– జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఐఏఎస్
– ఘనంగా రాజాబహద్దూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాల స్నాతకోత్సవం
హైదరాబాద్, నవంబర్ 22: చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమవుతుందని ఆ దిశగా విద్యార్థులు ముందుకు వెళ్ళాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి ఐఏఎస్ సూచించారు. నారాయణగూడ లోని రాజా బహదూర్ వెంకటరామారెడ్డి మహిళా కళాశాలలో శనివారం నిర్వహించిన 14వ స్నాతకోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిధిగా పాల్గొని 2023 -24 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిగ్రీ సర్టిఫికెట్స్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో ఉన్న రాజా బహదూర్ వెంకటరామారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం కళాశాల అడిటోరియంలో ఏర్పాటు చేసిన స్నాతకోత్సవ వేడుకల్లో ఆమె మాట్లాడుతూ.. భవిష్యత్తు అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటే క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర అధ్యయనం ముఖ్యమని చెప్పారు. భవిష్యత్ అంతా యువతరానిదే అని అన్నారు. కళాశాల చదువు ముగిసిన వెంటనే ఉద్యోగాలు, పోటీ పరీక్షలు, ఉన్నత విద్య వంటి ఎన్నో మార్గాలు ఉన్నాయని, వాటిలో ఏదైనా ఒక్క దానిని ఎంచుకుని దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని సూచించారు.
డిజిటల్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రజంటేషన్స్ మెరుగుపరుచుకోవాలని, ఇవి ఉద్యోగ విపణిలో ఎంతో కీలకమని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం జీవితాంతం విద్యార్థులకు బలమని, సమాజం కోసం సేవాభావంతో పనిచేయాలని విద్యార్థులకు సూచించారు. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను అందజేశారు.
కార్యక్రమంలో ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ రాజేంద్ర సింగ్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జె. అచ్యుతదేవి, హైదరాబాద్ మహిళా విద్యా సంఘం కార్యాదర్శి ప్రొఫెసర్ కట్టా ముత్యంరెడ్డి, కళాశాల సెక్రటరీ కమ్ కరస్పాండెంట్ ప్రొఫెసర్ జి. సుదర్శన్ రెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ టి. వాణి మాధవి, వైస్ ప్రిన్సిపల్ కె. సింధూరి, కన్వీనర్ డాక్టర్ ఎం.సుచిత్ర, కో కన్వీనర్ డాక్టర్ కె. స్వప్న తదితరులు పాల్గొన్నారు.
