అమలాపురం: ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా మార్చేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఎంత వ్యూహాత్మకంగా శ్రమిస్తున్నారో నిరూపణగా సిఐఐ భాగస్వామ్య సదస్సు నిలిచిందని తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు తెలిపారు.
ఈ సదస్సు ద్వారా పెట్టుబడుల యుగానికి పునాది పడటం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ పై గ్లోబల్ దృష్టిని మళ్లీ కేంద్రీకరించిందని ఆయన అన్నారు. ఆదివారం నాడు అమలాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెట్టుబడులకు ఏపీని గమ్యస్థానంగా నిలపడంలో చంద్రబాబు
మరోసారి తన ప్రావీణ్యాన్ని నిరూపించారని అన్నారు.
రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకు సమానంగా పెట్టుబడులు వచ్చేలా మంత్రి లోకేష్ ప్రత్యేకంగా కంపెనీలను గైడ్ చేశారని తెలిపారు. ప్రతి రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ అందుకు భిన్నంగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను అనుసరిస్తుండడంతో రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కట్టాయని తెలిపారు.
ప్రతి రంగానికి స్పష్టమైన పాలసీలు రూపకల్పన చేసి, సింగిల్ విండో సిస్టమ్ ద్వారా పెట్టుబడులకు అన్ని అనుమతులు వేగంగా ఇవ్వడం వంటివి పరిశ్రమలు ఆకర్షణకు ప్రధాన కారణంగా ఆయన అభిప్రాయపడ్డారు.రెండు రోజుల్లోనే భారీ ఎత్తున ఒప్పందాలు కుదుర్చుకొని పెట్టుబడుల వర్షం కురిపించడం చంద్రబాబు, లోకేష్ కి పెట్టుబడుల పట్ల ఉన్న స్పష్టమైన విజన్ ను చూపిందని అన్నారు.
మొత్తం 613 ఒప్పందాల ద్వారా రూ. 13,25,716 కోట్ల పెట్టుబడులు, 16,13,188 ఉద్యోగాలు రావడం రాష్ట్ర అభివృద్ధి పట్ల పెట్టుబడిదారుల నమ్మకానికి ప్రత్యక్ష సాక్ష్యం అని పేర్కొన్నారు. అంచనాలకు మించి పరిశ్రమలు ఏపీ వైపు పరుగెత్తి రావడం చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో అభివృద్ధి మళ్లీ ట్రాక్ పైకి వచ్చిందని నిరూపించిందన్నారు.
సదస్సుకు ఒక రోజు ముందే రాష్ట్రంలో పెట్టుబడుల వరద మొదలైందని, రూ.3,65,304 కోట్లు పెట్టుబడులతో 1,26,471 ఉద్యోగావకాశాలు సృష్టించే 35 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోవడం చూస్తుంటే ప్రభుత్వంపై పారిశ్రామికవేత్తలలో విశ్వాసం ఎలా ఉందో తేటతెల్లమైందని అన్నారు. తొలి రోజు ఒక్కరోజే రూ.8.26 లక్షల కోట్ల భారీ పెట్టుబడులు, వాటి ద్వారా 12.05 లక్షల ఉద్యోగాలు నమోదవడం ఏపీ అభివృద్ధికి గట్టి బలం అన్నారు.
ఏపీ సీఆర్డీఏ, ఎనర్జీ, ఫుడ్ ప్రాసెసింగ్, పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం, మున్సిపల్ వంటి కీలక శాఖల్లో ఒప్పందాలు కుదరడం పెట్టుబడులను సమగ్రంగా ఆకర్షిస్తున్న ప్రభుత్వ నైపుణ్యాన్ని చూపిందని సతీష్ బాబు చెప్పారు. జగన్ రెడ్డి విధ్వంసకర విధానాలకు భయపడి రాష్ట్రం విడిచి వెళ్ళిపోయిన రెన్యూ, హీరో ఫ్యూచర్స్, ఏబీసీ వంటి కంపెనీలు సైతం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలు, లోకేష్ అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఆకర్షితులై తిరిగి రాష్ట్రానికి వచ్చాయని ఆయన తెలిపారు. పెట్టుబడులు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా మూడు ప్రాంతాలకు సమానంగా వెళ్లడం..
ఇది ప్రభుత్వ వికేంద్రీకరణ నిబద్ధతకు నిదర్శనం అని పేర్కొన్నారు. నాడు జీనోమ్ వ్యాలీ, మైక్రోస్టాఫ్ వంటి టెక్ దిగ్గజాలను హైదరాబాద్ కు తీసుకొచ్చి అభివృద్ధిలో రాష్ట్రాన్ని ముందుంచిన వ్యక్తి చంద్రబాబు అని, నేడు కూడా ప్రతి ప్రాంతానికో ప్రధాన పరిశ్రమను తీసుకొచ్చి అభివృద్ధిలో ముందుంచుతున్నారని ఆయన ప్రశంసించారు. సిఐఐ సమ్మిట్ పవర్ సెక్టార్లో కుదుర్చుకున్న అధిక శాతం పెట్టుబడులు రాయలసీమకే రావడం, రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రి ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతోందని అన్నారు.
డ్రోన్, రెన్యూవబుల్ ఎనర్జీ, మాన్యుఫ్యాక్చరింగ్, టాక్స్ టైల్ హబ్ గా రాయలసీమను, క్వాంటం,ఆక్వా, పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీయల్ హబ్, హార్టికల్చర్, పెట్రో కెమికల్, ఎడ్యుకేషన్, హెల్త్, మెడికల్ హబ్ గా కోస్తాంధ్రను, డేటా టెక్, ఐటి, ఏఐ, ఫుడ్ ప్రాసెసింగ్, ఎలక్ట్రానిక్స్ హబ్ గా ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు. సిఐఐ సదస్సులో ప్రతి జిల్లాకి ప్రాధాన్యత లభించిందని, ప్రతి జిల్లాకు పరిశ్రమలను తీసుకొచ్చారని, ఇదే అసలైన పెట్టుబడుల వికేంద్రీకరణ అంటే అని సతీష్ బాబు వ్యాఖ్యానించారు.
సదస్సు విశాఖలోనే జరిగి ఉండవచ్చు… కానీ పెట్టుబడులు మాత్రం యావత్ రాష్ట్రానికి విస్తరించేలా సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి చేశారని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్కును ఏర్పాటు చేసి ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేసేందుకు స్పష్టమైన ప్రణాళికతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని టిడిపి మీడియా కోఆర్డినేటర్ సతీష్ బాబు తెలిపారు.