– ఏకంగా 7 లక్షల మంది లబ్ధిదారులను తగ్గించి మోసం చేసిన ప్రభుత్వం
– రెండు విడతల్లో ఇచ్చిన మొత్తం కేవలం 4,685 కోట్లు మాత్రమే
– ఒక్కో రైతుకు రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చింది రూ.10 వేలే
– కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయడం లేదు
– తాడేపల్లి లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు
తాడేపల్లి: అబద్ధాలు, క్రెడిట్ చోరీలతో తనను తాను మేథావిలా మార్కెటింగ్ చేసుకోవడం తప్ప, రైతులకు మేలు చేయాలన్న ఆలోచన చంద్రబాబుకి లేదని ఉత్తరాంధ్ర జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. తాడేపల్లిలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కన్నబాబు.. వైయస్సార్ కడప జిల్లాలో రెండో విడత అన్నదాత సుఖీభవ నగదు జమ సందర్భంగా చంద్రబాబు చెప్పిన అబద్ధాలపై మండిపడ్డారు.
ఈ ఒక్క పథకం ద్వారా రెండేళ్లలో రైతులకు దాదాపు రూ. 17 వేల కోట్లు మోసం చేశాడని వివరించారు. ఏకంగా 7 లక్షల మంది రైతులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి వెన్నుపోటు పొడిచాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో కేంద్రం ఇచ్చే నిధులతో సంబంధం లేకుండానే అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకి ఏడాదికి రూ. 20 వేలు పెట్టుబడి సాయం అందిస్తానని నమ్మించి తీరా గెలిచాక రెండేళ్లలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులిపేసుకున్నాడని ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వం కౌలు రైతులను అసలు రైతులుగానే గుర్తించడం లేదని, ఏడాదిన్నర కూటమి పాలనలో వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకున్న పాపాన పోలేదని చెప్పారు. పథకంలో 7 లక్షల మంది రైతులు ఎందుకు తగ్గిపోయారో చెప్పాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రపంచంలో ఏదైనా బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని, దానిపై ఆయన ముద్రేసుకుని దానికి సృష్టికర్త తానే అన్నట్టు ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకి అలవాటు.
వైయస్సార్సీపీ హయాంలో నాటి సీఎం వైయస్ జగన్ ప్రారంభించిన వైయస్సార్ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవగా పేరు మార్చిన చంద్రబాబు వైయస్సార్ కడప జిల్లాలో రెండో విడత నిధులు పంపిణీ కార్యక్రమం చేపట్టాడు. ఈ క్రాప్ చేయడం చేతకాని వ్యక్తి వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తీసుకొస్తానని చెబుతున్నాడు. ఎంతసేపటికీ పబ్లిసిటీ చేసుకోవడం తప్పితే రైతులకు మేలు చేసే మాట ఒక్కటీ చెప్పలేకపోయాడు.
వైయస్సార్సీపీ హయాంలో సీఎంయాప్ను తీసుకొచ్చి రైతులు పండించిన పంటలను మార్కెటింగ్ చేస్తే, చంద్రబాబు కొత్తగా యాప్ తీసుకొస్తానని చెబుతున్నాడు. రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏడాదిన్నరలో చేసింది శూన్యం. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల అప్పుల గురించి మాట్లాడమంటే యాప్ల గురించి చెబుతున్నాడు. నకిలీ విత్తనాలతో శ్రీకాకుళం జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోతే దానిపై చంద్రబాబుకి చీమకుట్టినట్టయినా లేదు. ఆఖరుకి 1950లో వచ్చిన అరకు కాఫీని కూడా తానే ప్రోత్సహించానని చంద్రబాబు ప్రమోట్ చేసుకుంటున్నాడు. వ్యవసాయంలో డ్రోన్లు పెట్టాలి, డ్రోన్లకు కెమెరాలు పెట్టి పురుగులు చూడాలని చెబుతున్న చంద్రబాబు.. రైతులకు సబ్సిడీ మీద పురుగు మందులు అందించే పనిచూడాలి. రైతులకు సంతృప్తి స్థాయిలో యూరియా అందించాలి.
మొంథా తుపాన్ కారణంగా దాదాపు 4 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటనష్టం జరిగిందని చంద్రబాబు చెబుతున్నాడు. రూ.390 కోట్ల మేర మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చాడు. చివరికి ఎకరాకు కేవలం రూ.12 వేలు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుందని తేల్చారు. పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.6 వేలు కాకుండా అన్నదాత సుఖీభవ పథకం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు రైతులకు హమీ ఇచ్చాడు. కానీ అధికారంలోకి వచ్చాక 2024లో రైతు అకౌంట్లో ఒక్క రూపాయి కూడా జమ చేయలేదు. 2025లో రైతుల్లో అసహనం మొదలై ప్రతిపక్షం నిలదీయడంతో మొదటి విడత తూతూమంత్రంగా కొద్దిమంది రైతుల ఖాతాల్లో రూ.5 వేలు జమ చేసి చేతులు దులిపేసుకున్నాడు.
వైయస్సార్సీపీ హయాంలో 53.58 లక్షల మంది రైతుల అకౌంట్లలో జమ చేస్తే, చంద్రబాబు ఏకంగా 7 లక్షల మంది రైతులకు కోత విధించి కేవలం 46.85 లక్షల మందికే పథకం వర్తింపజేశాడు. ఒకేసారి 7 లక్షల మంది రైతులకు పథకం వర్తించకుండా ఆగిపోయిందంటే రైతులు వ్యవసాయానికి దూరమైపోతున్నట్టే కదా. అంటే వ్యవసాయం గిట్టుబాటుకాక రైతులు వలస వెళ్లిపోవడమో లేదా కూలీలుగా మారిపోవడమో జరుగుతున్నట్టేగా. లబ్ధిదారుల సంఖ్య పెరగకుండా తగ్గిందంటే ఇది చంద్రబాబు వైఫల్యం కాదా? కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 53.58 లక్షల రైతులకు ఏడాదికి రూ.20 వేలు చొప్పున రెండేళ్లలో రూ.40 వేలు ఇవ్వాల్సి ఉంది.
ఆ లెక్కన రెండేళ్లలో రైతుల ఖాతాల్లో రూ.21,433 కోట్లు జమ చేయాల్సి ఉంటే, రూ. 5 వేల చొప్పున 46.85 లక్షల మంది రైతులకు రెండు విడతల్లో ఇచ్చిన మొత్తం కేవలం 4,685 కోట్లు మాత్రమే. రెండేళ్లలోనే రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.16,746 కోట్లు కూటమి ప్రభుత్వం బకాయి పడింది. అన్నదాత సుఖీభవ పథకంలో 7 లక్షల మంది లబ్ధిదారులు ఎందుకు తగ్గిపోయారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. కౌలు రైతులకు పథకాన్ని అమలు చేయకుండా మోసం చేయడంపై గొంతువిప్పాలి.