ముదినేపల్లి: ఏలూరు జిల్లా, ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామంలో శుక్రవారం రైతుల సౌకర్యార్థం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పిఏసిఎస్ అధ్యక్షుడు బొప్పన నరసింహారావు ప్రారంభించారు. రైతులకు కనీస మద్దతు ధర సకాలంలో అందేలా, మధ్యవర్తుల లేని పారదర్శక కొనుగోలు ప్రక్రియ నడిచేలా అన్ని ఏర్పాట్లు చేశామని ఈ సందర్భంగా నరసింహారావు తెలిపారు.
తూకం, గ్రేడింగ్, రవాణా వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని చెప్పారు. “ఈ కొనుగోలు కేంద్రం రైతు ప్రయోజనాలే ప్రాతిపదికగా ఏర్పాటు చేశామని, ప్రతి రైతు ఇబ్బందులు లేకుండా తన ధాన్యాన్ని అమ్ముకునేలా చూస్తాం. చెల్లింపులు కూడా త్వరగానే పూర్తి చేస్తాం” అని నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు యెలిశెట్టి లక్ష్మణరావు, గన్నమనేని వెంకటేశ్వరరావు (జబ్బర్) పాల్గొని కేంద్రం ఏర్పాటును అభినందించారు. కేంద్రం ప్రారంభంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయ, సహకార శాఖ అధికారులూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
