సరిగ్గా 48 ఏళ్ళ క్రితం.. ఇదే రోజున మన ప్రాంతంలో అతి భయంకరమైన ఉప్పెన మీకు గుర్తుందా ? వృద్ధులైన వారికి ఒక భయంకర పీడకల..మరి కొంతమందికి కొద్దిగా ఊహ తెలిస్తే..ఈ తరంలో అత్యధికులు అసలు పుట్టి ఉండరు..వారి అవగాహన కోసమే ఈ చారిత్రత్మక కధనం !! 1977, నవంబరు 19 ( శనివారు )భారతదేశపు తూర్పు సముద్రతీరాన్ని ఎంతో బలంగా తాకింది.
అధికారికంగా 14,204 మంది, అనధికారికంగా సుమారు 50,000 మంది తమకేమీ జరుగుతుందో తెలియని రెప్పపాటు సమయంలో ప్రాణాలు కోల్పోయారు. దివిసీమకు ఉప్పెన చేసిన గాయం ఇప్పటికీ మాననే లేదు. ఈ తేదీ గుర్తుకొస్తే చాలు దివిసీమ గుండె తల్లడిల్లిపోతుంది. కృష్ణాజిల్లా నేటికీ ఉలిక్కిపడుతుంది. గుంటూరు, ప్రకాశాలు అదిరిపడతాయి. గ’త చేదు జ్ఞాపకం గుర్తుకొస్తూనే ఉంది. గుండెలను తొలిచేస్తూనే ఉంది. కంట కన్నీరు పెట్టిస్తూనే ఉంది. అదేమైనా చిన్న ప్రమాదమా?.. చరిత్ర చూడని పెను ప్రళయం. ప్రకృతి విలయం. వేలాది మందిని మింగేసిన ఉప్పెన.
లక్ష్లాది పశువులను కబళించిన తుఫాను. అనేక మందిని అనాథలను నిరాశ్రయులను చేసిన విపత్తు. కృష్ణాజిల్లాలోని తీరప్రాంతం నాటి దివిసీమ సముద్రుని జలఖడ్గానికి బలైంది. ఆ రోజు మధ్యాహ్నం. ఆకాశమంతా నల్లని కారు మబ్బులు చుట్టేశాయి. సముద్రంలో చిన్నగా అలజడి.. కాసేపటికే ఉధృతి పెరిగింది.. పెను ఉప్పెనగా మారింది.. సముద్రం మహోగ్రరూపం దాల్చి.. దివిసీమపై విరుచుకుపడింది. గ్రామాలకు గ్రామాలు నామరూపాలు లేకుండా చేసింది. దివిసీమను శవాల దిబ్బగా మార్చేసింది. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి.
గాలికి వాన తోడైంది. స’ముద్రుడు ఉప్పొంగడు. ఉప్పెన విరుచుకుపడింది. ఆరు మీటర్ల అలలు ఎగసి పడ్డాయి. ఆ గాలి-వాన ఉధృతికి.. ఇంటి పైకప్పులు ఎగిరిపోయాయి. తలుపులు విరిగిపోయాయి. గోడలు కూలిపోయాయి. డాబా ఇళ్లు మాత్రమే మిగిలాయి. మిగతావన్నీ నేలమట్టం. వరదలో మటుమాయం. భారీ వృక్షాలు సైతం నేలకొరిగి. విద్యుత్ స్తంభాలు విల్లుల్లా వంగిపోయాయి. గ్రామాలకు గ్రామాలు జలమయమయ్యాయి. ఆ దుర్దిన మధ్యాహ్నం మొదలైన ప్రకృతి విలయకాండ.. అర్థరాత్రి కూడా కొనసాగింది. ఎటుచూసినా మోకాల్లోతు నీళ్లు. చుట్టూ చిమ్మ చీకటి. వరద ఉధృతికి అనేక మంది కొట్టుకుపోయారు. తుమ్మ ముళ్ల కంపలకు చిక్కుకొని శరీరాలు కోసుకుపోయాయి.
వరద ముంచేసింది లంక గ్రామాల్లో ఎటు చూసినా శవాల కుప్పలే… తుపాను తర్వాత వందలాది శవాలు నీళ్లలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా దెబ్బ తిన్న అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సివచ్చింది.కృష్ణాజిల్లా లోని అవనిగడ్డ, కోదూరు, నాగాయలంక మండలాలలో పాలకాయతిప్ప, హంసలదీవి, ఇరాలి, ఊటగుండం,గొల్లపాలెం, బసవవానిపాలెం,ఉల్లిపాలెం, ఏటిమొగ, సొర్లగొంది, ఎదురుమొండి,సంగమేశ్వరం,నాచుగుంట,ఈలచెట్లదిబ్బ వంటి మత్స్యకార గ్రామాల్లో వేలాది మంది ప్రాణాలు బలి తీసుకుంది ఆ ఉప్పెన. కృష్ణాజిల్లాతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాలోనూ ఉప్పెన ప్రభావం చూపించింది. రేపల్లె, ఒలేరు, నిజాంపట్నం తదితర గ్రామాలు ప్రళయం దాటికి దెబ్బతిన్నాయి.
దాదాపు వంద గ్రామాలు తుపానులో కొట్టుకుపోయాయి. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. పదమూడు ఓడలు తుపానులో చిక్కుకుని గల్లంతయ్యాయి.అప్పుట్లోనే సుమారు 172 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. తుపాను కలిగించిన ధన, ప్రాణ నష్టాలను కప్పిపుచ్చి తక్కువ చేసి చూపించారని రెవెన్యూ అధికారులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలతో ఐదుగురు ఉద్యోగులు రాజీనామా ఇచ్చారు. ఈ తుపాను కృష్ణా డెల్టా ప్రాంతంపై అత్యంత తీవ్ర ప్రభావాన్ని చూపింది. కృష్ణాజిల్లాలో దివిసీమలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రాంతంలో 6 మీటర్ల ఎత్తున సముద్ర కెరటాలు ఎగసి పడ్డాయి.
ఆ భయంకర ఉప్పెన తర్వాత దివిసీమ పలు గ్రామాల్లో వందలాది శవాలు నీళ్ళలో తేలుతూ కనిపించాయి. గుర్తుపట్టలేనంతగా కుళ్ళిపోయిన అనేక శవాలను సామూహిక దహనం చెయ్యాల్సి వచ్చింది. వాల్తేరు కిరండల్ రైలు మార్గంలో కొండ రాళ్ళు జారి పడి, పట్టాలను పెళ్ళగించాయి. గుంటూరు జిల్లా బాపట్లలో ఒక చర్చిలో తలదాచుకున్న దాదాపు వందమంది ప్రజలు అది కూలడంతో మరణించారు. వరి పొలాలు, వాణిజ్య పంటలను ఉప్పెన ముంచెత్తింది. అంతటి భీకరమైన ఉప్పెనలో 13 ఓడలు నడి సముద్రంలో కాగితం పడవల మాదిరిగా చిక్కుకుని గల్లంతయ్యాయి. 1977 నవంబర్ 19 న సంభవించిన ఉప్పెన కేవలం కృష్ణాజిల్లాపై మాత్రమే కాక గుంటూరు ప్రకాశం జిల్లాలపై సైతం చాలా ప్రతాపం చూపింది. సముద్ర తీర ప్రాంతంలోని దాదాపు వంద గ్రామాలు ఉప్పెన లో కొట్టుకుపోయాయి.
అంతేకాక మూడు జిల్లాల్లో కలిపి 34 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. తుపాను కలిగించిన తీవ్ర నష్టం అనంతరం ఆంధ్రప్రదేశ్ తీరం పొడవునా వాతావరణ హెచ్చరిక కేంద్రాల ఏర్పాటుకు దారితీసింది. తుపాను కలిగించిన ధన, ప్రాణ నష్టాలను నాటి ప్రభుత్వం కప్పిపుచ్చి తక్కువ చేసి చూపించారని ఆరోపణలు సైతం ఎదుర్కొంది. తన నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇలా తక్కువ చేసి చూపించారని రాష్ట్రంలో ఆనాటి ప్రతిపక్షమైన జనతా పార్టీ ఆరోపించింది.ఈ ఆరోపణల కారణంగా ఐదుగురు ఉన్నతాధికారులు ఆనాడు తమ పదవులకు రాజీనామా చేశారు ఎన్నో అనాధ శవాలను కాలువల్లోంచి వెలుపలకు తీయటం పెద్ద సమస్య అప్పట్లో అయింది .శవాలకు అంత్య క్రియలు చేయటం మరో గడ్డు పరిస్థితి. నాడు వీలైనంతవరకు వరకు బంధువులతో గుర్తింప జేశారు సామూహిక శవ దహనాలు చేయాల్సిన పరిస్తితి వచ్చింది. అక్కడ అంటువ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం పెద్ద సమస్య .
నాడు కృష్ణాజిల్లా ఇండియన్ ఆర్మీలో మేజర్ గా పని చేసివచ్చిన కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి ఉన్నతధికారిగా ఉండడం జిల్లాకే ఎంతో అదృష్టంగా మారింది. ఆనాడు ఏ వి ఎస్ రెడ్డి ఎంతో శ్రమించారు. తాను స్వయంగా పనిచేయడమే కాకుండా , మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలించి మరి పని చేయించారు. ఏవీఎస్ రెడ్డి సినిమాలలో చూపించే ఉత్తిత్తి మిలట్రీ మేజర్ కాదు..కడప జిల్లాకు చెందిన ఆర్మీ మేజర్ కృష్ణాజిల్లా కలెక్టరు ఎ. విద్యాసాగర్ రెడ్డి ( ఏ వి ఎస్ రెడ్డి )1973 మిలట్రీ కోటాలో ఎంపిక కాబడి ఐ ఏ ఎస్ శిక్షణకు బందరు వచ్చారు. అసిస్టెంట్ కలెక్టరు (ట్రయినీ) 1974లో శిక్షణాంతరం, విజయవాడ సబ్ కలెక్టరు గా పని చేశారు. తర్వాత విజయవాడ మున్సిపల్ కమీషనరు.
06-08-1978 నుండి 06-06-1979 వరకు 19-03-1980 నుండి 04-02-1982 వరకు రెండుసార్లు కృష్ణాజిల్లాకు కలెక్టరు, జిల్లా మేజిస్ట్రేట్ గా ఉద్యోగ బాధ్యతలు ఎంతో సమర్దవంతంగా నిర్వహించారు. తన 32 ఏళ్ళ వయస్సులో 1977, నవంబరు 19వ తేదీ దివిసీమ ఉప్పెన లో ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం. నాటికి 113 ఏళ్ల క్రితం (1864 నవంబర్ 1 వ తేదీ ) సంభవించిన భయంకరమైన ఉప్పెనలో 30 వేల మంది దుర్మరణం పాలయ్యారు. ఆనాటి బందరు పట్నంలో వేలాది శవాలను వెలికి తీసి వాటికి ఖనన, దహన అంతిమ సంస్కారాలలో నేరుగా పాల్గొన్న అప్పటి బ్రిటిష్ కలెక్టర్ థారన్ హిల్ సేవలను 1977 నవంబర్ 19న సంభవించిన ఉప్పెనలో కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి మరిపించారు. దివిసీమలో ఆయన అర్ధరాత్రి వరకు శవాల మధ్య కాలినడకన తిరుగుతూ, కేవలం నిక్కరు చొక్కా కాన్వాస్ బూట్లు మాత్రమే ధరించి చేతిలో పొడవాటి స్టీల్ టార్చ్ లైట్ పట్టుకొని దివిసీమలోని పలు గ్రామాలు విస్తృతంగా పర్యటించారు.
ఆనాడు ముళ్ళ కంపులో చిక్కుకొని కుళ్లికంపు కొడుతున్న మృత కళేబరాలను వెలుపలకు తీసుకొచ్చి ఆ అనాధ శవ దహనాలు, ఖననాలకు ఏ ఒక్కరు ముందుకురాని దయనీయ పరిస్థితుల్లో కలెక్టర్ ఏవీఎస్ రెడ్డి బెజవాడ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులను దివిసీమకు పెద్ద ఎత్తున రప్పించి వేల శవ దహనాలు జరిపించి పుణ్యం కట్టుకున్నారు. కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఇప్పటికీ ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ దివిసీమలోని వృద్ధతరం ప్రజలు గొప్పగా చెప్పుకుంటారు. తన ఉద్యోగ హోదాను పక్కనపెట్టి పారిశుద్ధ్య కార్మికులకు కిరసనాయిల్ క్యాను, ప్రభుత్వ సారాయి బుడ్డి ఇచ్చి అపరిశుభ్ర, వాతావరణంలో దుర్గంధం వెదజల్లే వాతావరణంలో ముమ్మరంగా వేలాది అంతిమ సంస్కారాలు ఆయన చేయించారు. ఆ పని చేస్తున్నవారు పూటుగా సారా తాగి మత్తులో జోగుతూ, అసభ్యంగా మాట్లాడుతున్న వారిని పని చేయించడం అంటే మామూలు విషయం కాదు.
ఆర్మీ మేజర్ పనిచేసిన అనుభవం ఆయనకు బాగా కలిసి వచ్చింది. గంభీరమైన ఆహార్యంకు తోడు పెద్ద గొంతుకుతో పనిచేస్తున్న వారికి సూచనలు ఇస్తూ, ఆనాడు దెయ్యాలు భూతాలు కనబడుతున్నాయిని కథల కథలుగా చెబుతున్న వారికి మానసిక దైర్యం కలిగించారు ఏ వి ఎస్ రెడ్డి. నాటి ఉప్పెనలో ఉప్పు నీళ్లు తాగి మరణించిన అభాగ్యుల పొట్టలు ఉబ్బి ముక్కు పుటలు అదిరిపోయే దుర్గంధం వేదజల్లెవి. చిమ్మ చీకట్లో రాత్రి పొద్దుపోయేవరకు ఆయన నిలబడి పని చేయించారు.తీర గ్రామాల్లో ఎటూ చూసినా వందలాది అనాధ శవాలకు తోడు వేలాది జంతు కళేబరాలను సైతం కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి గారే దగ్గరుండి పూడ్పించారు.
ఆనాడు కొందరు రాజకీయ నాయకులు ఆ సమయంలో ప్రజల వద్దకు వెళ్లి భవిష్యత్తు రాజకీయ లబ్ది కోసం పునాదులు వేసుకోవడం గమనించిన ఆయన తమ పని పాడు చేసే విధంగా ప్రజా ప్రతినిధులను ఉప్పెనలో దెబ్బతిన్న గ్రామాలకు పెద్ద ఎత్తున వస్తుంటే ‘దయచేసి ఇక్కడకు రావద్దు.. మా సహాయ పునరావాస కార్యక్రమాలకు విఘాతం కలుగుతుంది ‘ అని దైర్యంగా పలు గ్రామాల్లో బోర్డులు రాయించి పెట్టించిన ధైర్యశీలి.. మహా చండశాసనుడు కలెక్టర్ ఏ వి ఎస్ రెడ్డి. విజయవాడలో ఈనాటికి వెలిగిపోతున్న తుమ్మలపల్లి కళాక్షేత్రం, మచిలీపట్నంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన బాలభవన్ భవనం ఆయన హయాంలోనే నిర్మాణం జరిగింది.
ఆయన ఎన్నో కీలక శాఖలలో పనిచేసే చివరగా మన రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా సైతం పని చేశారు. 2012 లో తన 66 వ ఏట ఆయన మృతి చెందారు. దివిసీమ ఉప్పెన గురించి అందరూ గుర్తు చేసుకొంటారు కానీ, నాటి ఘోరకలిలో నిజమైన ప్రజాసేవ చేసిన ఒక గొప్ప కలెక్టర్ ను జ్ఞాపకం చేసుకొనేవారు అతితక్కువమంది మాత్రమే
-ఎన్. జాన్సన్ జాకబ్ మచిలీపట్నం.





