– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి : మాజీ టీటీడీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు ధర్మారాజు వారసుల మాదిరిగా నీతిమంతులుగా పైకి కనిపిస్తున్నప్పటికి తెరచాటున దొంగ పనులు, తప్పుడు పనులు చేశారని ఆరోపించారు.
స్వామివారి సేవ చేయమని పదవులు ఇస్తే, స్వామివారి సొమ్మునే దోచుకున్న ఘనపాటిలు వీరు అని అన్నారు. ముఖ్యంగా వైవీ సుబ్బారెడ్డి ఛైర్మన్‌గా ఉన్న కాలంలో కల్తీ నెయ్యి సరఫరా జరిగిందన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా విచారణకు సిద్ధమని ఒప్పుకోవడం, ఆ దర్యాప్తు సీఐడీ చీఫ్ అయ్యన్నార్ ఆధ్వర్యంలో జరుగుతుందని తెలిపారు. గత ఐదేళ్ల పాలనలో 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి టీటీడీకి సరఫరా అయినట్లు సిట్ విచారణలో బయటపడిందని, దీనికి సూత్రధారి వైవీ సుబ్బారెడ్డేనని ఆరోపించారు.
ఈ కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి ‘లైవ్ డిటెక్షన్ టెస్ట్’కు సిద్ధమని చెప్పడాన్ని తప్పు పడుతూ, నిజంగా నిజాయితీ ఉంటే నార్కో అనాలసిస్ టెస్ట్‌కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. నార్కో అనాలసిస్‌కు వస్తే చిన్నప్పన్నకు, సుబ్బారెడ్డికి, ఇతర పెద్దలకు ఎంతెంత వెళ్లిందో ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న పరిస్థితులు బయటపడతాయని అన్నారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన కంపెనీలైన ప్రిమీయర్ అగ్రిఫుడ్, వైష్ణవి డెయిరీ, బొలే బాబా డెయిరీల నుండి వచ్చిన నమూనాలలో కల్తీ జరిగినట్లు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఉన్నా కమీషన్ల కోసం వారిపై చర్యలు తీసుకోలేదు.
సీఐడీ అడిగినా వైవీ సుబ్బారెడ్డి తన బ్యాంక్ అకౌంట్స్ వివరాలు ఇవ్వకపోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కాఫీలు, టీలు అందించే చిన్నప్పన్న అకౌంట్లోనే రూ. 5-6 కోట్లు ఉంటే, అసలు ఘనపాటి అయిన సుబ్బారెడ్డి అకౌంట్లో ఎంత ఉండాలని ప్రశ్నించారు. కేజీ నెయ్యి రూ. 320 చొప్పున 68 లక్షల కేజీలు అమ్మితే, కమీషన్ వందల కోట్లలో ఉంటుందని, అందుకే అకౌంట్స్ వివరాలు ఇవ్వకుండా కోర్టుకు వెళ్లారని, ఇది వారి డొల్లతనాన్ని బయటపెట్టిందని స్పష్టం చేశారు.
టెండర్ నిబంధనలు సడలించి దొంగ కంపెనీల నుంచి నెయ్యి ఎందుకు తీసుకున్నారని, ఈ తప్పును అధికారులపైకి నెట్టి కమీషన్లు తిన్నారని ఆరోపించారు. ఏదైనా ఆస్తి లేదా పెద్ద బహుమతిని స్వామివారి పేరుతో స్వీకరించే ముందు, దాని గురించి 30 రోజుల ముందుగా ప్రముఖ దినపత్రికలలోప్రకటనలు ఇవ్వాలి. ఈ 30 రోజుల వ్యవధిలో ఆ గిఫ్ట్ లేదా ఆస్తిపై ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నాయేమో పరిశీలించాలి. ఎటువంటి అభ్యంతరాలు లేకపోతేనే లేదా అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే, ఆ గిఫ్ట్‌ను టీటీడీ బోర్డు తరఫున అంగీకరించాలి.
నిబంధనల ప్రకారం, బహిరంగ ప్రకటన ఇవ్వకుండా, అభ్యంతరాల పరిశీలన లేకుండా గిఫ్ట్ పత్రాన్ని ఆమోదించడం అనేది టీటీడీ నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుంది. ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఇచ్చిన ఆస్తుల బహుమతిని అత్యంత వేగంగా, రహస్యంగా ఆమోదించడానికి గల కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. చార్లెస్ శోభరాజ్, వీరప్పన్, ఎస్కోబార్ లాంటి పేరుగాంచిన కరుడుగట్టిన నేరస్థుల నేరం రుజువయ్యేంత వరకు అందరూ తాము తప్పు చేయలేదని నీతిమంతులమని చెప్పుకుంటారు.
అదేవిధంగా వైవీ సుబ్బారెడ్డి కూడా అదే పంథాలో ‘లైవ్ డిటెక్షన్ టెస్ట్’కు సిద్ధమని చెప్పుకున్నారు. ‘నార్కో అనాలసిస్’కు సిద్ధపడితే నిజాలు బయటికి వస్తాయన్నారు. సజ్జల రామకృష్ణ రెడ్డి వంటి వైసీపీ నాయకులు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ దర్యాప్తు వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారని మాట్లాడటంపై మండిపడ్డారు. కల్తీ నెయ్యి కేసును దర్యాప్తు చేయమని ఆదేశించింది చంద్రబాబు కాదు, సుప్రీంకోర్టు అని అదేవిధంగా పరకామణి కేసును దర్యాప్తు చేయమని ఆదేశించింది హైకోర్టు అని స్పష్టం చేశారు.
ఈ దర్యాప్తులు జరుగుతుంటే వాటి వెనుక చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అనడం అవగాహన రాహిత్యమని విమర్శించారు. నేరం చేయనివారు ప్రమాణాలు చేయాల్సిన అవసరం లేదని, దొంగతనం చేసినవాడే ‘ప్రమాణం చేస్తాను, లైవ్ డిటెక్టివ్‌కు వస్తాను’ అని అంటాడని ఇది వైసీపీ నాయకులకు అలవాటైందని ధ్వజమెత్తారు. రూ. 428కి నెయ్యి సరఫరా చేయలేమని తిరస్కరించిన ఏ ఆర్ డెయిరీ వారు ఆ తర్వాత రూ. 320కి పది లక్షల కేజీల నెయ్యిని ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. అంటే అది నెయ్యి కాదని మోసం చేశారని స్పష్టమవుతోందని అన్నారు.
స్వామివారికి అన్యాయం చేసిన ఏ వ్యక్తి కూడా బతికి బట్టకట్టలేదని హెచ్చరిస్తూ ఈ దుర్మార్గపు పనుల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని గతం ప్రభుత్వ హయాంలో భక్తుల రద్దీ కూడా తగ్గిందని అభిప్రాయపడ్డారు. స్వామివారు కన్ను తెరిచిన రోజునా స్వామివారి చూపు మీ మీద పడ్డరోజునా మీ పరిస్థితి వర్ణనాతీతం. స్వామివారి సొమ్మును దోచుకున్న వారు ఎవరూ బతికి బట్టకట్టలేదన్నారు.