– ఏపీ బయోడైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్
మంగళగిరి : కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్య భద్రత కోసం మహత్తరమైన ప్రాజెక్టును ప్రారంభిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్ అందించే యూనివర్సల్ హెల్త్ పాలసీని అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఆరోగ్య రక్షణకు నూతన ప్రమాణాలు ఏర్పాటు చేసిందని ఏపీ బయోడైవర్సిటీ ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే…
“ఎన్టీఆర్ వైద్య సేవ ఉందిగా?” అని కొందరు అడగవచ్చు. అవును, ఆ పథకం కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఇప్పుడు పేద–మధ్యతరగతి–ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఈ కొత్త బీమా యోజన కిందకు వస్తోంది. రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న పేద కుటుంబాలకు.. ఏడాదికి రూ.2.50 లక్షల వరకు బీమా సంస్థ ద్వారా క్యాష్‌లెస్ వైద్యం. రూ.2.50 లక్షల పైబడిన ఖర్చులను రూ.25 లక్షల వరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ భరిస్తుంది. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీ ద్వారా మొత్తం 1.63 కోట్ల కుటుంబాలకు మేలు కలుగుతుంది.
ఇది కేవలం పేదలకే కాకుండా, దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న మధ్యతరగతి, ధనిక కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లోని 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. వైఎస్సార్సీపీ పాలనలో ఆరోగ్యశ్రీ పేరుతో వేర్వేరు ప్యాకేజీల్లో వైద్యం ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురిచేశారు. కానీ, కూటమి ప్రభుత్వం అన్నింటినీ ఒకే ప్యాకేజీ కిందకి తీసుకువచ్చి, అందరికీ సకాలంలో, నాణ్యమైన వైద్యసేవలు అందేలా వ్యవస్థను రూపొందించింది. కొన్ని సేవలను అన్ని ఆసుపత్రుల్లో అందేలా, కొన్ని సేవలను ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రమే కేటాయించేలా, అత్యంత అరుదైన ఆపరేషన్లు–చికిత్సలను ట్రస్ట్ పరిధిలో ఉంచేలా సమర్థవంతమైన రేషనలైజేషన్ చేశారు. ఈ మార్పుల వల్ల ప్రస్తుత లబ్ధిదారులకు ఎలాంటి నష్టం లేదు. ఆరోగ్యశ్రీ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కూడా కొనసాగుతుంది. వారు అదే ఇన్సూరెన్స్ సంస్థల్లో, అదే వేతనంతో పనిచేస్తారు.
పాలసీ నిర్వహణను రాష్ట్రాన్ని రెండు జోన్లుగా విభజించి అమలు చేస్తున్నారు
జోన్–1: శ్రీకాకుళం నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు
జోన్–2: గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, రాయలసీమ ప్రాంతాలు
ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం ముందుకు పోతుందని నమ్మిన కూటమి ప్రభుత్వం, ఈ కొత్త విధానంతో ప్రతి ఇంటికీ ఆరోగ్య భద్రతను అందించేందుకు కట్టుబడి ఉంది. ఇప్పటివరకు ఎన్టీఆర్ వైద్యసేవ పథకం కవరేజ్ రూ.5 లక్షలు మాత్రమే కాగా, ఇప్పుడు అది రూ.25 లక్షలకు పెరిగింది. ఇది రాష్ట్ర ఆరోగ్య చరిత్రలో ఇప్పటివరకు లేని పెంపు.
ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఆరోగ్య రోల్ మోడల్‌గా నిలపడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. “రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి హెల్త్ ఇన్సూరెన్స్—ఇది కూటమి ప్రభుత్వ కొత్త ఆలోచన, కొత్త దిశ” అని నీలాయపాలెం విజయ్ కుమార్ అన్నారు