– పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా?
– ఇంకొకరు మాట్లాడితే తప్పా?
– పేదలకు ఉచిత వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
– నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు
– మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం
– ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు
– మీ పరిధిలో చేతనైతే చర్యలు తీసుకొండి : మరోసారి స్పష్టం చేసిన శాసనమండలి విపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
– గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు
– అనంతరం తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శాసన మండలి విపక్షనేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
తాడేపల్లి: పేద విద్యార్ధులకు ఉచిత వైద్య విద్యను, పేదలకు వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తాడేపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ… ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. నాణ్యమైన విద్య, వైద్యం పేదలకు రాజ్యాంగం ప్రసాదించిన హక్కు.. ఆ పేదలకు వాతిని దూరం చేసే హక్కు ప్రభుత్వానికి లేదన్న ఆయన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం రద్దయ్యే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.
ఇదే అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశామని…. ఒక కమిటీ ద్వారా ర్యాండమ్ చెకింగ్ చేయమని గవర్నర్ కి విజ్ఞప్తి చేశామన్నారు. . స్కూలు పిల్లలకు ఉచిత ట్యాబులిస్తే, గేమ్స్ ఆడుకుంటారని మాక్ అసెంబ్లీలో వారితో చెప్పించం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో బాధ్యతగల ప్రతిపక్షంగా ప్రజలకు జరుగుతున్న నష్టాన్ని నివారించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ కార్యక్రమం చేశాం. ఈ ప్రభుత్వానికి ఏమైంది? పేదల మీద ఎందుకు కక్ష? వైయస్.జగన్ మీద వైయస్సార్సీపీ నేతల మీద కక్ష ఉంటే తీర్చుకొండి. పేదలు ఏం చేశారు? నెలకు రూ.300 కోట్లు ఆరోగ్యశ్రీ కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేయలేదా? సుమారు 18 నెలలు అయింది. 18 నెలల్లో కేవలం రూ.800 కోట్లు విడుదల చేసింది. మిగిలిన కాలానికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోతే నెట్ వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద పేదవాళ్లకు చికిత్స అందించని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో ప్రైవేటు కంపెనీకి ఇన్సూరెన్స్ మోడ్ లో ఇస్తామంటున్నారు.
అధి సాధ్యమా? అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను తొలగించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడి వ్యాఖ్యలపై స్పందిస్తూ… స్పీకర్ తో పాటు ఆయన వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలందరికీ చాలా స్పష్టంగా చెబుతున్నాం. రాజ్యాంగ బద్దంగా, రాజ్యాంగంలో ఏ కార్యక్రమమైనా మీ పరిధిలో ఉంటే నిర్ణయం తీసుకోమని చెబుతున్నాం. మీ పరిధిలో లేని అంశాల గురించి అలాంటి మాటలు మాట్లాడకూదన్న ఆలోచన, ఇంగితం జ్ఞానం లేదా? పదే, పదే వాటి ప్రస్తావన ఎందుకు? చులకన మాటలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదు. దీనిపై తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం.
పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. కేంద్రంలోనూ సభ జరిగింది. అక్కడ వేదిక మీద ఎవరున్నారు? రాజ్యాంగం అంటే కేవలం అధికార పార్టీలో ఉన్న ముగ్గురేనా? ప్రతిపక్ష పార్టీ లేదా? ప్రతిపక్ష నేతగా నన్ను ఆహ్వానించారా? అంటే ప్రతిపక్ష నేతలను వారి ఉనికిని కూడా భరించలేని స్ధితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఇక రాజ్యాంగం గురించి మాట్లాడే అర్హత మీకు ఉందా? వ్యవస్థకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఇదేనా మీ 40 ఏళ్ల అనుభవం చంద్రబాబుగారూ? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత తాను గతంలో మాట్లాడిన ప్రసంగాలను ఒక్కసారి వెనక్కి వెళ్లి చూసుకుని అప్పుడు మాట్లాడితే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ బూతులు మాట్లాడితే ఒప్పా? ఇంకొకరు మాట్లాడితే తప్పా? పవన్ కళ్యాణ్ కాకినాడ వెళ్లి రేషన్ బియ్యం గురించి హడావుడి చేశారు. మరి ఆ తర్వాత కూడా బియ్యం అక్రమ రవాణా ఎందుకు ఆగలేదు? ఒక డీఎస్పీ అవినీతిపరుడుని, పేకాట క్లబ్బులు నడిపిస్తున్నాడని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరి అదే డీఎస్పీకి అవార్డులు, రివార్డులు ఎలా ఇచ్చారు?