రెండురోజుల నుండి ఒక వీడియో వైరల్ అవుతున్నది. రామోజీరావు ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవంలో చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రక్క ప్రక్కన కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్న దృశ్యం తెలుగుదేశం అభిమానులను ఉర్రూతలూగించింది. చంద్రబాబుకు, వెంకయ్యనాయుడుకి అభివాదం చేస్తూ రేవంత్ రెడ్డి వస్తున్నప్పుడే అనూహ్యంగా చంద్రబాబు రేవంత్ పైన ఛలోక్తులు మొదలుపెట్టారు. ఇద్దరూ ఒకే సోఫాలో కూర్చుని నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకున్నారు. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి ఇష్టం, అభిమానం అనేదేమీ తెలియని విషయం కాదు. రేవంత్ రెడ్డి ఇప్పటికీ బాహాటంగా అనేకసార్లు చెబుతూ వుంటాడు. చంద్రబాబే కొత్తగా అనిపించారు.
ఆయన ఈమధ్య కాస్త నవ్వుతూ కనిపిస్తున్నారు కానీ, ఆయన ఛలోక్తులు కూడా విసరటం అందునా రేవంత్ పైన విసరటం ఆశ్చర్యం కలిగించింది. చంద్రబాబు నైజం ప్రకారం రేవంత్ రెడ్డి అంటే ఎంత అభిమానం వున్నా పబ్లిక్ లో అంత చనువు ప్రదర్శించరు. ముఖ్యంగా ఆయన ప్రస్తుతం ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో ఉన్నారు. వీరిద్దరూ చనువుగా కనిపిస్తే ఎవరికి తోచిన ఊహాగానాలు వారు చేస్తారనే అనుమానం వుంటుంది. కానీ నిన్న చంద్రబాబును గమనిస్తే అటువంటి వాటిని ఆయన ఈమధ్య పట్టించుకోవటం లేదనిపిస్తున్నది. రేవంత్ అంటే చంద్రబాబుకు ప్రత్యేకమైన అభిమానం. రేవంత్ విషయం చెప్పవలసిన అవసరం లేదు.
ఓటుకు నోటు కేసులో తనను తాను ఇరికించుకునే ప్రయత్నం చేశాడే కానీ, వాళ్ల సార్ ను మాత్రం దానికి దూరంగా వుంచే ప్రయత్నమే చేశాడు. పార్టీలో ఉన్నంత కాలం రేవంత్ అలాగే ఉన్నాడు. రేవంత్ కుమార్తె ఎంగేజ్మెంటు సందర్భం గుర్తుకు వస్తే రేవంత్ కు ఇప్పటికీ కళ్లు చెమరుస్తాయి. ఎంగేజ్మెంటు రోజు జైలు నుండి వచ్చి, ఎవరితో ఏది మాట్లాడినా కేసులో ఏదో ఒక మెలిక పెడతారేమో అని నిర్వేదంగా, యాంత్రికంగా తాను చేయవలసిన ఫార్మాలిటీస్ పూర్తిచేశాడు. చంద్రబాబు భువనేశ్వరి దంపతులు అన్నీ తామే అయి శుభకార్యాన్ని నడిపించారు. బహుశా రేవంత్ జీవితంలో అదొక అత్యంత బాధాకరమైన సందర్భం అయివుంటుంది. అలా నిబ్బరంగా ఉన్న రేవంత్ భావావేశం ఎలా వుందో చెప్పలేము. చంద్రబాబు, రేవంత్ అనుబంధం అలాగే కొనసాగింది.
పార్టీకి రాజీనామా చేయటానికి రేవంత్ చంద్రబాబు దగ్గరకు వచ్చి రాజీనామాను సమర్పించినప్పుడు ఇద్దరూ భావోద్వేగానికి గురయ్యారు అంటారు. బహుశా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా అంతటి భావోద్వేగంతో కూడిన నిష్క్రమణ జరిగివుండదు. పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు గురించి, పార్టీ గురించి ఏం మాట్లాడేవాడో, పార్టీని వీడాక కూడా అదే పొగడ్త, అదే ఆప్యాయత.! టీడీపీ అభిమానులు ఇప్పటికీ రేవంత్ ని మా రేవంత్ అనే అనుకోవటం విశేషం. రేవంత్ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా తెలంగాణా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. రేవంత్ తమవాడు అని టీడీపీ శ్రేణులు అనుకోవటంలో ఆశ్చర్యం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే భావిస్తున్నాడు.
గతంలో తాను ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో లేనప్పుడు, హైదరాబాదు కేసీఆర్ పాలనలో ఉన్నప్పుడు హైదరాబాదులోనే వుండేవాడు. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుండి హైదరాబాదు మొఖం కూడా చూడటం లేదు. ప్రస్తుతం విడిదిల్లు బెంగళూరు. అరెస్ట్ లాంటివి చేయాలని ఏపీ పోలీసులు వస్తే రేవంత్ తనవంతు సహకారం అందిస్తాడేమో అని జగన్మోహన్ రెడ్డికి భయం. చంద్రబాబు, రేవంత్ ల మధ్యన కేటీఆర్ విభేదాలు లేపే ప్రయత్నం చేస్తుంటాడు. ఢిల్లీలో చంద్రబాబు చక్రం తిప్పుతుంటే, రేవంత్ ఒక్కపని చేయించుకు రాలేకపోతున్నాడు అంటూ మాట్లాడుతూ వుంటాడు. అలాంటి ఉడతూపులకు చంద్రబాబు, రేవంత్ పడిపోరు కానీ వాళ్ల తెలివిని ప్రదర్శించకుండా వుండరు.
వారిద్దరూ అదే బంధాన్ని కొనసాగిస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి స్వంత పార్టీ ప్రముఖులనుండి తన టీడీపీ నేపథ్యం వలన వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ఉన్నారు. అది పదవుల కోసమే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యమంత్రిగా ఒంటరి పోరాటం చేస్తున్నారు. 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం వెనుక కేసీఆర్ కుటుంబ అహంకారపూరిత వైఖరితో పాటు అనేక కారణాలు ఉన్నప్పటికీ, డిసైడింగ్ ఫాక్టర్ గా రేవంత్ రెడ్డి టీడీపీ నేపథ్యం కూడా ఒక కారణంగా నిలిచింది అనే విషయం తెలిసినప్పటికీ రేవంత్ ను టీడీపీ వ్యక్తిగానే పరిగణిస్తూ వ్యాఖ్యానిస్తూ ఉంటారు. టార్గెట్ పెట్టుకుని పని చేసుకుపోయే తత్వాన్ని అలవరచుకున్నాడు కాబట్టి రేవంత్ తన ఖాతాలో విజయాలను జమచేసుకుంటూనే ఉన్నాడు.
నిజం చెప్పాలంటే గురుశిష్యులు ఇద్దరికీ ఎవరి పనితీరు వారికి ఉన్నది. ఒకరు దూకుడు అయితే, ఒకరిది ఆచితూచి అడుగు వేసే తత్వం. బహుశా అటువంటి భేదమే వారిద్దరినీ సన్నిహితులను చేసి ఉండవచ్చు. అలా అని స్నేహం కోసం వారి వారి రాజకీయ ప్రయోజనాలను వదులుకోరు. ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో టీడీపీ తన ఎన్నికల కార్యకలాపాలను ప్రక్కన పెట్టింది కాబట్టి తెలంగాణా టీడీపీ అభిమానులు స్వేచ్ఛగా రేవంత్ వెనుక నిలబడుతున్నారు. తెలంగాణా టీడీపీ ఎన్నికలలో పాల్గొన్న రోజు ఎవరి పార్టీ ప్రయోజనం వారు చూసుకుంటారు. అదే సమయంలో ఎవరి రాష్ట్రాల ప్రయోజనాల కోసం వారు పోరాడుతారు.
రాష్ట్ర ప్రయోజనాలను ఎవరూ తాకట్టు పెట్టరు. ఎవరి పార్టీ ప్రయోజనాలను వారు కాపాడుకుంటారు. కానీ ఆత్మీయానుబంధం మాత్రం చెక్కుచెదరదు. గతంలో పాలిటిక్స్ లో రాజకీయ ప్రత్యర్ధులు మాత్రమే వుండేవారు, ఇప్పుడు రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత ప్రత్యర్థులుగా పరిగణిస్తున్నారు. అందువలనే రాష్ట్రాలలో ఆరోగ్యకరమైన వాతావరణం దెబ్బతింటున్నది. తెలుగురాష్ట్రాలలోనే కాదు, అన్ని రాష్ట్రాలలో పరిస్థితి ఇలాగే ఉంటుంది. 2014 -2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు పట్ల కేసీఆర్ వైఖరి శత్రుత్వం కనబరుస్తూ వుండేది. 2019 లో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి చెట్టాపట్టలేసుకుని తిరిగారు. రఘురామకృష్ణంరాజు అరెస్టులో కేసీఆర్ ప్రభుత్వం అనైతికంగా మద్దతు ఇచ్చింది.
రఘురామకృష్ణంరాజు పైన ఒక తప్పుడు కేసు నమోదు చేయటానికి కూడా సంకోచించలేదు. పొరుగు రాష్ట్రాలతో ఆయా రాష్ట్రాలలో ఉన్న ప్రభుత్వాలను బట్టి స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించే పరిస్థితి ఎప్పుడూ అనుసరణీయం కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మధ్య పరిష్కరించుకోవలసిన సమస్యలు అనేకం ఉన్నాయి. చర్చల ద్వారా వాటికి ఒక ముగింపు పలకవలసిన ప్రభుత్వాలు, వారి రాజకీయ వైరుధ్యం కారణంగా దశాబ్దాల తరబడి సమస్యలను అపరిష్కృతంగా వదిలిపెట్టటం జరుగుతున్నది. ఇరుగు పొరుగు బాగుండాలి అనేవారు పెద్దలు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న ఆత్మీయానుబంధం వలన రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉండవచ్చు.కనీసం ఒకడుగు ముందుకు పడే అవకాశం ఉంటుంది
– ఇంద్రాణి




