– లడ్డాతో పెరిగిన ‘నిఘా’ ప్రతిష్ఠ – హిడ్మా హతంతో నిఘా నెట్వర్క్కు ఈ ఏడాది భారీ విజయం
( భోగాది వేంకట రాయుడు)
2005.ఏప్రిల్ 27. ప్రకాశం జిల్లా అప్పటి పోలీస్ సూపరింటెండెంట్ మహేష్ చంద్ర లడ్డా ఆఫీస్ లో పనులు ముగించుకుని, లంచ్ కని క్యాంపు ఆఫీస్ కి వెడుతున్నారు. ఆయన కారు రంగరాయ చెరువు పక్కగా వస్తుండగానే, ఆయనకు గురిపెట్టి క్లేమోర్ బాంబును నక్సలైట్లు పేల్చారు. తృటి లో ఆయన బయట పడ్డారు గానీ, రోడ్ న పోయేవారు ఓ ఇద్దరు ఆ బాంబు దాడిలో మృతి చెందారు. ఏ మహేష్ చంద్ర లడ్డా ను అప్పటి నక్సలైట్లు మట్టు బెట్టాలని చూశారో… ఆ మహేష్ చంద్ర లడ్డా… ఓ ఇరవై ఒక్క ఏళ్ళ తర్వాత మావోయిస్టులని పేరు మార్చుకున్న ఆ నక్సలైట్ల నడ్డి విరిచేశారు.
నిన్న మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో…. భద్రతా దళాలను ముందునుంచి నడిపించారు. చత్తిస్ ఘడ్ పోలీసులకు పక్కలో బళ్లెం అన్నట్టుగా తయారైన హిడ్మా అనే మావోయిస్టు ను, అతని భార్యను…. వీరికి అంగరక్షకులుగా ఉన్న మరో నలుగురిని ఎదురు కాల్పుల్లో భద్రతా దళాలు మట్టు బెట్టాయి. అలాగే, కాకినాడ… ఏలూరు, విజయవాడలో పెద్దసంఖ్యలో మావోయిస్టు లను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లు అన్నిటిలోనూ ఇంటలిజెన్స్ విభాగమే కీలకం గా వ్యవహరించింది.
అసలు గత వారం పదిరోజుల నుంచి నిఘా పెద్ద తలలు ఈ ఆపరేషన్పైనే తలమునకలయ్యారు. వారి పని వారు గుంభనంగా చేసుకుపోయారు. రెండో కంటికి తెలియకుండా హిడ్మా టీమును లేపేసి, 50 మంది కరుడుగట్టిన మావోయిస్టులను అరెస్టు చేశారు. ఎస్ఐబి పనితీరు అంతే ఉంటుంది. ఇంటెలిజెన్స్ లో అదనపు డీజీ మహేష్ చంద్రా కు తోడు, ఐ జీ గా పీహెచ్డీ రామకృష్ణ కూడా ఉన్నారు. రామకృష్ణ అయితే, ఆయన నీడను కూడా ఆయన నమ్మరు. అది తన వెనుకే ఎందుకు ఫాలో అవుతున్నదో కనుక్కోమని ఎంక్వయిరీ కి ఆదేశిస్తారు.
ఎస్ఐబి వ్యవహారాలు చూసేది ఆయనే. సుదీర్ఘకాలం ఎస్ఐబి, కౌంటర్ ఇంటెలిజన్స్లో పనిచేసిన అనుభవం ఆయనది. 2024 జులై లో రాష్ట్ర ఇంటలిజెన్స్ బాస్ గా నియమితులైన మహేష్ చంద్ర లడ్డా…1998 బ్యాచ్ కి చెందిన ఐపీయస్ అధికారి. 2019 ఎన్నికలకు ముందు ఇంటలిజెన్స్ లో ఐ జీ హోదాలో ఒకసారి పని చేశారు. ” నో నాన్సెన్స్ ఆఫీసర్ ” గా పేరు. ఈ ఎన్కౌంటర్ తో ఛత్తిస్ ఘడ్ పోలీసులకు గొప్ప రిలీఫ్ కలిగించారు. ఈ హిడ్మా ను పట్టుకోడానికి రాష్ట్ర, కేంద్ర బలగాలు చేయని ప్రయత్నం లేదు. గాలించని అడవిలేదు. బస్తర్ ప్రాంతానికి చెందిన హిడ్మా… కేవలం పోలీసులను, భద్రతా దళాలను హత మార్చడానికే పుట్టాడా అన్నట్టుగా… 17 ఏళ్ళకే నక్సలైట్ అవతారం ఎత్తాడు అని పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.
అతను కూడా గిరిజన తెగ ఒక దానికి చెందిన వాడు కావడం తో బస్తర్ ప్రాంత గిరిజనుల్లో గట్టి పట్టు ఉండేది. దానితో, అతని ఆనుపానులు అంతుబట్టక పోలీసులు అల్లకల్లోలమై పోతూ వస్తున్నారు. గొరిల్లా యుద్ధ తంత్రం తో పోలీసు దళాలను దొంగ దెబ్బ తీయడం లో ఆరితేరిన హిడ్మా పేరు… బహుశా 2010 లో జరిగిన దంతేవాడ ఊచకోత తో బాగా ప్రచారం లోకి వచ్చింది. ఇక, ఆ తర్వాత దాదాపు 26 ఘటనల్లో రెండు వందల మందికి పైగా పోలీసులను హతమార్చినట్టు పోలీసు రికార్డులకు ఎక్కాడు.
అతని తలపై కోటి రూపాయల రివార్డ్ ను కూడా ప్రభుత్వాలు ప్రకటించాయి. అతని భార్య పై కూడా యాభై లక్షల రివార్డు ఉంది. షెల్టర్ కోసం అతనికి పుట్టిల్లు లాటి ఛత్తిస్ ఘడ్ అడవులు దాటి రావలసిన అవసరం గత పాతికేళ్ల లో పడినట్టు లేదు గానీ ; ఇప్పుడు ఛత్తిస్ ఘడ్ అడవులను భద్రతా దళాలు కర్రెగుట్టలు జల్లెడ పడుతుండడం తో, “సేఫ్ జోన్ ” కోసం ఆంధ్ర లోకి అడుగు పెట్టినట్టుంది. ఈ పరిస్థితిని తాము ముందుగానే అంచనా వేసి, ఆ దిశగా నిఘా ను కట్టుదిట్టం చేయడమే గాక ; ఆక్టోపస్, గ్రే హౌండ్స్, స్పెషల్ ఫోర్సస్ సమన్వయం కూడా పగడ్బందీ గా చేశామని మహేష్ చంద్ర లడ్డా చెప్పారు. వీరితో పాటు, పలువురు మావోయిస్టు లు మూకుమ్మాడిగా దొరికిపోవడం, కేంద్ర కమిటీ సభ్యుడు తిరుపతి దళ సభ్యులు, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, ఏరియా కమిటీ సభ్యుల స్థాయి నాయకులు అరెస్ట్ కావడం…. రాష్ట్ర పోలీసుకు, ఇంటలిజెన్స్ నెట్ వర్క్ కు 2025 ముగింపులో అతి పెద్ద విజయాలే.
