– సీఎం రేవంత్ రెడ్డి ఒక బుడ్డరుఖాన్
– నాటి ’దీక్షాదివస్’ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రం
– నేడు కాంగ్రెస్, బీజేపీ లను బొంద పెట్టే బ్రహ్మాస్త్రం
– స్థానిక సంస్థల ఎన్నికల ’యుద్దానికి’ బీఆర్ఎస్ సిద్ధం
– నిజామాబాద్ ‘దీక్షాదివస్’లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి
నిజామాబాద్: నాటి ’దీక్షాదివస్’ తెలంగాణ సాధించిన దివ్యాస్త్రం. నేడు ప్రజావ్యతిరేక కాంగ్రెస్, బీజేపీ లను బొంద పెట్టే బ్రహ్మాస్త్రం అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ నగరంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం తెలంగాణ భవన్ లో శని వారం పెద్ద ఎత్తున నిర్వహించిన ‘దీక్షాదివస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..బీఆర్ఎస్ ది, కేసీఆర్ ది ఫైటర్స్ ఫ్యామిలీ. రేవంత్ ది చీటర్స్ ఫ్యామిలీ. కాంగ్రెస్ ది అవినీతి ఫ్యామిలీ. సీఎం రేవంత్ రెడ్డి ఒక బుడ్డరుఖాన్ అని ఆయన ఎద్దేవా చేశారు.
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం సాధించి ఉండకపోతే రేవంత్ సీఎం కాదు కదా చెప్రాసీ కూడా అయివుండేవాడు కాదన్నారు. ఇక్కడి బుడ్డరు ఖాన్ మహేశ్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు కాలేడు. భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి అయ్యేవారా?. అల్జీమర్ సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కాగలరా?.బీఆర్ఎస్ ది 60లక్షల సైన్యం. మా కార్యకర్తలు వ్యక్తులు కాదు మహాశక్తులు. కేసీఆర్ 500కే వీ ట్రాన్స్ ఫార్మర్ అయితే మా కార్యకర్తలు 3-పేజ్ కరెంటు. ముట్టుకుంటే మాడి మసై పోతారు. తెలంగాణ చరిత్రలో కేసీఆర్ ది ఎప్పటికీ చేరిపేయలేని సంతక మన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం ఎవరివల్ల కాదన్నారు. తెలంగాణ చెట్టు తల్లి వేరు లాంటివారని ఎవడో వచ్చి పీకేయడానికి కేసీఆర్ మొక్కకాదని, వటవృక్షమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణకు మళ్లీ అదే అంధకారం వచ్చింది.
చిట్టినాయుడి అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు. నువ్వు మోసం చేయని ప్రజలెవరయినా ఉన్నారా?.రేవంత్ రెడ్డి ను తిట్టని వారెవరైనా ఉన్నారా?. నిజామాబాద్ జిల్లా గులాబీ గడ్డ కేసీఆర్ అడ్డా అని ఆయన అన్నారు. దీక్ష దివాస్ సందర్భంగా వినాయక్ నగర్ లో గల అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలకు పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
దీక్షాదివస్ కర్మ, కర్త, క్రియ అయిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినరక్తదాన శిబిరంలో బీ ఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు రక్తదానం చేశారు. పార్టీ కార్యాలయం లోనే అన్నదాన కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మాజీ ఎమ్మెల్సీ వి.జి గౌడ్, మాజీ జడ్పి ఛైర్మన్ విఠల్ రావు, ఆయేషా ఫాతీమా, మాజీ మేయర్ నీతుకిరణ్, ఉద్యమకారులు,బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.