వృద్ధ నారీ పతివ్రతః అనే సామెత తెలుగు వారందరికీ తెలిసిందే
కానీ, అది తెలుగు సామెత కాదు సంస్కృత నానుడి
ముందుగా ఈ నానుడిని ఎవరు చెప్పారో తెలియదు కానీ, అది మాత్రం సజీవం గా ఒక తరం నుంచి ఇంకో తరం కు బదిలీ అవుతూ వస్తున్నది. ప్రవీణ్ ప్రకాష్ లాటి ఆరాచక వాది ని చూసినప్పుడు, ఈ సంస్కృత నానుడికి అర్ధం…. బండగా, మొరటుగా చెప్పాలని పిస్తుంది. వయసులో ఉన్నప్పుడు… ఓ ఊపు ఊపేస్తూ ; వయసుడిగి పోయిన తరువాత నిండుగా పైట కప్పుకుని, రెండు కాళ్ళూ ఒక్క చోటికి చేర్చి పూజా పురస్కారాలతో… దైవ సాన్నిధ్యం లో కాలం గడిపేవారిని చూసి, ఏ మహానుభావుడో….
ఈ నానుడికి ప్రాణ ప్రతిష్ట చేసి ఉంటాడు. మామూలు మన భాషలో చెప్పుకోవాలి అంటే…. అవకాశాలు ఎదురుగా ఉన్నప్పుడు ఎడా పెడా లంచాలు పీకేసి, అవకాశాలు తగ్గిపోయాక ( అంటే రిటైర్ అయ్యి గానీ, పదవులు లేకపోయి గానీ ) పార్కుల్లో కూచుని, వేరు శనక్కాయాలు తింటూ, ” ఏమిటోనండీ! లంచగొండి తనం మరీ పెరిగిపోయింది. సమాజం ఎటు బోతుందో అర్ధం కావడం లేదు…” అంటూ నిట్టూర్పువిడిచే బాపతు జనానికి కూడా ఈ సామెత వర్తిస్తుంది. ఇప్పుడు ఈ సామెత గుర్తుకు రావడానికి కారణం… ప్రవీణ్ ప్రకాష్ అనే పెర్వెర్టెడ్ జీనియస్. ఉత్తరప్రదేశ్ కు చెందిన పీపీ ( ప్రవీణ్ ప్రకాష్ ) 1994 బ్యాచ్ కి చెందిన ఐఏఎస్ అధికారి. “పిచ్చి కుదిరింది. రోకలి తలకు చుట్టండి…” అంటూ చిందులేసే రకం అతను అ ని పలువురు ఐఏఎస్ అధికారులు…. తమ ప్రైవేట్ సంభాషణల్లో జనాంతికం గా చెబుతుంటారు. “తా వలచింది రంభ. తా మునిగింది గంగ…” టైపు అన్న మాట.
నైతిక విలువలు అనే మాటే ఆయనకు పడదు. ఏ శాఖలో పనిచేయాల్సి వస్తే…. ఆ శాఖలోని వారిని కాల్చుకు తినడం లో పెట్టింది పేరు ప్రవీణ్ ప్రకాష్. ఈ ‘సద్గుణాలు’ అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా నచ్చి ఉంటాయి. అందుకే, ఆయనకు నచ్చని అధికారుల పనిబట్టే పనిని ఈ పనోడికి అప్పగించి ఉంటారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వీ సుబ్రహ్మణ్యం మీద జగన్ కు ఉన్నట్టుండి కోపం వచ్చింది. రూల్స్ మాట్టాడితే కోపం రాదేంటి మరి? ఉన్నట్టుండి, బాపట్ల లో మానవ వనరుల అభివృద్ధి సంస్థ కు తన్ని తగలేసే పనిని ప్రవీణ్ ప్రకాష్ కు జగన్ అప్పగించారు. వెంటనే, తెల్ల కాగితం పై నల్లక్షరాలు టైపు చేసి, అదే జీ ఓ అన్నారు.
నిజానికి, ఎల్ వీ 1983 బ్యాచ్ అధికారి. ఈ ప్రవీణ్ ప్రకాష్ 1994 బ్యాచ్ అధికారి. అంటే 11 ఏళ్ళు జూనియర్. అయితే ఏం? జగనన్న కళ్ళల్లో ఆనందం చూడడం ముఖ్యమనుకున్న ప్రకాశన్న, టక టకా టైపు చేసి సంతకం పెట్టి పారేశారు. ఉచ్ఛ నీచాలతో పెద్దగా పట్టింపులు లేవు. అలాగే, ఐపీఎస్ అధికారి ఏ బీ వెంకటేశ్వర రావు, ఐ ఆర్ ఎస్ అధికారి కృష్ణ కిషోర్ అంటే కూడా జగనన్న కు పరమ చిరాకు (ట). దాంతో, వాళ్లిద్దరినీ ప్రాసిక్యూట్ చేసి పారేయమని జీ ఏ డీ ( అంటే ప్రభుత్వమే ) ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారు. అవేమీ కోర్టుల్లో నిలవలేదు అనేది వేరే విషయం.
ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అయ్యుండి, అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆసనం పక్కన, ఫుల్ సూట్ లో మోకాళ్ళ మీద ఎలా కూర్చున్నారో చూసిన తోటి ఐఏఎస్ లు సిగ్గుతో చచ్చిపోయి ఉంటారు. అటువంటి ప్రవీణ్ ప్రకాష్ కు – 2024 ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం జీర్ణం కాలేదు. ఇంకా అరేడేళ్ల సర్వీస్ ఉండగానే పదవీ విరమణ చేశారు. చేసినా, పింఛను వస్తుంది.
ఇప్పుడు – అధికారం లేదు. ప్రభుత్వం లో గౌరవం ఉండే అవకాశం లేదు. ప్రవీణ్ ప్రకాష్ అంటే…. ఒక లాఫింగ్ స్టాక్. ఇప్పుడు…. అంతా అయిపోయాక…. తనకంటే ఐదారేళ్ల సీనియర్ అధికారులకు చేయవలసిన అపకారం అంతా చేసిన తరువాత…. పేనుకు పెత్తనం ఇస్తే…. తలంతా గొరిగి పెట్టిందన్న చందం గా…. వారికి చేయగూడని అపకారం అంతా చేసేసి…. ఇప్పుడు క్షమించండి అంటూ, పత్తిత్తు కబుర్లు చెబుతున్న ఇతన్ని చూస్తుంటే…. వృద్ధ నారీ పతివ్రత అనే నానుడి గుర్తుకు రాకుండా ఉంటుందా ఎవరికైనా. పెన్షన్ కు కూడా ఇతను అర్హుడు కాదు. ” క్షమించమని ప్రవీణ్ ప్రకాష్ అడుగుతున్నాడు సర్. ఏమంటారు మీరు? ” అని జపాన్ పర్యటన లో ఉన్న ఏబీ వెంకటేశ్వర రావుకు ఫోన్ చేసి అడిగితే, ఆయన ఫకాలున నవ్వారు. తెరలు తెరలు గా నవ్వారు. – భోగాది వేంకట రాయుడు