మరణం తర్వాత కూడా, ఎప్పటికప్పుడు ఇంటి నుంచి ఎన్నికల కోసం పనిచేశారు. మా పార్టీ ఎమ్మెల్సీ రవీందర్ రావు సోదరుడు చనిపోయిన తర్వాత కూడా ఒకే రోజులోనే పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. దీపావళి లాంటి పండగను సైతం పక్కనపెట్టి పార్టీ విజయం కోసం ప్రయత్నం చేసిన ప్రతి ఒక్క పార్టీ నేతకు, కార్యకర్తకు ధన్యవాదాలు.