– అరటి కిలో రూపాయి
– కూటమి పాలనలో రైతులకు జరుగుతున్న మోసాలపై వైయస్సార్సీపీ నాయకులు ధ్వజం
– రాజమండ్రిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు (బాబి)
రాజమండ్రి: వ్యవసాయం, రైతు సమస్యలపై చంద్రబాబుకి చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఆయన ఎప్పుడు సీఎం అయినా రైతులకు అన్యాయం జరుగుతోందని వైయస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. రాజమండ్రిలోని పార్టీ జిల్లా కార్యాలయంలో తూర్పు గోదావరి జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామారావు (బాబి) మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలతో ప్రతిసారీ ఎక్కువగా నష్టపోతున్నది రైతులేనని, అయినా డ్రోన్, ఏఐ టెక్నాలజీల పేరుతో మోసం చేసే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014-19 మధ్య రైతు రుణమాఫీ పేరుతో మోసం చేసిన చంద్రబాబు, ఇప్పుడు కూడా ఒక్క అన్నదాత సుఖీభవ పథకం పేరుతోనే రెండేళ్లలో రైతులకు రూ.17 వేల కోట్లు నష్టం చేశార ని వివరించారు. దాదాపు 7 లక్షల మంది రైతులకు పథకం ఎగ్గొట్టడమే కాకుండా కౌలు రైతులను కనీసం రైతులుగా కూడా చంద్రబాబు గుర్తించడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టే మొక్కజొన్న, అరటి, వేరుశెనగ, పత్తి పంటలు కోతకొస్తే కనీసం రివ్యూ కూడా చేయలేదని ధ్వజమెత్తారు. మంత్రి వాసంశెట్టి సుభాష్‌తో తాను మీడియా సాక్షిగా బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ మంత్రి చెల్లుబోయిన చెప్పారు. . పత్తి, వేరుశెనగ, అరటి, మొక్కజొన్న పంటలు కోతకొచ్చినా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం సమీక్షించి మద్దతు ధర కల్పించడంపై నిర్ణయం తీసుకోలేదు. సీఎం చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సహా ఎవరూ సమీక్ష నిర్వహించినట్టుగా టీడీపీ అనుకూల మీడియాలో సైతం ఎక్కడా వార్తలు కూడా రాలేదు.
మొక్కజొన్న: మొక్కజొన్న పంటకు కనీస మద్ధతు ధర రూ.2,400 ఉంటే రూ. 1700లకు మించి కొనుగోలు చేయడం లేదు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మార్క్‌ఫెడ్ ద్వారా మొక్కజొన్నను కొనుగోలు చేసి ధరలు స్థిరీకరించే ప్రయత్నం జరుగుతున్నా ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా మొక్కజొన్న రైతులను గాలికొదిలేసింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా రైతులను ఆదుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయడం లేదు. మొంథా తుపాన్ కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు.
వారిని ఆదుకోవాల్సిందిపోయి సీసీఐ కేంద్రాలు తేమ శాతం, పత్తి పంట రంగు మారిందని చెప్పి పంట కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నాయి. తేమ శాతం 12 నుంచి 18శాతం ఉన్నా కొనుగోలు చేయాలన్న నిబంధనలున్నా సీసీఐ కేంద్రాలు పంట కొనేందుకు ముందుకురావడం లేదు. దీన్ని అవకాశంగా చేసుకుని దళారులు తక్కువ ధరకే కొనుగోలు చేసి దోచుకుంటున్నారు. గుంటూరు జిల్లాలో 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్న సురేష్ అనే కార్యకర్త గిట్టుబాటు ధర లేదనే బాధతో తన పత్తి పంటకు నిప్పు పెట్టాడు. రాయలసీమలో చాలా విస్తృతస్థాయిలో సాగయ్యే అరటి పంటను కొన్నాళ్ల కిందటి వరకు టన్ను రూ.18 వేల వరకు విక్రయిస్తుంటే ఇప్పుడు రూ.6వేలు కూడా పలకడం లేదు. కొన్నిచోట్ల టన్ను వెయ్యి రూపాయలకు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితి రైతులకు ఎదురవుతోంది. వీటితోపాటు మామిడి, మిర్చి, పొగాకు, చీనీ, టమాట, సజ్జ, పెసర, మినుము పంటలకు కూడా గిట్టుబాటు ధర దక్కడం లేదు. చంద్రబాబు దృష్టిలో కౌలు రైతులు అసలు రైతులే కాదు.