– పత్తి దిగుబడి ఎంత వచ్చినా సీసీఐ మొత్తం కొనుగోలు చేస్తుంది
– తెలంగాణలో ఇప్పటికే 200కి పైగా కొనుగోలు కేంద్రాలు
– మోదీ అధికారంలోకి రాకముందు కేవలం 70–80 కేంద్రాలు మాత్రమే
– రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది
– మీడియాతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారంతో తెలంగాణ రైతులను తప్పుదారి పట్టిస్తోంది. ఈరోజు పత్రికలు మరియు వివిధ ప్రచార సాధనాల ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది. ఒకవైపు తెలంగాణ రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ అమలు కాకపోవడం వల్ల రైతులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు తీర్చలేక తీవ్ర ఒత్తిడికి, ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో నల్లగొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన ఒక రైతుతో పాటు మరో రైతు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరం. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ గతంలోని తమ పాలనా వైఫల్యాలను దాచేందుకు కేంద్రంపై అనవసర నిందలు మోపుతోంది. రైతులకు బేడీలు వేసి జైలుకు పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు సీసీఐపై తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారం చేయడం సరికాదు. పత్తి కొనుగోలు విషయంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొత్తగా మరిన్ని నిబంధనలు పెట్టి రైతులను ఇబ్బందిపెడుతోందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI), ప్రొక్యూర్మెంట్ సెంటర్లు, జిన్నింగ్ మిల్స్, ఎంఎస్పీ అమలు విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాల ఆలోచించి రైతులకు అండగా నిలుస్తోంది. తెలంగాణలో ఇప్పటికే 200కి పైగా కొనుగోలు కేంద్రాలు పనిచేస్తున్నాయి. కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కేవలం 70–80 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు అవి మూడింతలు పెరిగాయి. పంజాబ్‌లో ఎకరానికి 530 కిలోల దిగుబడి ఉంటే, హర్యానా–7, రాజస్థాన్–7, గుజరాత్–7, ఆంధ్రప్రదేశ్–9, కర్ణాటక–8 క్వింటాళ్లు నమోదయ్యాయి. కానీ తెలంగాణలో 12 క్వింటాళ్లు చూపించడం నమ్మశక్యంగా లేకపోవడం కొంత అనుమానాలకు దారితీస్తోంది. గత సంవత్సరం తెలంగాణలో ప్రతి ఎకరాకు 6.32 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. పత్తి కొనుగోళ్లలో, జిన్నింగ్ మిల్స్ విషయాల్లో తలెత్తిన ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.
కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి సీసీఐ చైర్మన్, రాష్ట్ర వ్యవసాయ శాఖ, టెక్స్టైల్ శాఖ ఉన్నతాధికారులు, జిన్నింగ్ మిల్లర్స్ సంఘం ప్రతినిధులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చొరవ చూపారు. పత్తి దిగుబడి ఎంత వచ్చినా సీసీఐ మొత్తం కొనుగోలు చేస్తుంది. ప్రధానమంత్రి స్వయంగా.. పత్తి రైతుల దగ్గర ఎంత ప్రొడక్షన్ ఉంటే అంతమొత్తాన్ని కొనుగోలు చేయాలని స్పష్టంగా ఆదేశించారు. పత్తి మాయిశ్చర్ విషయంలో దేశవ్యాప్తంగా ఒకటే విధానాన్ని అమలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా అదే పాలసీ అమల్లో ఉంది. రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దు. వచ్చే ఏడాది మార్చి వరకు కేంద్రం పత్తిని ఎంఎస్పీ రేటుకు కొనుగోలు చేస్తుంది. ఎటువంటి తప్పుడు వార్తలు, ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. దళారులకు అమ్మకుండా కొనుగోలు కేంద్రాల్లో మాత్రమే విక్రయించాలి.
పత్తి కొనుగోళ్లలో పారదర్శకత కోసం కేంద్రం కొత్త మొబైల్ యాప్ ‘కపాస్ కిసాన్ యాప్’ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ ద్వారా రైతులకు టైమ్ స్లాట్ కేటాయిస్తారు, కొనుగోలు కేంద్రాల్లో రద్దీ తగ్గుతుంది, దళారుల జోక్యం ఉండదు, చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంకులకు జమ అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిన్నింగ్ మిల్లుల ప్రతిపాదనలు పంపితే, కేంద్రం ఇప్పుడున్న 200 కొనుగోలు కేంద్రాలతో పాటు మరో 100 కొత్త కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. పత్తి సేకరణ మాత్రమే కాదు, జిన్నింగ్ మిల్స్, పత్తి బేళ్ల నాణ్యత, వస్త్ర పరిశ్రమను బలోపేతం చేయడం కోసం కేంద్రం రూ. 600 కోట్లతో “కపాస్ క్రాంతి మిషన్” ను ప్రారంభించింది. ఇది పొడవైన రేకుల పత్తి ఉత్పత్తిని పెంపొందించడం, పత్తి దిగుబడిని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈరోజు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 21వ విడత నిధులు విడుదల చేస్తోంది. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ. 18,000 కోట్లు జమ కానున్నాయి.
తెలంగాణలో 39 లక్షల మంది రైతులకు ఈ నిధులు చేరనున్నాయి. దేశ వ్యాప్తంగా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా, రైతులకు అండగా నిలిచేలా సాయిల్ హెల్త్ కార్డులు, నాణ్యమైన విత్తనాల పంపిణీ, ఫసల్ బీమా యోజన, పీఎం లఘు సించాయ్ యోజన వంటి అనేక పథకాలు, కార్యక్రమాలను కేంద్రం అమలు చేస్తోంది. భారత్ టెక్స్ 2025 కార్యక్రమం “Farm to Fabric, Fashion and Foreign Markets” అనే ప్రభుత్వ దృష్టిని వేగవంతం చేసే వేదికగా మారింది. 5F దార్శనికతతో భారత్ ప్రపంచ వస్త్ర పరిశ్రమకు విశ్వసనీయ వనరుగా నిలుస్తున్నది. భారతదేశం ఇప్పటికే లక్షల కోట్ల వస్త్ర ఎగుమతులు చేస్తోంది.
దేశీయ తయారీని బలోపేతం చేసి, ప్రపంచ మార్కెట్‌ను విస్తరించేలా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. 2014 వరకు కేవలం 113 లక్షల బేళ్లు మాత్రమే కొనుగోలు జరిగితే, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 473 లక్షల బేళ్లకు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రంలో పత్తి దిగుబడి లెక్కలపై అనుమానాలు ఉన్నప్పటికీ.. రైతుల శ్రేయస్సు దృష్ట్యా కేంద్రం పూర్తి కొనుగోలు చేస్తోంది. గతంలో తెలంగాణలో ప్రతి ఎకరానికి 6.83 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే ఉండేది. ఈసారి 11.80 క్వింటాళ్ల ఉత్పత్తి వచ్చినట్లు చూపించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయినప్పటికీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ, ప్రధానమంత్రి ఆదేశాల ప్రకారం సీసీఐ ఎకరానికి ఎంత దిగుబడి వచ్చినా పూర్తిగా ఎంఎస్పీ రేటుకు కొనుగోలు చేస్తోంది. కేంద్రం రైతుల సంక్షేమానికే ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. రైతులకు ఎలాంటి కష్టం లేకుండా, సాఫీగా కొనుగోలు జరగాలని కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉంది. పత్తి కొనుగోలు సమయంలో జిన్నింగ్ మిల్లుల వద్ద రద్దీ, గందరగోళం తగ్గించేందుకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త మొబైల్ యాప్ ను వినియోగించుకొని విక్రయాలు సాఫీగా జరుపుకోవచ్చు. రైతులు ఎలాంటి అపోహలు నమ్మకుండా, దళారులకు అమ్మకుండా కేంద్ర కొనుగోలు కేంద్రాల్లో ఎంత పత్తి దిగుబడి వచ్చినా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించుకోవచ్చు. దళారుల వ్యవస్థకు ఆస్కారం లేకుండా పారదర్శక కొనుగోళ్లు జరగేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత.