– ప్రభుత్వం ఉత్తర్వులు
అమరావతి: సుప్రసిద్ధ పాత్రికేయ విశ్లేషకులు పూల విక్రమ్‌ను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడుకు అత్యంత సన్నిహితుడైన విక్రం, మూడు దశాబ్దాల నుంచి ఆయనతో కలసి ప్రయాణిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన టీడీపీ ప్రధాన కార్యాలయంలో ఎనలిస్టుగా వ్యవహరించారు. అనేక పుస్తకాలు రాసిన విక్రం.. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రాజకీయ కార్యదర్శి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడయిన టిడి జనార్దన్ దేశ-విదేశాల్లో నిర్వహిస్తున్న ఎన్టీఆర్ లిటరేచర్ కార్యక్రమాల్లో ముఖ్య భూమిక పోషించారు.
వివాదరహితుడు, సౌమ్యుడు, మేధావిగా పేరున్న విక్రం వివిధ చానెళ్లలో రాజకీయ ప్రముఖులతో నిర్వహించిన అనేక ఇంటర్వ్యూలు బహుళ ప్రాచుర్యం పొందాయి. వివిధ పత్రికల్లో ఆయన అనేక వ్యాసాలు రాసిన విషయం తెలిసిందే. తెలుగుభాషపై పట్టు-మమకారం ఉన్న తెలుగు భాషా పిపాసి విక్రమ్‌కు అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి రావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. సీనియర్ జర్నలిస్ట్, రచయిత విక్రమ్ పూల స్వస్థలం విజయవాడ. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక న్యాయ శాస్త్రంలో పట్టా పుచ్చుకొన్నారు.
1983 నుంచి పలు మీడియా మాధ్యమాలలో పని చేస్తూ వచ్చారు. జనత, ఆంధ్రభూమి దినపత్రికలలో; పల్లకి, ఆదివారం, మయూరి, షేర్ కాలమ్, బొబ్బిపులి వారపత్రికలకు వివిధ హోదాల్లో పనిచేశారు. ‘తెలుగుదేశం’ పార్టీ ఇన్ఫ్రాస్ మేగజైను అసోసియేట్ ఎడిటర్ గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లిటరేచర్ రూపకల్పనలో దశాబ్దానికిపైగా క్రియాశీలక పాత్ర పోషించారు. వందలాది వ్యాసాలు, కథలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి. రాజకీయాల నేపథ్యంపై 5 పుస్తకాలు రాశారు. అనువాద రచనలు చేశారు.
1993లో పల్లకి వార పత్రికలో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై ధారావాహిక రాశారు. 2023లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా ‘ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు’, ‘ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు’, ‘శకపురుషుడు’ పుస్తకాల రచనలో, రూపకల్పనలో భాగస్వాములయ్యారు. చంద్రబాబునాయుడు రాజకీయ జీవితంపై రాసిన ‘మహాస్వాప్నికుడు’ పుస్తకానికి విమర్శకుల ప్రశంసలు పొందారు. ఇటీవల నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ ప్రసంగాలను రెండు సంపుటాలుగా వెలువరించారు. ప్రముఖ రాజకీయ నాయకుల రచనలకు, పుస్తకాల రూపకల్పనలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 500లకు పైగా పొలిటికల్ ఇంటర్వ్యూలు చేశారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నస్ట్, పొటికల్ ఎనలిస్ట్ గా పని చేస్తున్నారు. తాజాగా 1984: ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం, సజీవచరిత్ర పుస్తకాన్ని టి.డి.జనార్ధన్ తో కలిసి రాశారు.