రాష్ట్రంలో 17నెలల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో కొలువుదీరిన ప్రజాప్రభుత్వం గత పెట్టుబడుల చరిత్రను తిరగరాస్తోంది. విజనరీ లీడర్ చంద్రబాబు బ్రాండింగ్, డైనమిక్ మంత్రి నారా లోకేష్ అత్యద్భుతమైన పనితీరు, చొరవతో భారతదేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని భారీ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 14,15 తేదీల్లో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన భాగస్వామ్య సదస్సులో పెట్టుబడులు పోటెత్తాయి.
613 పారిశ్రామిక సంస్థలు రూ.13.25లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎంఓయులు కుదుర్చుకున్నాయి. అంతకుముందు 16నెలల కాలంలో సుమారు 200 పరిశ్రమలు $120 బిలియన్ డాలర్లు (రూ.10.25లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఎపి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తంగా 17నెలల వ్యవధిలో రాష్ట్రానికి రూ.23.5లక్షల కోట్లు పెట్టుబడులు తరలివచ్చాయి. ఇందులో రూ.లక్షకోట్ల పైబడిన, సమీప భారీ పెట్టుబడులే రూ.10లక్షల కోట్లకు పైగా ఉండటం విశేషం.
దేశచరిత్రలో భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి గూగుల్ ఎఐ హబ్ $15 బిలియన్ డాలర్లు (రూ.1.33లక్షల కోట్లు), దేశంలో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఆర్సెలర్ మిట్టల్ & నిప్పాన్ స్టీల్ రూ.1.35లక్షల కోట్లు, రిలయన్ డాటా సెంటర్ రూ.1.10లక్షల కోట్లు, రిలయన్స్ సిబిజి (రూ.65వేలకోట్లు, ఎబిసి క్లీన్ టెక్ రూ.1.10లక్షల కోట్లు, ఎన్ టిపిసి గ్రీన్ రూ.1.85లక్షల కోట్లు, బ్రూక్ ఫీల్డ్ డాటా సెంటర్ 1.10లక్షల కోట్లు, బిపిసిఎల్ రిఫైనరీ రూ.95వేల కోట్లు, రెన్యూ పవర్ రూ.82 వేల కోట్లు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
కేవలం 9 బడా సంస్థలు రూ.10లక్షలకోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. గత 17నెలల కాలంలో నెలకు సగటున రూ.1.40లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు పరిశ్రమలు తరలివచ్చాయి. ఒక స్టార్టప్ స్టేట్ లో పెట్టుబడిదారులు ఇంత భారీఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపడం అసాధారణం, అద్భుతం. ప్రభుత్వ ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో యువతకు 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చారు. ఎన్నికల కోసం అలవిగాని హామీలు ఇచ్చి… అవసరం తీరాక వదలేయడం సాంప్రదాయ రాజకీయ నాయకులకు అలవాటు. అందుకు భిన్నంగా మంత్రి లోకేష్ యువతకు ఇచ్చిన ప్రధాన హామీని అమలుచేసేందుకే త్రికరణశుద్ధితో ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు.
అధికారంలోకి వచ్చాక ఏ క్షణాన్ని వృధా చేయకుండా ఆయన మెరుపువేగంతో ముందుకు సాగుతున్నారు. అమెరికా, దావోస్, సింగపూర్, యుకె, ఆస్ట్రేలియాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలకు విస్తృతంగా చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు గల అనుకూలతలను వివరించి వారిని రాష్ట్రానికి రప్పించడం సఫలీకృతమయ్యారు. ఫలితంగా రాష్ట్రానికి పెట్టుబడుల సునామీలా తరలివచ్చాయి. గతంలో ఎన్నడూలేని విధంగా రాష్ట్రానికి పెద్దఎత్తు పరిశ్రమలు తరలిరావడం వెనుక ప్రధాన మంత్రం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.
మంత్రి లోకేష్ పెట్టుబడుల చర్చలో ప్రయోగిస్తున్న బ్రహ్మాస్త్రం ఇదే. ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పరిశ్రమలకు కేవలం 21రోజుల్లో అన్ని అనుమతులు లభిస్తాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో అత్యుత్తమ ప్రోత్సాహకాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఐటి, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర 23 పారిశ్రామిక పాలసీలను ప్రకటించారు. ప్రోత్సాహకాల కోసం గతంలో మాదిరి అధికారులు, రాజకీయనేతల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఎస్క్రో ఎకౌంట్ ద్వారా నేరుగా వారి ఎకౌంట్లకు బదిలీ చేస్తామని భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ విధానం వల్ల ప్రోత్సాహకాల కోసం పారిశ్రామికవేత్తలు ఎవరివద్దకూ పైరవీల కోసం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఎంఓయు ప్రకారం వివిధ దశల్లో పెట్టుబడులను గ్రౌండింగ్ చేసిన సంస్థలకు ఎస్క్రోద్వారా ప్రభుత్వం నగదు ప్రోత్సహకాలను జమచేస్తుంది. రాష్ట్రంలో పెట్టుబడిదారుల ఆకర్షణకు మంత్రి లోకేష్ ఉపయోగిస్తున్న రెండవ ఆయుధం డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్. కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నేతృత్వాన అభివృద్ధిలో జెట్ స్పీడ్ తో ముందుకు సాగుతున్నామని చెప్పడమే ఆయన అంతర్యం. అయితే ఇది ఆషామాషీగా చెబుతున్న మాట మాత్రమే కాదు. పలు సందర్భాల్లో నిరూపితమైంది. గూగుల్ సంస్థ ప్రతినిధులతో మంత్రి లోకేష్ తొలిసారి విశాఖపట్నంలో చర్చలు జరిపినపుడు వారు 3 ప్రధాన సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు.
అయితే ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రస్థాయిలో పాలసీలను సవరించాల్సి ఉంది. మంత్రి లోకేష్ తన దృష్టికి తెచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రంగంలోకి దిగి ప్రధాని నరేంద్ర మోడీతో ఆ సమస్యలపై మాట్లాడి, పరిష్కరించారు. అలాగే ఆర్సెలర్స్ మిట్టల్ అధినేత ఆదిత్య మిట్టల్ తో మంత్రి లోకేష్ తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరిపినపుడు రాష్ట్రంలో పెట్టుబడులకు స్లరీ పైప్ లైన్ ఏర్పాటుకు అనుమతులు కావాలని కోరారు. వెంటనే కేంద్రంతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరించడంతో రాష్ట్రంలో రూ.1.35లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఎఎం & ఎన్ఎస్ ముందుకువచ్చింది.
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల రాకకు మరో ముఖ్యమైన కారణం అనుభవం గల సమర్థ నాయకత్వం. గత ఏడాది జూన్ 12వతేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబునాయుడి బ్రాండింగ్ వల్లే రాష్ట్రానికి పెట్టుబడుల వరద పారుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడు రేయింబవళ్లు కఠోరశ్రమతో హైదరాబాద్ ను ఐటి హబ్ గా మార్చారు. ఈరోజు హైదరాబాద్ లో 10లక్షలమందికి పైగా యువత ఐటి పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్నారంటే అది చంద్రబాబు చలవే. ఐటి ఉద్యోగాల ద్వారా సాధారణ మధ్య తరగతి కుటుంబాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడి వారి జీవన స్థితిగతులు మారిపోయాయి.
ఇప్పుడు మళ్లీ చంద్రబాబునాయుడు సమర్థ నాయకత్వంలో అంతకుమించి విశాఖ మహానగరం పెట్టుబడులకు గేట్ వేగా మారుతోంది. విశాఖ ఎకనమిక్ రీజియన్ ను ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న పట్టుదలతో మంత్రి లోకేష్ ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. చంద్రబాబునాయుడు జిపిఎస్ అయితే తాము మిసైల్… ఆయన మార్గదర్శకత్వంలోనే ముందుకు సాగుతున్నామని యువనేత లోకేష్ పెట్టుబడుల సదస్సులో చెప్పారు.
పెట్టుబడుల సాధనలో యువనేత లోకేష్ చూపుతున్న పనితనాన్ని అంతర్జాతీయ పారిశ్రామిక, మీడియా సంస్థలు ప్రశంసిస్తున్నాయి. ప్రముఖ అంతర్జాతీయస్థాయి మీడియా సంస్థ రాయిటర్స్ తాజాగా ప్రచురించిన ఒక కథనంలో మంత్రి లోకేష్ పనితీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. “స్టాన్ఫోర్డ్ లో ఎంబీఏ చదివిన 42 ఏళ్ల యువకుడు భారతదేశంలో పెట్టుబడులకు ఆసక్తి చూపే బహుళజాతి సంస్థలకు ఇష్టమైన వ్యక్తిగా మారాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో తమకున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని దేశంలో పెట్టుబడులకు గల అడ్డంకులను తొలగించి బిలియన్ల డాలర్ల ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు పొందుతున్నాడు” అని పేర్కొనడం యువనేత లోకేష్ శక్తి, సామర్థ్యాలకు అద్ధంపడుతోంది.
-కందిమళ్ల కృష్ణారావు
(సీనియర్ పాత్రికేయుడు & రాజకీయ విశ్లేషకుడు)

