– బిజెపి కార్పొరేటర్లపై దాడిని ఖండించిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో బిజెపి కార్పొరేటర్లపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది అత్యంత విచారకరం, ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కడమే. నిధుల కేటాయింపు, అభివృద్ధి పనుల పురోగతి, కేంద్ర నిధుల వినియోగంపై మేయర్–కమిషనర్ హాజరై వివరణ ఇవ్వాలని బిజెపి కార్పొరేటర్లు న్యాయమైన డిమాండ్ చేశారు. ప్రజల కోసం అడిగిన ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అధికార యంత్రాంగం.., పోలీసులను ఉపయోగించి కార్పొరేటర్లపై దాడి చేయించడం అనేది అత్యంత దుర్మార్గం, ప్రజాస్వామ్యంపై ప్రత్యక్ష దాడి.
ప్రజా సమస్యలు, అభివృద్ధి నిధుల వినియోగం, GHMC పనితీరులో ట్రాన్స్పరెన్సీ-అకౌంటబిలిటీ అడిగినందుకే ఇటువంటి ప్రతీకార చర్యలు తీసుకోవడం అధికార పార్టీ నియంతృత్వానికి నిదర్శనం. తమ తమ డివిజన్లలో ప్రజా సమస్యలు, ప్రాథమిక సదుపాయాలు, అభివృద్ధి కార్యక్రమాలపై పలుమార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చిన భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ల ప్రతిపాదనలను జీహెచ్ఎంసీ మేయర్, కమిషనర్ నెలల తరబడి పట్టించుకోకుండా కాలయాపన చేయడం దారుణం.
స్టాండింగ్ కమిటీ సమావేశంలో మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్ , సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి , యూసుఫ్ గూడ కార్పొరేటర్ మహేందర్ తమ రిప్రజెంటేషన్లపై తీసుకున్న చర్యల గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, అభివృద్ధి కార్యక్రమాల పురోగతి గురించి కార్పొరేటర్లు ప్రశ్నించడం వారి కర్తవ్యం.
కానీ మేయర్, కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు ప్రయత్నించడమే కాకుండా, ప్రశ్నలు అడిగిన కార్పొరేటర్లపై పోలీసులతో దాడి చేయించడం అత్యంత దారుణం. కేంద్ర ప్రభుత్వం జీహెచ్ఎంసీ అభివృద్ధి కోసం రూ.1500 కోట్లకు పైగా నిధులు కేటాయించినప్పటికీ, ఆ నిధులను ఖర్చు చేయకపోవడం, జీహెచ్ఎంసీకి ప్రతి సంవత్సరం వందల కోట్ల ఆదాయం వస్తున్నా నిధుల్లేవంటూ చెప్పడం పూర్తిగా బాధ్యతారాహిత్యమే. అధికార దుర్వినియోగంతో ముగ్గురు బిజెపి కార్పొరేటర్లను పోలీసులతో చుట్టుముట్టి ఈడ్చుకుపోవడం, దురుసుగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నాం.
దీనిపై మేయర్, కమిషనర్ వెంటనే క్షమాపణ చెప్పాలి. GHMCలోని అన్ని రిప్రజెంటేషన్లపై స్పష్టమైన టైమ్‌లైన్‌తో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. బిజెపి కార్పొరేటర్లపై చేసిన దాడికి బాధ్యులైన అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. భారతీయ జనతా పార్టీ ప్రజల హక్కుల కోసం, నగర అభివృద్ధి కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంది. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతినిధులను అణచివేయాలనే అధికార పార్టీ వ్యవహారశైలికి హైదరాబాద్ ప్రజలు తగిన బుద్ధిచెప్పక తప్పదు.