– బండి సంజయ్‌తో కుమ్మక్కై బీజేపీ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లించారు
– జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార దుర్వినియోగం, రాజకీయ కూటములే కాంగ్రెస్ గెలుపునకు కారణం
– ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం — బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఘన విజయం గా చూపించుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మాత్రమే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణం. దీన్ని ప్రజల ఆమోదంగా చెప్పుకోవడం అవివేకమన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారడంతో, సీఎంతో మొదలుకొని 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యకర్తలు, పోలీస్ వ్యవస్థ, డీజీపీ వరకు మొత్తం యంత్రాంగాన్ని మోహరించారని, ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బీహార్, రాయలసీమ, పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో కనిపించిన విధంగానే ఉన్నాయని ఆయన తెలిపారు. ఆడబిడ్డపై దాష్టీకం జరగడం నుండి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం వరకు ప్రతి దశలో అధికార దుర్వినియోగం జరిగినట్లు ఆరోపించారు.
ఎన్నికల సంఘం, ప్రభుత్వ అధికారులు, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ విజయాన్ని కట్టిపడేశారని, ప్రజలు రేవంత్ రెడ్డిని కాదు. నవీన్ యాదవ్‌ను చూసి ఓటు వేశారని అన్నారు. 2023లో ఓడిపోయిన అజహారుద్దీన్‌కు టిక్కెట్ ఇవ్వకపోవడం, రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన గద్దర్‌ను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పక్కనపెట్టడం..కాంగ్రెస్‌లో జరుగుతున్న అసలు రాజకీయాలకు ఉదాహరణలంటూ విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి మిత్రులకు మాత్రమే టిక్కెట్లు, పదవులు లభిస్తున్నాయని, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, నదీమ్ జావేద్ వంటి నాయకులను ఆయన సహించలేకపోతున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యేలతో, నాయకులతో అవమానకర పదజాలం ఉపయోగించడం అతని అహంకారానికి నిదర్శనమని అన్నారు. బండి సంజయ్‌తో కుమ్మక్కై బీజేపీ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లించారని, అసదుద్దీన్ ఒవైసీని బ్రతిమిలాడి బోగస్ ఓట్లు వేసేలా చేసి గెలుపు సాధించారని దాసోజు శ్రవణ్ ఆరోపించారు. బీహార్‌లో ఇండియా కూటమి ఓటమికి కారణమైన ఎంఐఎంనే ఇక్కడ పొగడడం రేవంత్ రెడ్డి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. లగచర్ల బాధితులకు న్యాయం చేయకపోవడం, హెచ్‌సియు చెట్ల నరికివేత, హైడ్రా–మూసీ పేరుతో ఇళ్ల కూల్చివేతలు, సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు తీసుకోవడం, రియల్ ఎస్టేట్‌పై ఆర్–ఆర్ ట్యాక్సులు, ఎన్నికల కమిషన్‌కు 20 ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం ప్రజలు మరచిపోరని అన్నారు.
కాంగ్రెస్‌లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు సీఎం సీటు కోసం కాపు కాస్తున్నారని, మంత్రులు రేవంత్ రెడ్డి విఫలం కావాలనే చూస్తున్నారని, రేవంత్ రెడ్డి కుర్చీ కింద ఉన్న కుంపట్లు ఎంత అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోందని తెలిపారు. జూబ్లీహిల్స్‌లో ప్రజాస్వామ్యం నిలిచిఉందా లేదా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ విజయం రేవంత్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్ కాదు. అధికార దుర్వినియోగం, ఒత్తిడి, రాజకీయ కూటముల ఫలితం మాత్రమే అని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు.