– వారి సంకల్పం, పట్టుదలకు కేటీఆర్ ప్రశంసలు
– వారి విజయం స్ఫూర్తిదాయకమన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: సాధించాలనే సంకల్పం ఉంటే ఎవరినైనా జీవితం ఏ స్థాయికి తీసుకెళ్తుందో నిరూపిస్తూ, ఎలాంటి నేపథ్యం లేకున్నా న్యాయవాద వృత్తిలో స్థిరపడిన ఇద్దరు యువకులు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు (కేటీఆర్)ను బుధవారం కలిశారు. కేటీఆర్ వారి పట్టుదలను ప్రశంసించారు, వారి విజయాలు తనకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.
గతంలో డొమినోస్ డెలివరీ బాయ్ అయిన అమృత్, తన చిరకాల కల అయిన న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టిన సందర్భంగా కేటీఆర్‌ను కలిశారు. అమృత్ స్నేహితుడు అంబాటి అర్జున్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన అభ్యర్థనకు స్పందిస్తూ కేటీఆర్ వారిని ఈ రోజు కలిశారు. ఈ సందర్భంగా అమృత్ తన ప్రయాణాన్ని వివరిస్తూ గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అమృత్ ఒక నిబద్ధత గల బీఆర్ఎస్ కార్యకర్త అని, తన లాయర్ వృత్తిని ప్రారంభించే ముందు కేటీఆర్ చేతుల మీదుగా ఒక బ్యాండ్‌ను (ఆశీర్వాదంగా) తీసుకోవాలని కోరుకున్నారని అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. దీనికి కేటీఆర్ సాదరంగా స్పందిస్తూ, యువకుడి పట్టుదలను అభినందించి, త్వరలో కలుస్తానని హామీ ఇచ్చారు.
క్యాబ్ డ్రైవర్ నుంచి లాయర్ అయిన ఉదయ్‌తోనూ ముఖాముఖి కేటీఆర్ తాను ఇచ్చిన మాట ప్రకారం అమృత్‌ను కలవడమే కాకుండా, న్యాయ పరీక్షలను క్లియర్ చేయడానికి ముందు క్యాబ్ డ్రైవర్‌గా జీవనం సాగించిన ఉదయ్ తో సైతం కూడా ముచ్చటించారు. ఆర్థిక మరియు సామాజిక సవాళ్లు ఉన్నప్పటికీ, విద్యను అభ్యసించమని తరచుగా యువతను ప్రోత్సహించే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసే అవకాశం లభించినందుకు ఆ ఇద్దరు యువ న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సమావేశం ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకున్న కేటీఆర్, యువకులు చూపిన పట్టుదల తనను స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. “జీవితం ఎన్ని సవాళ్ళు విసిరినా, మన లక్ష్యాల సాధన కోసం ప్రయత్నం నిరంతరాయంగా ఉండాలి,” అని కేటీఆర్ అన్నారు. “అమృత్ తన జీవితంలో అన్ని కష్టాలతో పోరాడి, ఇప్పుడు న్యాయవాదిగా తన కలను కొనసాగించడానికి సిద్ధంగా ఉన్నాడు. జీవనం కోసం క్యాబ్ నడిపిన ఉదయ్ కూడా తన లక్ష్యాన్ని వెంబడించి న్యాయవాది అయ్యాడు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అన్న నిజాన్ని వారి విజయాలు మనకి గుర్తుచేస్తాయి” అని కేటీఆర్ పేర్కొన్నారు.