– నిబంధనల పేరుతో రైతును వేధిస్తే ఊరుకునేది లేదు :
ప్రభుత్వాన్ని హెచ్చరించిన వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్
తాడేపల్లి: రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను ఎలాంటి నిబంధనలు లేకుండా కనీస మద్ధతు ధర రూ. 1790లు చెల్లించి కొనుగోలు చేయల్సిందేనని, తేమశాతం పేరుతో వేధిస్తే వైయస్సార్సీపీ చూస్తూ ఊరుకోదని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అసలే మొంథా తుపాన్‌తో దిగుబడి తగ్గిపోయి అల్లాడిపోతుంటే ఇంకోపక్క కోత ఖర్చులు కూడా తడిసి మోపెడయ్యాయని వివరించారు.
ఈ స్థితిలో రైతుల వద్ద దళారులు రూ.1400లకు మించి కొనడం లేదని, 40 కేజీలకు ఒక కేజీ మైనస్ చేయడంతో మరింత తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థితిలో హమాలీ ఖర్చులు, ట్రాన్స్‌పోర్టేషన్ పేరుతో రైతులను దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రైతులకు అవసరమైన గన్ని బ్యాగులు ఎప్పటికప్పుడు సరఫరా చేయడంతో పాటు మొంథా తుపాన్ సందర్భంగా ఎన్యుమరేషన్ చేసిన ప్రకారం తక్షణం ఇన్పుట్ సబ్సిడీ అందజేసి రైతుల్ని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబుని కోరారు.
ఇకనుంచైనా వైయస్సార్సీపీ హయాంలో జరిగిన విధంగా ఇన్సూరెన్స్ విధానం తీసుకురావాలని కైలే అనిల్ కుమార్ డిమాండ్ చేశారు. . వైయస్సార్సీపీ హయాంలో రైతు భరోసా ద్వారా ఒక్కో రైతుకు ఏడాదికి రూ. 13,500 చొప్పున ఐదేళ్లలో రూ. 67,500 చెల్లించారు. ఐదేళ్లలో 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.34,378 కోట్లు పెట్టుబడి సాయం అందజేస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం రెండేళ్లలో ఇచ్చింది కేవలం రూ. 4,685 కోట్లు మాత్రమే. రూ. 40 వేలకు గాను జమ చేసింది కేవలం రూ.10 వేలే. పైగా 7లక్షల మంది రైతులను పథకానికి దూరం చేశారు.
తుపాన్ కారణంగా పంట మునిగి రైతులు అల్లాడిపోతుంటే అధికారులు పొలాల వద్దకొచ్చి ఎన్యుమరేషన్ కూడా చేయడం లేదు. ఎకరం 40 బస్తాలు ధాన్యం పండే పొలాలు, తుపాన్ కారణంగా 25 బస్తాలకే పరిమితం అయిపొయిన పరిస్థితి. నా నియోజకవర్గం పామర్రులో విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు రైతులు రోడ్లపై ధాన్యం ఎండబెట్టుకుంటూ కుటుంబాలన్నీ రోజంతా రోడ్డు మీదనే ఉంటున్నాయి. అయినా ధాన్యం కొనుగోలు చేసే ప్రయత్నం చేయడం లేదు.
గతంలో ఎకరాకు రూ. 2500లు తీసుకునే వరి కోత యంత్రాలు తుపాన్ కారణంగా రూ. 4500 తీసుకుంటున్నాయి. ఒకవైపు పంట దిగుబడి 15 బస్తాలు తగ్గిపోవడం ఒకనష్టమైతే, ఇంకోవిధంగా వరికోతల ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. కేంద్రం నిర్ణయించిన ధాన్యం కనీస మద్ధతు ధర రూ.1790 ఉంటే అన్ని బాగున్న ధాన్యాన్ని రైస్ మిల్లర్లు రూ. 1400లకు మించి చెల్లించడం లేదు. తేమ శాతం పేరుతో మరింత ధర తగ్గిస్తున్నారు. ప్రతి 40 కేజీలకు ఒక కేజీ తగ్గిస్తున్నారు. నాడు వైయస్సార్సీపీ హయాంలో విత్తనం నుంచి విక్రయం వరకు రైతు భరోసా కేంద్రాలు రైతులకు అండగా నిలబడితే, నేడు అడుగడుగునా దళారుల రాజ్యం నడుస్తోంది. వారు చెప్పిన ధరకు పంటను తెగనమ్ముకోవాల్సి వస్తోంది. పంట నష్టపరిహారం కోసం నమోదు చేసుకుంటే ధాన్యం కొనబోమని ప్రభుత్వమే బెదిరించడం మరింత దుర్మార్గం.