– లేదంటే క్షమాపణ చెప్పు
– మీ ఫ్రీహోల్డ్ జీవోల వెనుకున్న ‘రూ. లక్షల కోట్ల మతలబు’ ఏంటి?
– ఏ ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టలేదు… ముందు వాస్తవాలు తెలుసుకో
– 9292 ఎకరాల ఇండస్ట్రియల్ పార్కుల్లో… పరిశ్రమలకు ప్లాటింగ్ చేసింది 4740 ఎకరాలే
– రాష్ట్రానికి కొత్తగా పెట్టుబడులు రావద్దనేదే మీ అజెండా… అర్థమవుతుంది…
– హరీష్ రావు ‘అవాస్తవాల’పై మంత్రి శ్రీధర్ బాబు స్ట్రాంగ్ కౌంటర్
హైదరాబాద్: ‘ఆరోపణలు చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావుకు వెన్నతో పెట్టిన విద్య’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మండిపడ్డారు. తిమ్మిని బమ్మిని చేయడంలో వారిని మించిన వారు మరొకరు లేరని మరోసారి నిరూపించుకున్నారంటూ శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ఎద్దేశా చేశారు. వారు పదేపదే ప్రస్తావిస్తున్న రూ.5 లక్షల కోట్ల స్కాం ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవమని మరోసారి స్పష్టం చేశారు.
దమ్ముంటే ఆధారాలను బయటపెట్టి మాట్లాడాలని సవాలు విసిరారు. లేదంటే.. మీరు పదే పదే చేస్తున్న ప్రచారం కేవలం పచ్చి అబద్ధం, రాజకీయ దురుద్దేశం అని ఒప్పుకుని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘మీరు అధికారం కోల్పోయారనే బాధతో రూ. 5 లక్షల కోట్ల స్కాం అంటూ పాత రికార్డును పదే పదే వాయించే బదులు… మీరు ఆగస్టు 2023లో తెచ్చిన ఫ్రీహోల్డ్ జీవోల (19, 20, 21) వెనుక ఉన్న ‘రూ. లక్షల కోట్ల మతలబు’ గురించి ముందు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. గతంలో మంత్రిగా సుదీర్ఘ అనుభవమున్న హరీష్ రావు తమ ప్రభుత్వంపై ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు.
పారదర్శకంగా రాష్ట్ర ఖజానాకు రూ. 4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఆదాయాన్ని సమకూర్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే… స్కాంలు చేసి చేసి అలవాటైన బీఆర్ఎస్ నేతలకు మాత్రం ఇది మింగుడు పడటం లేదన్నారు. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రభుత్వ లీజ్ ల్యాండ్స్ కు ఫ్రీహోల్డ్ రైట్స్ ఇచ్చి, 100 శాతం, 200 శాతం ఛార్జీలు విధించి మీరు వసూలు చేద్దామనుకున్న రూ.లక్షల కోట్ల సంగతేంటంటూ ప్రశ్నించారు. అసలు ప్రభుత్వంతో సంబంధం లేని సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై ఆరోపణలు చేస్తే రాష్ట్ర ప్రజలు నమ్ముతారనే భ్రమ నుంచి బయటకు రావాలని బీఆర్ఎస్ నేతలకు సూచించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా యువతకు ఉద్యోగాలు దక్కకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. వాస్తవాలను దాచిపెట్టి తమ ప్రభుత్వం 9292 ఎకరాలు అమ్మకానికి పెట్టిందంటూ తమపై దుష్ర్పచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఈ భూముల్లో పరిశ్రమలకు ప్లాటింగ్ చేసిన ఏరియా లేదా ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీస్ కేవలం 4,740 ఎకరాలేనని, ఇవి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందిన భూములని స్పష్టం చేశారు. మిగిలిన భూములు రోడ్లు, డ్రెయినేజీ లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగించడం జరిగిందన్నారు. ఇప్పటికైనా నిజనిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.