– క్వాంటమ్ విప్లవంలో ఆంధ్రప్రదేశ్: 50 వేల మందికి అద్భుత అవకాశం
– మన జీన్స్ లో ఆ టేలెంట్ ఉంది
– అందుకే ఈ అవకాశాలు వస్తున్నాయి అని మరిచిపోకండి
రాష్ట్రాన్ని క్వాంటమ్ టాలెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలనే బృహత్తర లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 50,000 మందికి క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వడానికి సిద్ధమైంది. ‘అమరావతి క్వాంటమ్ మిషన్ (AQV)’లో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమం డిసెంబరు 8న ప్రారంభం కానుంది. ముఖ్య వివరాలు: ఈ శిక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అమెరికాకు చెందిన వైజర్ (WiSER) మరియు హైదరాబాద్‌లోని క్యూబిటెక్ స్మార్ట్ సొల్యూషన్స్ వంటి అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ కోర్సులు రాబోయే నాలుగేళ్లపాటు కొనసాగుతాయి. ఈ కార్యక్రమం ముఖ్యంగా ఇంజినీరింగ్ విద్యార్థులు, డిగ్రీలో గణితం, భౌతికశాస్త్రం, కంప్యూటర్ సైన్స్ చదువుతున్నవారు, అలాగే ఉద్యోగులు, అధ్యాపకులను లక్ష్యంగా చేసుకుంది. కోర్సు పూర్తిగా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది.
శిక్షణ దశలు, ఫీజు మరియు ప్రోత్సాహకాలు: ఈ శిక్షణ కార్యక్రమం రెండు ప్రధాన దశల్లో (ఫేజ్-1, ఫేజ్-2) నిర్వహించబడుతుంది.
ఫేజ్-1 (ఫౌండేషన్ కోర్సు): ఇది నాలుగు వారాల ప్రాథమిక శిక్షణ. ఏపీ విద్యార్థులకు ఫీజు కేవలం ₹500 మాత్రమే. ఇతర రాష్ట్రాల వారికి, ఉద్యోగులకు వేర్వేరు ఫీజులు నిర్ణయించారు. ఇందులో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రాథమిక అంశాలు, వివిధ రంగాలలో దాని అనువర్తనాలపై అవగాహన కల్పిస్తారు.
* ఫేజ్-2 (అడ్వాన్స్డ్ కోర్సు): ఫేజ్-1లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3,000 మందికి ఈ ఆరు వారాల అడ్వాన్స్డ్ కోర్సులో పూర్తిగా ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఈ దశలో అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ రూపొందించడంపై దృష్టి సారిస్తారు.
అద్భుతమైన ప్రోత్సాహకాలు: ఫేజ్-2లో టాప్‌గా నిలిచిన 100 మందికి ‘యంగ్ రీసెర్చర్స్ స్కాలర్షిప్’ మరియు వైజర్ సంస్థ నిర్వహించే క్వాంటమ్ సమ్మర్ స్కూల్లో ఉచిత ప్రత్యేక శిక్షణ లభిస్తుంది. అంతేకాకుండా, 300 నుంచి 400 మంది విద్యార్థులకు వివిధ కంపెనీలలో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించడానికి వైజర్ సంస్థ తోడ్పడుతుంది.
వరల్డ్ క్లాస్ టీచింగ్ : ఈ కోర్సులో ఎంఐటీ, ప్రిన్స్టన్, స్టాన్ఫోర్డ్ వంటి ప్రఖ్యాత సంస్థల ప్రొఫెసర్ల లెక్చర్లు, అలాగే నోబెల్ బహుమతి గ్రహీత ప్రొఫెసర్ విలియం ఫిలిప్స్ ఉపన్యాసాలు కూడా అందుబాటులో ఉంటాయి. గూగుల్, ఐయాన్‌క్యూ వంటి సంస్థలకు చెందిన క్వాంటమ్ ల్యాబ్‌ల వర్చువల్ టూర్లు, పరిశ్రమల నిపుణులతో ప్యానల్ డిస్కషన్లు ఈ శిక్షణకు అంతర్జాతీయ స్థాయిని కల్పిస్తున్నాయి. సరికొత్త టెక్నాలజీలో దూసుకుపోవాలనుకునే యువతకు ఇది ఒక సువర్ణావకాశం.
ఈ కోర్సులో చేరాలనుకునేవారు learn.qubitech.io వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. గుడ్డు మీద ఈకలు పీక్కుండా నమ్మి నాయుడు ఆయన తనయుడు తెచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోండి. ఏ స్థాయికి వెళతారో మీ సమర్ధతను బట్టి ఉంటుంది. భయం లేకుండా బరిలోకి దిగండి. కనీసం మీ రెజ్యూంలో అమరావతి క్వాంటం అని పేర్కొన్నా.. దాని గురించి మాట్లగలిగినా మీ జీవితం మారిపోవచ్చు. వేలు, లక్షలు కాదుగా.. ఓ 5 వందల రూపాయలేగా. సండే ఖర్చు కూడా కాదు. ప్రయత్నించడంలో తప్పులేదు. ఆల్ ది బెస్ట్. మీ పిల్లలకి కూడా ట్రై చెయ్యమని చెప్పండి. మన జీన్స్ లో ఆ టేలెంట్ ఉంది. అందుకే ఈ అవకాశాలు వస్తున్నాయి అని మరిచిపోకండి.