అమరావతి: అమరావతి జర్నలిస్టు హౌసింగ్ ప్రాజెక్ట్ పై ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ( జిఏడి – పొలిటికల్, ఐపిఆర్ ) ముఖేష్ కుమార్ మీనా సానుకూలంగా స్పందించారు. జర్నలిస్టుల కోసం సిఆర్డీఎ ఆధ్వర్యంలో బహుళ అంతస్థుల గృహ సముదాయాన్ని నాలుగు కేటగిరీలలో నిర్మించే నిమిత్తం 30 ఎకరాల భూమిని మందడం, తుళ్లూరు పరిధిలో అమరావతి హౌసింగ్ సొసైటీకి కేటాయించటం జరిగింది.
దానిని తిరిగి సిఆర్డీఏకు అప్పగిస్తూ సిఆర్డీఏ ఆధ్వర్యంలోనే ప్రాజెక్ట్ నిర్మించాలని సొసైటీ గతంలో ప్రభుత్వాని కోరింది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అంగీకరించిన నేపథ్యంలో ప్రభుత్వం జీవో నెంబర్ 107 ఇస్తూ హ్యాపీనెస్ట్ మోడల్ లో నిర్మిస్తామని పేర్కొంది. ఇప్పుడు ఆ ఉత్తర్వులు అమలు జరిగేలా చూడాలని కోరుతూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మీనా ని కలిసి కోరటం జరిగింది.
అందుకు ఆయన సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను మరియి హౌసింగ్ సొసైటీ విజ్ఞప్తిని సిఆర్డీఎ దష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి మీనా ని కలిసిన వారిలో అమరావతి జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ కార్యదర్శి పాటిబండ్ల నాగశ్రీనినాసరావు, డైరక్టర్ చావా రవి, హిందూ డిప్యూటీ ఎడిటర్ శ్రీనాధ్ ఉన్నారు.