– డబుల్ స్టాండర్డ్స్ డైలీ: ‘సాక్షి’ చెప్పే నీతులు-చేసే పనులు!
– చట్టం మీ కళ్లకు అడ్డుగా ఉందా?
2015 MMDR చట్టం, మేజర్ మినరల్స్ గనుల వేలాన్ని తప్పనిసరి చేసింది. ఈ చట్టం కారణంగానే, ఆర్థిక పరిస్థితి బాగోలేని వైజాగ్ స్టీల్ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు గనుల కోసం పోటీపడలేకపోతున్నాయి. కానీ, అదే చట్టాన్ని అతిక్రమించి, గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తన భార్య పేరున ఉన్న భారతి సిమెంట్‌కు వేలం లేకుండా ఎన్నికలకు కొద్దిముందు లీజులు కట్టబెట్టారు.
ఈ అక్రమాలపై కేంద్ర గనుల శాఖ చర్యలు తీసుకోమని ఆదేశించింది. దాని ఆధారంగా, ఏజీ (అడ్వొకేట్ జనరల్) అభిప్రాయం తీసుకుని రద్దు చేయడానికి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సిమెంట్ కంపెనీ ప్రెస్ నోట్ కాదు! లీజుల రద్దు వార్త రాగానే సాక్షి పత్రిక పడే ఆత్రుత చూస్తే, అసలు ఇది వార్తాపత్రికా? లేక సిమెంట్ కంపెనీ లీగల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ నోటా? అనే అనుమానం కలుగుతుంది.
ఒకవైపు కేంద్ర చట్టాన్ని (2015 వేలం నిబంధన) పక్కన పెట్టి, రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించే పద్ధతిలో లీజులు తీసుకున్నామన్న ప్రధాన ఆరోపణపై ఒక్క మాట మాట్లాడకుండా… ‘కక్ష సాధింపు’, ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అంటూ రాజకీయ నిందలు వేయడం అంటే, అసలు విషయాన్ని దాచిపెట్టే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోంది. మీరు లీజులు తీసుకున్నప్పుడు కేంద్ర చట్టాలు, నిబంధనలు గుర్తుకు రాలేదా? ఇప్పుడెందుకు న్యాయం, ధర్మం, పారిశ్రామికవేత్తల భయం అంటూ కన్నీటి గాథలు వినిపిస్తున్నారు? గనుల లీజు అంటే… చట్టపరంగా వేలం ద్వారా ప్రభుత్వానికి డబ్బు కట్టాలి.
అది చేయకుండా ‘మా భూమి’ అంటూ సెల్ఫ్-గోల్ వేసుకోవడం హాస్యాస్పదం! ‘ప్రైవేటు భూమి’ డ్రామా మరియు కక్ష సాధింపు ఆరోపణ సాక్షి కథనంలో అత్యంత నాటకీయమైన పాయింట్ ఏంటంటే: “20 ఏళ్ల క్రితం ఆ కంపెనీ కొనుగోలు చేసిన ప్రైవేటు భూమి” అని పదేపదే చెప్పడం. నిజం ఏమిటంటే: భూమిపై మీకు ఎంత యాజమాన్యం ఉన్నా, దాని లోపలి సున్నపురాయి ఖనిజంపై మాత్రం భారత ప్రభుత్వానిదే హక్కు. మీరు కొన్నది పైనే తప్ప, భూమి లోపలి నిధిని కాదు! “ఇలా కక్ష సాధింపునకు పాల్పడితే పరిశ్రమలు ఎలా వస్తాయి?” అంటూ సాక్షి పత్రిక పారిశ్రామిక వర్గాల తరపున ఆందోళన వ్యక్తం చేయడం మరో హైలైట్.
నిజానికి పారిశ్రామిక వర్గాలు దేనికి భయపడతాయి?
* చట్టాలను ఉల్లంఘించి లీజులు పొందితే, అవి రద్దవుతాయనే భయం.
* పాత విధానంలో దోచుకున్న లీజులను వేలం ద్వారా పారదర్శకంగా కొత్త ప్రభుత్వం ఇస్తుందనే సంతోషం. కక్ష సాధింపు అనేది చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు కాదు; చట్టాన్ని కచ్చితంగా అమలు చేసినప్పుడే తమకు నష్టం జరుగుతుందని తెలిసిన వారికి మాత్రమే కనబడుతుంది. దేశంలో ఎక్కడైనా చట్టబద్ధంగా వేలంలో గనులు గెలుచుకున్న వారికి రక్షణ ఉంటుంది. కానీ, ఎక్కడైనా ఒక పత్రిక యజమాని కేంద్ర చట్టాన్ని ఉల్లంఘించి లీజులు పొంది, అది రద్దయితే, దానిని రాష్ట్రానికి విఘాతం అని ఏడుస్తారా! పరిశ్రమలు రావాలంటే, చట్ట ఉల్లంఘనను సమర్థించాలని సాక్షి చెబుతోంది!
కుటుంబం vs. రాష్ట్రం
సాక్షి పత్రిక కథనం కేవలం తమ యజమాని కంపెనీ ఆందోళనను రాజకీయ కక్ష సాధింపు అనే ముసుగులో కప్పిపుచ్చే ప్రయత్నం మాత్రమే. తన కుటుంబ కంపెనీ గనులపై పెట్టిన శ్రద్ధ మొత్తం, గత ఐదేళ్లలో ఒక్క రోజైనా వైజాగ్ స్టీల్ మరియు దాని గనుల కోసం జగన్ పెట్టాడా? అదే వైకాపా, సాక్షి, న్యూట్రల్ ముసుగులో అమ్ముడుబోయే సోషల్ మీడియా వైజాగ్ స్టీల్ పై ఒకలా ఏడుస్తారు. భారతీ సిమెంట్ దొంగ లీజుపై మాత్రం గప్‌చుప్ అవుతారు.
– చాకిరేవు

