హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని కల్వకుంట్ల చంద్రశేఖర రావు సాధించి పెట్టడమే కాక తన పదేళ్ల పాలనలో హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర చెప్పారు. కేసీఆర్ మార్గనిర్దేశనంలో ఐటీ,పురపాలక,పరిశ్రమల శాఖల మంత్రిగా కే.టీ.రామారావు అమెరికాలోని న్యూయార్క్,డల్లాస్,చికాగోలకు ధీటుగా హైదరాబాద్ నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేశారని ఎంపీ రవిచంద్ర వివరించారు.
ఢిల్లీ కేంద్రంగా పని చేస్తున్న భారత్ గౌరవ్ ఫౌండేషన్ ఎంపీ రవిచంద్రకు జీవన సాఫల్య పురస్కారాన్ని బహుకరించింది. ఫౌండేషన్ 8వ వార్షిక పురస్కారాల ప్రదానోత్సవం హైదరాబాద్ హైటెక్ సిటీలోని అవాసా హోటల్ కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఘనంగా జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ నుంచి పురస్కారాన్ని అందుకున్న ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ,కేసీఆర్ హయాంలో హైదరాబాద్ ఐటీ,ఫార్మా హబ్ గా రూపుదాల్చిందని…ఇక్కడ నుంచి ఎంతోమంది గొప్పగా ఎదిగి పలు దేశాలలో ఉన్నత పదవుల్లో అధిష్టించి సేవలందిస్తున్నారని పేర్కొన్నారు.
మన దేశంలో యువతకు ఏ మాత్రం కొదవ లేదని,అపారమైన యువ సంపద ఉందని, 40 ఏండ్ల వయస్సు లోబడి ఉన్న వాళ్లు కోట్ల మంది ఉండడాన్ని మొన్ననే ఖమ్మంలో సర్థార్ పటేల్ “యూనిటీ రన్”సందర్భంగా గుర్తు చేశాననన్నారు.యువతకు అవకాశాలు ఇస్తే,వారి శక్తియుక్తులను సద్వినియోగం చేసుకుంటే దేశం మరింత గొప్పగా ప్రగతిపథాన పరుగులు పెడుతుందన్నారు.ఫౌండేషన్ నిర్వాహకులు సందేశ్ యాదవ్,ఆయన బృందం ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎంపీ రవిచంద్ర చెప్పారు. రాజ్యసభ సభ్యుడిగా తాను విద్య, వైద్యారోగ్య రంగాల ఉన్నతికి,చిన్న,మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్,చిన్నజీయర్ స్వామి, ఒలింపిక్ ఛాంపియన్ సైనా నెహ్వాల్, ఐపీఎస్ అధికారి అంజనీకుమార్ తదితరులు ప్రసంగించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు రవిచంద్రకు నిర్వాహకులు పుష్పగుచ్ఛమిచ్చి సాదర స్వాగతం పలికి, శాలువాతో సత్కరించారు.

